Begin typing your search above and press return to search.

ఇంకో డిప్యూటీ సీఎంకు కేసీఆర్ మార్క్ ఝలక్

By:  Tupaki Desk   |   11 Jun 2017 10:16 AM GMT
ఇంకో డిప్యూటీ సీఎంకు కేసీఆర్ మార్క్ ఝలక్
X
తెలంగాణ రాష్ట్రంలో ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉన్న సీనియ‌ర్ నేత‌ విష‌యంలో మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం వెలువ‌డ‌నుందా? ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు ఈ విష‌యంలో స్ప‌ష్ట‌మైన ఆలోచ‌న‌తో ఉన్నారా? అంటే అవున‌నే స‌మాధానం రాజ‌కీయ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. మియాపూర్‌ లోని ప్రభుత్వ భూముల స్కాంతో పాటు హైదరాబాద్‌ - రంగారెడ్డి జిల్లాల్లో భూముల పరాధీనంపై కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. రెవెన్యూ శాఖను పూర్తిస్థాయిలో సంస్కరించడానికి నిర్ణయించిన కేసీఆర్‌ అనేక విభాగాల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులపై బదిలీ వేటు వేయాలని ఆయన సంకల్పించారు. నాలుగైదు రోజుల్లో బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా ఈ శాఖ‌ను స్వ‌యంగా తానే నిర్వ‌హించేందుకు సిద్ధ‌మైన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

మియాపూర్‌లో ప్రభుత్వ భూములను ప్రైవేట్‌ వ్యక్తులకు - సంస్థలకు రిజిస్ట్రేషన్‌ చేయించిన వైనంపై సీఎం కేసీఆర్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే పలుమార్లు తన కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారులు - రెవెన్యూ శాఖకు చెందిన అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించిన సీఎం ఎటువంటి పరిస్థితిలోనూ అక్రమాలకు తావివ్వరాదన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మియాపూర్‌ స్కాంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలున్న సబ్‌ రిజిస్ట్రార్లను పెద్దఎత్తున బదిలీ చేయడంతోపాటు ఈ వ్యవహారంలో పాలు పంచుకున్న మరో ముగ్గురిని ఉద్యోగాల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. రెవెన్యూ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. మంత్రివ‌ర్గంలో కీలకమైన రెవెన్యూ శాఖను ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ నిర్వహిస్తున్నారు. ఆయన నుంచి ఈ శాఖను తప్పించి తానే స్వయంగా రెవెన్యూ శాఖను తీసుకుని ఈ శాఖను సంస్కరించాలన్న యోచనలో కేసీఆర్‌ ఉన్నట్టు తెలుస్తోంది. రెవెన్యూ శాఖలో ముఖ్యంగా స్టాంపులు - రిజిస్ట్రేషన్ల విభాగం కీలకంగా ఉంది. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీకి అనుభవం లేకపోవడం, ఈ శాఖలో పనిచేస్తున్న సీనియర్‌ అధికారులు ఆయనకు సహకరించక పోవడంవల్లే ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న అభిప్రాయానికి కేసీఆర్‌ వచ్చినట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

అధికారం చేపట్టిన ఈ మూడేళ్ల‌లో రెవెన్యూ శాఖలో జరిగిన అక్రమాలపై ఉన్నతాధికారులతో చర్చించిన కేసీఆర్‌ ప్రభుత్వ భూముల విషయంలో ఇంకెంత మాత్రం మౌనంగా ఉండరాదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అవినీతికి పాల్పడుతున్న అధికారులపై వేటు వేయడంతో పాటు అవసరమైతే వారిపై క్రిమినల్‌ కేసులను కూడా బనాయించాలని సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన అంతర్గత సమావేశంలో అధికారులకు హుకుం జారీచేసినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఉప ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న సీనియ‌ర్ ఎమ్మెల్యే టి.రాజయ్య‌ను ఆ ప‌ద‌వి నుంచి తొల‌గించి సంచ‌ల‌నం నిర్ణ‌యం తీసుకున్న కేసీఆర్ అదే రీతిలో ఇప్పుడు మ‌హ‌మూద్ అలీ విష‌యంలో ముందుకు సాగుతారా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/