Begin typing your search above and press return to search.
సెక్షన్ 8 కేసీఆర్ ఎత్తు రెడీ
By: Tupaki Desk | 23 Jun 2015 4:34 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు ఉద్యమబాట పట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ లో సెక్షన్8 అమలు చేయడంపై కేంద్రం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ రాష్ర్ట గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ తన ఎత్తులు సిద్ధం చేసుకుంటున్నారు.
సెక్షన్8 అమలుకు రంగం సిద్ధమైందని తెలిసిన నేపథ్యంలో వెంటనే గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలిశారు. సెక్షన్8 ను అమలుచేయవద్దంటూ విన్నవించారు. ఒకవేళ చేస్తే తాము తీవ్రంగా నిరసన తెలుపుతామంటూ స్పష్టం చేశారు. అయితే ఇంతటితో ఆగకుండా తర్వాతి కసరత్తును మొదలు చేసినట్లు సమాచారం.
సెక్షన్ 8ను సెంటిమెంటుగా మార్చడానికి చకచకా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీ నేతలు శ్రీనివాస్‌గౌడ్, దేవీప్రసాదరావుల నేతృత్వంలో ఉన్న టీఎన్‌జీవో సంఘం సమావేశం ఏర్పాటు చేయించారు. అనంతరం సంఘం నేతలు ఆందోళనకు సమాయత్తం అవుతున్నట్లు ప్రకటించారు. మధ్యాహ్న భోజన సమయంలో నల్ల బాడ్జిలతో నిరసన తెలియచేస్తామని సదరు సంఘం నేతలు వెల్లడించారు. దీంతోపాటు తెలంగాణ బంద్ కు పిలుపు ఇవ్వాలని కూడా యోచిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు కేసీఆర్ అమరణ దీక్షకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. త్వరలో రాబోయే గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో సెంటిమెంటు రాజేసేందుకు, సెక్షన్8 ఎత్తివేయాలనే డిమాండ్ అస్త్రం అవుతుందని, అ క్రమంలో దీక్ష చేయడం మేలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.