Begin typing your search above and press return to search.

‘రద్దు’ అనుకున్నది సాధించిన కేసీఆర్

By:  Tupaki Desk   |   18 Nov 2016 4:44 AM GMT
‘రద్దు’ అనుకున్నది సాధించిన కేసీఆర్
X
దేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా.. మిగిలిన వారి కంటే భిన్నంగా వ్యవహరించి ప్రధాని మోడీ దృష్టిలోకి పడిన ఘనత కేసీఆర్ కు మాత్రమే దక్కుతుంది. మొదట్నించి ఉన్న అలవాటే కేసీఆర్ కు తాజా ఆవకాశాన్నిఇచ్చిందని చెప్పాలి. తనకు తెలీని అంశం ఏదైనా తన దృష్టికి వచ్చిన వెంటనే.. ఆ విషయం పుట్టు పూర్వోత్తరాలు.. రానున్న రోజుల్లో ఆ అంశంలో జరిగే అంశాల మీద పూర్తిస్థాయి అవగాహన తెచ్చుకోవటమే కాదు.. ఆ రంగానికి చెందిన ప్రముఖులకు ఎంతటి పట్టు ఉంటుందో అంతటి పట్టును సాధించే తత్వం కేసీఆర్ సొంతం.

పెద్దనోట్ల రద్దుపై గత మంగళవారం రాత్రి ప్రధాని మోడీ సంచలన ప్రకటన చేసిన తర్వాత మిగిలిన ముఖ్యమంత్రుల తీరు ఒకలా ఉంటే.. తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు మరోలా కనిపిస్తుంది. ప్రధాని తీసుకున్న నిర్ణయంపై మనసులో అసంతృప్తి ఉన్నా.. దాన్ని చెప్పీ.. చెప్పనట్లుగా అనధికారికంగా ప్రకటిస్తూనే.. మరోవైపు ఈ ఇష్యూ అంతుచూసేలా మేథోమధనం మొదలు పెట్టారు. కీలక అధికారులు.. ఆర్థికనిపుణులు.. మేధావులతో పలు దఫాలు ఆయన చర్చలు జరిపారు. ఎవరిదాకానో ఎందుకు.. రద్దునిర్ణయం వెలువడిన పక్కన రోజున కీలక అధికారులు.. నేతలతో కలిసి రాజ్ భవన్ వెళ్లిన కేసీఆర్.. అక్కడ గంటల కొద్దీ.. రద్దు అంశంపై చర్చ జరపటాన్ని మర్చిపోలేం.

అంతేనా.. ఆర్ బీఐ మాజీ గవర్నర్లతో భేటీ అయి.. వారి సలహాలు.. సూచనలు వినటమే కాదు.. నోట్లరద్దుపై తనకున్న సందేహాల్ని కేసీఆర్ నివృతి చేసుకున్నారని చెబుతారు. ప్రధాని మోడీ తీసుకున్న రద్దు నిర్ణయం కారణంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తినే అవకాశాలు ఉన్నప్పటికీ.. ఈ నిర్ణయంతో కలిగే లాభాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారన్న భావన ఉంది.

నోట్ల రద్దుపై తన అభిప్రాయాల్ని.. తన ఆలోనల్ని ఈ నెల 20న ప్రధాని హైదరాబాద్ వచ్చిన సందర్భంగా పంచుకోవాలని అనుకున్నా.. అందుకు భిన్నంగా గురువారం మోడీకి ఫోన్ చేసి కొన్ని విషయాల్ని పేర్కొన్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన ప్రధాని.. శుక్రవారం ఢిల్లీకి రావాలని.. ఈ అంశంపై సమగ్రంగా చర్చించేందుకు తనకు అందుబాటులోఉండాలని కోరటం గమనార్హం.

నోట్ల రద్దు వ్యవహారంలో ఎదురు కానున్న పరిణామాలతో పాటు.. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు.. బ్యాంకులు.. ఇతరఆర్థిక సంస్థలు అవలంభించాల్సిన పంథాను తనకు రాత పూర్వకంగా అందించాలని కేసీఆర్ ను మోడీ కోరినట్లుగా చెబుతున్నారు. మోడీ కోరినట్లే.. ఉన్నతాధికారులతో సమావేశమైన కేసీఆర్.. ప్రధాని కోరినట్లే నివేదికను సిద్ధం చేయించినట్లుగా తెలుస్తోంది. నోట్ల రద్దుపై తమ ఆలోచనల్ని ప్రధానితో పంచుకొని.. అందుకు తగ్గట్లుగా ఈ వ్యవహారంలో కొన్ని మార్పులు చేయాలన్న భావన కేసీఆర్ లో మొదటి నుంచి ఉంది. ఎట్టకేలకు ఆయన దాన్ని సాధించే క్రమంలో మోడీతో భేటీ ఉపయోగపడుతుందని చెప్పాలి. తాను ఏదైనా అనుకుంటే దాన్ని సాధించేంతవరకూ వదిలిపెట్టని కేసీఆర్ తీరుకు తగ్గట్లే తాజాగా ప్రధాని మోడీతో భేటీ వ్యవహారం కేసీఆర్ తీరును చెప్పకనే చెప్పిందని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/