Begin typing your search above and press return to search.

మునుగోడుపై కేసీఆర్ ముంద‌స్తు ప్లాన్‌.. ఎంత వ్యూహమంటే!

By:  Tupaki Desk   |   3 Aug 2022 11:30 PM GMT
మునుగోడుపై కేసీఆర్ ముంద‌స్తు ప్లాన్‌.. ఎంత వ్యూహమంటే!
X
కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన‌.. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని నియోజ‌క వ‌ర్గం మునుగోడుపై టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ముందుగానే దృష్టి పెట్టారా? జ‌రిగిన ప‌రిణామాల‌ను ఆయ‌న ముందుగానే అంచ‌నా వేశారా? రాజ‌గోపాల్ రాజీనామా ఖాయ‌మ‌ని .. ఆయ‌న ఎప్పుడో లెక్క‌లు వేసుకున్నారా? ఎప్పుడు ఉప ఎన్నిక వ‌చ్చినా.. విజ‌యం ద‌క్కించుకునేందుకు వీలుగా ఆయ‌న ప‌క్కా ప్లాన్‌తో రెడీ అయిపోయారా? అంటే.. ఔన‌నే అంటున్నాయి ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు.

మునుగోడు నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో సత్తా చాటేందుకు కేసీఆర్ ఇప్ప‌టికే వ్యూహాలకు పదునుపెడుతున్న‌ట్టు ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు తెలిపాయి.

రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరి పదవికి రాజీనామా చేస్తారని, ఉప ఎన్నికలు వస్తాయనే అంచనాతో కొంతకాలంగా సీఎం కేసీఆర్‌ అక్కడ పార్టీ బలోపేతంపై దృష్టి సారించార‌ని అంటున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌.. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో రెండు దఫాలు సమావేశమై ఉప ఎన్నికల సన్నాహాలపై చర్చించారని తాజాగా తెలిసింది.

కేటీఆర్‌ కూడా వరుసగా మూడురోజుల పాటు వారితో మాట్లాడి సమాయత్తం చేశార‌ని అంటున్నారు. నియోజకవర్గంలోని పెండింగ్‌ సమస్యలపై దృష్టి సారించారు. గట్టుప్పల్‌ మండలాన్ని ప్రకటించారు. మరోవైపు నియోజకవర్గంలోని బలమైన నేతలను పార్టీలోకి చేర్చుకుంటున్నారు. అధికారంలోకి వచ్చాక జరిగిన ఉప ఎన్నికల్లో దుబ్బాక, హుజూరాబాద్‌లలో ఓటమి పాలైన నేపథ్యంలో మునుగోడులో గెలుపును పార్టీ కీలకంగా భావిస్తోంది.

ఆ నియోజకవర్గాల్లో ఎదురైన అనుభవాలను గుణపాఠంగా తీసుకొని ముందుకు సాగాలని భావిస్తోంది. అభ్యర్థి ఎంపిక, ప్రచారం. అంచనాలు తదితర అంశాలపై అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది. ఏమాత్రం హడావుడి చేయకుండా పకడ్బందీగా ముందుకు సాగాలనే సంకల్పంతో ఉంది. 2018 శాసనసభ ఎన్నికల్లో టీఆర్ ఎస్‌ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి ఓడిపోయినా స్థానిక ఎన్నికల్లో సత్తా చాటింది. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో అయిదింటిలో టీఆర్ ఎస్‌ ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులున్నారు.

రెండు పురపాలికల్లో టీఆర్ ఎస్‌ పాలకవర్గాలే ఉన్నాయి. నియోజకవర్గంలో గత మూడేళ్లుగా జరుగుతున్న సర్వేలకు తోడు తాజాగా ప్రశాంత్‌కిశోర్‌ బృందం సర్వేలు నిర్వహించి నివేదికలు ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఇదిలావుంటే, ఈ ఇక్క‌డ నుంచి పోటీ చేసేందుకు మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడైన అమిత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, పార్టీ నేతలు కర్నాటి విద్యాసాగర్‌, కంచర్ల కృష్ణారెడ్డి, మరో బీసీ నాయకుడు రవితో పాటు కొత్తగా మరికొందరు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం.