Begin typing your search above and press return to search.

కేసీఆర్ తిట్ల దండకం ఎలా ఉంటుందంటే..?

By:  Tupaki Desk   |   25 Aug 2016 4:53 AM GMT
కేసీఆర్ తిట్ల దండకం ఎలా ఉంటుందంటే..?
X
కత్తితో కోసినట్లుగా ఉండే మాటలు.. సిగ్గుతో తల ఎత్తలేనట్టుగా పోలికలు చెప్పే తెలుగు నేతల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంటారు. మిగిలిన నేతలకూ.. ఆయనకు ఒక పెద్ద వ్యత్యాసం ఉంది. ఆయన తిట్లే తిట్లు సైతం ‘నిజమే కదా’ అన్నట్లుగా ఉండటం ఒక విశేషమైతే.. అలాంటి భావన పార్టీ నేతలకూ.. కార్యకర్తలకూ పరిమితం కాకుండా తెలంగాణ ప్రజానీకానికి అనిపించే రీతిలో ఉండటం ఆయనకు మాత్రమే సాధ్యమవుతుంది. గతాన్ని వర్తామానంతో లింకేసి మండిపడే ఆయన.. ఎంత మాటనైనా అలవోకగా అనేసే సత్తా ఆయన సొంతం.

ఇరుగు.. పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉంటామన్న మాటను చెబుతూనే.. తన రాజకీయ ప్రయోజనం కోసం ఎవరినైనా సరే బండకేసి బాదినట్లుగా మాటలతో బాదేయగల సత్తా ఆయన సొంతం. ఇరుగుపొరుగు రాష్ట్రాల విషయంలో మాత్రమే కాదు.. బీజేపీ విషయంలోనూ ఆయన రెండు నాలుకల్ని ప్రదర్శిస్తారు. కానీ.. ఎక్కడా దొరక్కుండా మాట్లాడటం కేసీఆర్ మేధావితనానికి నిదర్శనంగా చెప్పాలి. తమ ప్రభుత్వంలో అవినీతి లేదని ప్రధాని మోడీ సైతం చెప్పారంటూ బీజేపీ కీలక నేత వ్యాఖ్యల్ని కోట్ చేసి.. మోడీ ఇమేజ్ వల్ల కలిగే ప్రయోజనాన్ని పొందుతూనే.. తెలంగాణలో విపక్షాలు తమను ఏమీ చేయలేవంటూ మోడీ నేతృత్వంలోని అదే బీజేపీని విమర్శించగల సత్తా కేసీఆర్ సొంతం.

మహారాష్ట్రతో మహా ఒప్పందాన్ని చేసుకొని విజయగర్వంతో బేగంపేట ఎయిర్ పోర్ట్ లో దిగిన కేసీఆర్.. తన విజయోత్సవ ర్యాలీలో తెలంగాణ కాంగ్రెస్ నే ఎంతలా విమర్శించిన విషయం తెలిసిందే. ఈ విమర్శల పరంపరలో భాగంగా కాంగ్రెస్ నేతల్ని ఓ రేంజ్ లో తిట్టేసిన కేసీఆర్ తిట్ల దండకాన్ని చూస్తే.. ఆయన తిట్లు ఎంత బలంగా.. తీవ్రంగా ఉంటాయో ఇట్టే అర్థమైపోతాయి.

శాంపిల్ గా కేసీఆర్ తిట్లు చూస్తే..

‘‘ఎన్నో సందర్భాల్లో ఢిల్లీకి పోయి మాకు అభివృద్ధే ముఖ్యం. తెలంగాణ ముఖ్యం కాదంటూ కాంగ్రెస్ హైకమాండ్ కు మెమోరాండాలు ఇచ్చిన మొహాలు మీవి. మీరా.. ఈ రోజు మాట్లాడుతున్నరు?’’

‘‘మీ హయాంలో తెలంగాణకు న్యాయం జరిగి ఉంటే.. మీరు చెప్పినటువంటి 98 లక్షల ఎకరాలకు నీరు వచ్చినట్లు ఉంటే ఎక్కడిపోయినై ఆనీళ్లు? పిట్టలు.. కాకులు గిట్ల తాగినయా?’’

‘’98 లక్షల ఎకరాలకు నీళ్లు పారితే ఈ రోజు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చేది? వాస్తవాలు ఈ విధంగా ఉంటే మీరు అవాకులు చవాకులు పేలుతూ మాట్లాడతారా?’’

‘‘టీఆర్ ఎస్ ఉద్యమం పుట్టిన తర్వాత మా ఎమ్మెల్యేల్ని రాజశేఖర్ రెడ్డి ఆగం చేస్తా ఉంటే.. టీఆర్ ఎస్ ను విచ్ఛిన్నం చేయాలని.. ఉద్యమాన్ని ఊడగొట్టాలని చంద్రబాబు నాయుడు.. రాజశేఖర్ రెడ్డి ప్రయత్నం చేస్తావుంటే మీరు పదవుల్లో ఉన్నారు’’

‘‘చంద్రబాబు నాయుడు.. వైఎస్ పంచనలో పడి బతికిండ్రు. కానీ.. మీకు పౌరుషం రాలే. అనేక విషయాల్లో టీఆర్ ఎస్ పోరాటం చేస్తా ఉంటే.. సమైక్య పాలకుల సంకలో దూరి మమ్మల్ని ఎగతాళి చేసిండ్రు’’

‘‘రెండు సంవత్సరాల నుంచి నేను మౌనం పాటించన. పెద్దమనిషి రకంగా మర్యాదగా ఉందామనుకున్నా. ఉత్తమ్ కుమార్ అండ్ కంపెనీ.. ప్రజలు చీదరించుకున్న తెలుగుదేశం కంపెనీ.. ఈసారి నుంచి మీ మీద కేసులు పెట్టబోతున్నాం జాగ్రత్త. ఆరోపణలు చేస్తే రుజువు చేయాలి. లేదంటే జైలు కూడు తినాల్సి వస్తది’’

‘‘తెలంగాణను మీరు నాశనం చేస్తే.. ఆ బాధలో.. ఆ గుండె మంటలో నుంచి ఎగిరింది గులాబీ జెండా. అందులో నుంచి మోగిందే కేసీఆర్ గొంతు. ఇయ్యాల అదే గులాబీ జెండా తెలంగాణ తెచ్చింది వాస్తవం. ఈ రోజు చెబుతున్న.. మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని వచ్చిన ఈ శుభ సందర్భంలో తెలంగాణలో కోటి ఎకరాలకు కృష్ణా.. గోదావరి నీళ్లు తెస్తా. నా ప్రాణం పోయినా సరే.. నా రైతులకు అండగా ఉంట’’

‘‘గండ్ర వెంకటరమణారెడ్డి.. తదితర ఎమ్మెల్యేలను రాజశేఖర్ రెడ్డి పంపిస్తే.. మీరు ఎన్నో సందర్భాల్లో ఢిల్లీకి పోయి.. హైకమాండ్ కు మెమోరాండాలు ఇచ్చిన మొహాలు మీవి’’