Begin typing your search above and press return to search.

తమిళనాడుకు నీళ్లు సరే.. ఏపీకి బాకీలు చెల్లించరేం సారూ?

By:  Tupaki Desk   |   6 March 2020 4:12 AM GMT
తమిళనాడుకు నీళ్లు సరే.. ఏపీకి బాకీలు చెల్లించరేం సారూ?
X
అంచనాలకు అందని రీతిలో వ్యవహరించటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటు. ఆయన ఎప్పుడేం చేస్తారో? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అంచనా వేయటం అంత తేలికైన విషయం కాదు. ఉన్నట్లుండి తమిళనాడు నుంచి కొందరు మంత్రులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి.. తమ రాష్ట్రం ఎదుర్కొంటున్న నీటి సమస్యల్ని చెప్పటం.. ఆ వెంటనే కేసీఆర్ స్పందించి.. అభయహస్తాన్ని ఇవ్వటం గమనార్హం. అంతేనా.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి.. తమిళులకు నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పటం చూస్తే.. ఉత్తినే ఏమీ చేయని కేసీఆర్.. ఇదంతా ఇప్పుడే ఎందుకు చేస్తున్నట్లు? అన్న సందేహం కలుగక మానదు.

తమిళుల పట్ల.. వారు ఎదుర్కొంటున్న నీటి సమస్య గురించి ఇంతలా ఆవేదన వ్యక్తం చేసే కేసీఆర్.. విభజన నేపథ్యంలో ఏపీకి న్యాయంగా ఇవ్వాల్సిన వాటి గురించి మడత పేచీలు ఎందుకు పెట్టుకుంటున్నట్లు? అన్నది ప్రశ్న. ఏపీకి ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలతో పాటు.. ఆర్టీసీ ఆస్తుల విషయంలోనూ సానుకూలంగా ఎందుకు స్పందించరన్నది ప్రశ్న. విభజనకు ముందు మాదిరి ఏపీ ఆర్థిక పరిస్థితి బాగుంటే ఓకే. కానీ.. తీవ్రమైన నిధుల కొరతతో ఏపీ విలవిలలాడటమేకాదు.. విభజన కారణంగా కోలుకోలేనంత దెబ్బ తగిలిందన్న విషయం కేసీఆర్ కు తెలియంది కాదు.

తమిళనాడు కు నీళ్లు ఇవ్వటం అంటే.. మధ్యలో ఉన్న ఏపీ అందుకు ఓకే చెప్పాలి. ఒక రాష్ట్రానికి సాయం చేయటం కోసం మరో రాష్ట్రాన్ని ఆ దిశగా ఒప్పించేందుకు ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి తపన పడిన సీన్ ఇదే తొలిసారిగా చెప్పాలి. ఇంతకు ట్రై చేస్తున్న కేసీఆర్.. తనదెంతటి విశాలమైన మనసన్న విసయాన్ని చెప్పకనే చెప్పేస్తున్నారు. మరింత దొడ్డ (పెద్ద) మనసు ఉన్న కేసీఆర్.. ఏపీతో ఉన్న విభజన లెక్కల్ని.. ఆ రాష్ట్రానికి చెల్లించాల్సిన బాకీల్ని వేగంగా క్లియర్ చేయరెందుకు? అన్న సందేహం కలుగక మానదు. తమిళనాడు మీద అభిమానాన్ని చూపించొద్దని ఎవరూ చెప్పరు. అదే సమయం లో.. ఆంధ్రప్రదేశ్ తో లెక్కల్ని ఒక కొలిక్కి తెచ్చేయొచ్చన్న విషయం మీద సారు ఎందుకు ఫోకస్ చేయనట్లు..?