Begin typing your search above and press return to search.

తెరపైకి కేసీఆర్ థర్డ్ ఫ్రంట్... నేపథ్యమేంటంటే?

By:  Tupaki Desk   |   26 Jan 2020 8:21 AM GMT
తెరపైకి కేసీఆర్ థర్డ్ ఫ్రంట్... నేపథ్యమేంటంటే?
X
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నోట అప్పుడెప్పుడో సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్ అంటూ సంచలన పదాలు వెలువడిన సంగతి తెలిసిందే కదా. అయితే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అనుకున్న మేర ఫలితాలు రాకపోవడం, కేంద్రంలో మరోమారు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు అధికారం చేపట్టడంతొో ఫెడరల్ ఫ్రంట్ నినాదం అటకెక్కేసింది. అయితే ఇప్పుడు తెలంగాణలో శనివారంతో ముగిసిన మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు గ్రాండ్ విక్టరీ దక్కినంతనే మరోమారు కేసీఆర్ నోట థర్డ్ ఫ్రంట్ మాట వినిపించింది. దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫ్రంట్ ఏర్పాటపై చర్చలు జరపున్నట్లుగా శనివారం నాటి మీడియా సమావేశంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలే చేశారని చెప్పాలి.

థర్డ్ ఫ్రంట్ - ఫెడరల్ ఫ్రంట్... పేరు ఏదైనా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే దిశగా కేసీఆర్ తన వ్యూహానికి పదును పెడుతున్నారనే చెప్పాలి. తెలంగాణలో తన పార్టీకి వరుసగా రెండో పర్యాయం దక్కిన అధికారాన్ని తన కుమారుడు కేటీఆర్ కు అప్పజెప్పేసి.... తాను నేషనల్ పాలిటిక్స్ లో వెళ్లేందుకు కేసీఆర్ ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచిస్తూనే ఉన్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో అంచనాలు తలకిందులు కావడంతో కేసీఆర్ ఆ యత్నాలను పక్కనపెట్టేశారు. అయితే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న తన ఆలోచనను పక్కనపెట్టేంది తాత్కాలికమేనని... అదను కోసం కేసీఆర్ ఎదురు చూశారని నిన్నటి ఆయన వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పక తప్పదు.

మునిసపల్ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ, కేంద్రంలోని మోదీ సర్కారు ప్రతిపాదించిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)లు కేసీఆర్ లోని నేషనల్ పాలిటిక్స్ ఆసక్తిని తిరిగి రేకెత్తించాయన్న వాదన బలంగానే వినిపిస్తోంది. సరే... నిన్నటి మీడియా మీట్ లో మోదీ సర్కారుపై ఓ రేంజిలో విరుచుకుపడిన కేసీఆర్... తాను ఇప్పటికే రంగంలోకి దిగానంటూ హింట్ కూడా ఇచ్చారు. గతంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందని ముఖ్యమంత్రులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (ఏపీ) - మమతా బెనర్జీ(పశ్చిమ బెంగాల్) - నవీన్ పట్నాయక్ (ఒడిశా) - పినరయి విజయ్ (కేరళ)లతో పాటు తమిళనాడు విపక్ష నేత - డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ తోనూ కేసీఆర్ మంతనాలు సాగించారు. ఇప్పుడు కూడా వీరితో పాటు మరికొన్ని పార్టీలతో జట్టు కట్టి నేషనల్ పాలిటిక్స్ లో సత్తా చాటాల్సిందేనని కేసీఆర్ భావిస్తున్నారు. మరి ఈ దిశగా కేసీఆర్ యత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.