Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఆప‌రేష‌న్..సెల్ఫ్‌ గోల్ అవుతోందా?

By:  Tupaki Desk   |   15 Sep 2016 7:30 PM GMT
కేసీఆర్ ఆప‌రేష‌న్..సెల్ఫ్‌  గోల్ అవుతోందా?
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆకర్ష్ విక‌టిస్తోందా? అధికార బ‌లోపేతం కోసం చేప‌ట్టి ఆపరేషన్‌ తో ఆకర్షితులై గులాబీగూటికి చేరిన విపక్ష నేతలు కొందరు తిరిగి సొంత గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? ప‌ద‌వులు ద‌క్క‌క కొందరు...ప్రాధాన్యం లేక‌పోవ‌డంతో మరికొంద‌రు కారు దిగేందుకు సిద్ధ‌మ‌య్యారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీలో ఇమడలేక వీరంతా పూర్వాశ్ర‌మానికి చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. గులాబీ గూటికి చేరిన నేతలిప్పుడెందుకు తిరిగి సొంత గూటికి చేరాలనుకుంటున్నారంటే - పార్టీలో చేరే వరకు ఎంతో ప్రాధాన్యతనిచ్చిన అధికారపార్టీకి చెందిన కీలక నేతలిప్పుడు తమని పట్టించుకోవడం లేదని ఒకరిద్దరు నేతలు తమ సన్నిహితుల వద్ద అసంతృప్తిని వ్యక్తం చేశారు.

తెలంగాణ పునర్ నిర్మాణం కోసం పార్టీలకు అతీతంగా నాయకులంతా కలిసి రావాలంటూ అధికార పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌ కు ఆకర్షితులైన వివిధ పార్టీల నేతలు పెద్ద సంఖ్యలో అధికార టీఆర్ ఎస్ పార్టీలో చేరిన సంగ‌తి తెలిసిందే. గ్రామ స్థాయి నాయకుల నుంచి మొదలుకుని ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - ఎంపీలన్న భేదం లేకుండా ఒకరి వెంట మరొకరు క్యూ కట్టారు. విపక్ష ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - ఎంపీలు కార‌ణాలు ఏమైనా...తామంతా కేసీఆర్ పాలన నచ్చే అధికారపార్టీలో చేరుతున్న ట్లుగా మీడియా ముందు చెప్పుకొచ్చారు. బంగారు తెలంగాణ సాధనకు - తెలంగాణ పునార్మిణంలో భాగస్వాములయ్యేందుకు అధికార పార్టీలో చేరిన నేతలంతా ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ అందరి మాదిరిగానే బంగారు తెలంగాణ సాధన - తెలంగాణ పునార్మిణం కోసం టీఆర్ ఎస్‌ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు ప్రభాకర్ ఎందుకు అధికార పార్టీలో చేరనా? అని మథనపడుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్ ఎస్ పార్టీలో చేరికకు ముందు నిరంతరం తనతో టచ్‌ లో ఉన్న అధికారపార్టీ కీలక నేతలు ఇప్పుడు కనీసం తనను పట్టించుకోవడం లేదని ఆయన సన్నిహితుల వద్ద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గత రెండు మాసాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి తన సమస్యలు విన్నవించేందుకు ప్రభాకర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదని తెలుస్తోంది. దానికితోడు ఒలింపిక్స్‌ లో రజత పతకాన్ని సాధించిన బ్యాడ్మింటన్ ప్లేయర్ సింధు హైదరాబాద్‌ కు వచ్చిన సందర్భంలో ప్రభాకర్ గన్‌ మెన్‌ లను ఉన్నఫళంగా వెనక్కి పిలిపించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారపార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న తనకు ఉన్న గన్‌ మెన్‌ ను - ముందస్తుగా కనీసం సమాచారం ఇవ్వకుండా పోలీసు అధికారు లు వెనక్కి పిలిపించడంపై ప్రభాకర్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టే తన గన్‌ మెన్‌ ను వెనక్కి పిలిపించి అవమానించారన్న భావనలో ఆయన ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ప్రభాకర్ డీజీపీకి లేఖ కూడా రాశారు. ముఖ్యమంత్రిని కేసీఆర్ కలిసే అవకాశం ఇవ్వకపోవడం అటుంచితే, పార్టీలో కనీసం తనకు ప్రాధాన్యం కూడా దక్కపోవడంతో ప్రభాకర్ తీవ్ర ఆవేదన చెందుతున్నారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ఇన్ని అవమానాలు భరిస్తూ అధికార పార్టీలో కొనసాగడం శుద్ధ దండగనే ఆలోచనలో ప్రభాకర్ - పార్టీ మారి తాను పెద్ద తప్పు చేశారనని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. టీఆర్ ఎస్‌ లో తనను పట్టించుకునేవారెవరు లేకపోవడంతో అటు తెలంగాణభ వన్‌కు గానీ, ఇటు టీఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయానికి గానీ రావడానికి ప్రభాకర్ ఇష్టపడటం లేదని వారు పేర్కొంటున్నారు. అసెంబ్లీ పరిసరాలకు వచ్చినప్పుడు కూడా ఆయన సీఎల్పీ కార్యాలయంలో కూర్చొని వెళుతున్నారంటే ఆయన ఎంతగా ఆవేదన చెందారో అర్థం చేసుకోవచ్చునని చెబుతున్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ ఎస్‌ లో చేరి - మరోసారి స్థానిక కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయిన యాదవరెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. కౌన్సిల్‌లో ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా టీఆర్ ఎస్‌ లో చేరిన యాదవరెడ్డికి విప్ పదవి ఇస్తామంటూ టీఆర్ ఎస్ పెద్దలు తొలుత హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తాజా విప్‌ ల నియామకంలో ఆయనకు ఛాన్స్ దక్కకపోవడంపై యాదవరెడ్డి పార్టీ నాయకత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. గులాబీ పెద్దలు తనను అవమానించారంటూ సన్నిహితుల దగ్గర ఆయన వాపోయినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్‌ లో భాగంగా అధికారపార్టీలో చేరిన చాలమంది ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు టీఆర్ ఎస్‌ లో ఇమడలేక - తిరిగి సొంత గూటికి వెళ్లలేక మథకపడుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది ప్రజాప్రతినిధులైతే తిరిగి సొంతగూటికి వెళ్లాలని బలంగా యోచిస్తున్నారని, ఇప్పుడు కాకపోయినా సాధారణ ఎన్నికల ముందయిన సొంత గూటికి తిరిగి చేరుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి నుంచి టీఆర్ ఎస్‌ లో చేరిన మల్కాజ్‌ గిరి ఎంపీ మల్లారెడ్డి సమీపబంధువు శ్రీనివాసరెడ్డి తిరిగి సొంత గూటికి చేరిన విషయం తెలిసిందే. ఇక టీడీపీ నుంచి టీఆర్ ఎస్‌ లో చేరిక ఎమ్మెల్యేలు ప్రకాష్‌ గౌడ్ - వివేకానందగౌడ్‌ లు తిరిగి సొంత గూటికి చేరే అవకాశాలున్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే అధికారపార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కాస్త విక‌ర్ష్‌ గా మారిందా అనే ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.