Begin typing your search above and press return to search.
రాహుల్ జోరుతో కేసీఆర్ ఇలా అలర్టయ్యారా?
By: Tupaki Desk | 15 Aug 2018 5:31 AM GMTరెండో రోజు బిజి షెడ్యూల్ తో తెలంగాణ రాష్ట్రంలో అడుగిడిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ టూర్ ముగిసింది. మహిళా సంఘాలతో సమావేశంతో మొదలైన రాహుల్ పర్యటన సరూర్ నగర్ లో బహిరంగ సమావేశంతో ముగిసింది. ఈ సందర్భంగా బిజీ బిజీగా - వ్యూహత్మకంగా రాహుల్ గాంధీ గడిపారు. పార్టీ పరమైన కార్యక్రమాలను సమన్వయం చేస్తూనే తటస్థ వేదికలతో సైతం అనుసంధానం అయ్యారు. రెండు రోజుల పర్యటనలో తనదైన ముద్ర వేశారు. అయితే, కాంగ్రెస్ రథసారథి ఇలా ఆసక్తికరమైన పర్యటన సాగించిన నేపథ్యంలో తెలంగాణ సీఎం - టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అలర్ట్ అయ్యారు. రాహుల్ టూర్ ముగిసిన రెండ్రోజుల వ్యవధిలోనే తన ఎత్తుగడకు రంగం సిద్ధం చేసుకున్నారు.
రాహుల్ రెండోరోజైన మంగళవారం ఉదయం హోటల్ హరితప్లాజాలో 36వేల 600ల మంది బూత్ కమిటీ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. శక్తి యాప్ రిజిస్ట్రేషన్ - పార్టీ బలోపేతం - పార్టీ కార్యక్రమాలపై కార్యకర్తలతో డిస్కషన్ చేశారు. తర్వాత పార్టీ సీనియర్ లీడర్లు - సిట్టింగ్ ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు - నాయకుల మధ్య సమన్వయం - పార్టీ భవిష్యత్ ప్రణాళిక తదితర అంశాలను లీడర్లతో విడిగా డిస్కషన్ చేశారు. ఐదు నియోజకవర్గాల నుంచి రాహుల్ తో బూత్ కమిటీ అధ్యక్షులు మాట్లాడారు. అచ్చంపేట్ - చొప్పదండి - డోర్నాకల్ నేతలతో పాటుగా దాదాపు 20 నిమిషాలు బూత్ కమిటీ సభ్యులతో టెలికాన్ఫిరెన్సులో మాట్లాడారు రాహుల్ గాంధీ. ఏకకాలంలో రుణమాఫీ చేయకపోవడం - డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై రాహుల్ ఆరా తీసినట్టు సమాచారం. ఇక సరూర్ నగర్ బహిరంగ సభలో ప్రభుత్వం తీరుపై దుమ్మెత్తిపోశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న రీడిజైనింగ్ ప్రక్రియ జేబులు నింపుకునేందుకేనని ఆరోపించారు. దీంతోపాటుగా ప్రభుత్వం విధానాలన్నీ ప్రజా వ్యతిరేకమేనని ఆయన ఆరోపించారు.
అయితే, రాహుల్ టూర్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అలర్ట్ అయ్యారు. తొలిరోజు తెలంగాణ భవన్ లో తనఅధ్యక్షతన టీఆర్ ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగిన సిద్ధమేనని - ఏ పార్టీతో పొత్తు ఉండదని - ఒంటరిగానే 100 సీట్లు గెలుసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. దీనికి కొనసాగింపుగా ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. టీఆర్ ఎస్ రాష్ట్ర పార్టీ - పార్లమెంటరీ పార్టీ - శాసనసభాపక్షం సంయుక్త సమావేశం తన అధ్యక్షతన జరుగనుందని పార్టీ వర్గాలకు సమాచారం ఇచ్చారు. సమావేశానికి టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - ఎంపీలు హాజరవ్వాలని ఆర్డర్ వేశారు. సెప్టెంబర్ లోనే ఎంపీ - ఎమ్మెల్యేల పేర్లు ప్రకటిస్తామని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలోనే ఈనెల 17న జరుగనున్న ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకొంది.