Begin typing your search above and press return to search.

గులాబీ గూట్లో క‌ల‌క‌లం.. కేసీఆర్ ఫోన్ కాల్!

By:  Tupaki Desk   |   12 July 2018 5:06 AM GMT
గులాబీ గూట్లో క‌ల‌క‌లం.. కేసీఆర్ ఫోన్ కాల్!
X
తెలుగు నేల మీద పోల్ మేనేజ్ మెంట్లో మొన‌గాళ్లుగా చెప్పుకునే కొంద‌రిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒక‌రు. ఎన్నిక‌ల్లో ఎలా వ్య‌వ‌హ‌రించాలి? వ్యూహాలు ఎలా ఉండాల‌న్నది ఆయ‌న‌కు కొట్టిన‌పిండి. లోక్ స‌భ‌కు.. అసెంబ్లీకి ఎన్నిక‌లు ఎప్పుడైనా రావొచ్చ‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతున్న వేళ‌.. కొత్త ముచ్చ‌ట ఒక‌టి హాట్ టాపిక్ గా మారింది.

మంత్రులు సైతం క‌లిసేందుకే అవ‌కాశం ఇవ్వ‌ని సీఎం కేసీఆర్‌.. తాజాగా పార్టీ ఎమ్మెల్యేల‌కు తానే స్వ‌యంగా ఫోన్లు చేసి మాట్లాడ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

గులాబీ పార్టీలో కేసీఆర్ ఫోన్ కాల్ ముచ్చ‌ట ఇప్పుడు కొత్త క‌ల‌క‌లమైంది. కొంద‌రు పార్టీ ఎమ్మెల్యేల‌కు.. ఎంపిక చేసిన ఎంపీల‌కు ఫోన్లు చేస్తున్న కేసీఆర్‌.. ఎన్నిక‌ల‌కు త‌యారుగా ఉండాల‌ని.. ఏ క్ష‌ణంలో ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న వెలువ‌డినా అందుకు అవ‌స‌ర‌మైన అన్నింటిని ఇప్ప‌టినుంచే సిద్ధం చేసుకోవాల‌న్న మాట ఆయ‌న నోటి నుంచి వ‌చ్చింద‌న్న మాట ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

షెడ్యూల్ ప్ర‌కారం జ‌రిగినా.. ఒక‌వేళ అందుకు భిన్నంగా ముందే ఎన్నిక‌లు వ‌చ్చినా ఎదుర్కోవ‌టానికి సిద్ధంగ ఉండాల‌న్న మాట‌ను కేసీఆర్ స్ప‌ష్టంగా చెబుతున్న‌ట్లుగా తెలుస్తోంది. న‌వంబ‌రు.. డిసెంబ‌రులో ఎన్నిక‌లురావొచ్చ‌ని.. ఒక‌వేళ ఏదైనా తేడా కొడితే.. జ‌న‌వ‌రి.. ఫిబ్ర‌వ‌రిలోనే ఎన్నిక‌లు జ‌రిగే వీలుంద‌న్న మాట చెప్పిన కేసీఆర్‌.. టికెట్ క‌న్ఫ‌ర్మేష‌న్ల‌ను కూడా దాదాపుగా ఇచ్చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థి మీరే.. మ‌రి.. ఏర్పాట్లు చేసుకుంటున్నారా? ఎన్నికల ఖ‌ర్చుల‌కు సంబంధించి ఫ్లాన్ ఏమిటి? గెలుపే ధ్యేయంగా ముందుకు సాగాల‌ని.. ఆ విష‌యంలో ఎలాంటి రాజీ వ‌ద్ద‌న్న మాట‌ను చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు స‌ర్వేలు చేసిన కేసీఆర్‌.. గెలుపు గుర్రాల‌కు మాత్ర‌మే తొలుత ఫోన్లు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. మొత్తం 90కి పైగా ఉన్న ఎమ్మెల్యేల్లో (జంపింగ్స్ తో క‌లిపి) 70 మంది వ‌ర‌కూ కేసీఆర్ ఫోన్లు చేసిన‌ట్లుగా స‌మాచారం. వీరికి రానున్న ఎన్నిక‌ల్లో టికెట్లు ఖ‌రారు చేసిన‌ట్లుగా చెప్పిన కేసీఆర్‌.. త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో తాము ఎంత బ‌లంగా ఉన్నామో చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్న ఎమ్మెల్యేల‌కు దిమ్మ తిరిగిపోయేలా కేసీఆర్ వివ‌రాలు చెబుతున్నార‌ని స‌మాచారం. తాను ఒక‌టికి నాలుగుసార్లు వివిధ ఏజెన్సీల ద్వారా స‌ర్వే చేయించి.. గెలుపు ప‌క్కా అన్న ధీమా ఉన్న నేత‌ల‌కు మాత్ర‌మే టికెట్ల క‌న్ఫ‌ర్మేష‌న్ ఫోన్ కాల్స్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

కేసీఆర్ నుంచి ఫోన్ కాల్ అందుకున్న ఎంపీ.. ఎమ్మెల్యేలు ఆనందంతో ఉబ్బిత‌బ్బుబ్బిపోతుంటే.. ఫోన్ రాని వారికి కొత్త దిగులు ప‌ట్టుకున్న‌ట్లు చెబుతున్నారు. ప్ర‌స్తుతం అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. సిట్టింగుల్లో దాదాపు 10 నుంచి 20 శాతం మందికి టికెట్లు ద‌క్కే ప‌రిస్థితి లేద‌న్న మాట వినిపిస్తోంది. ఈ ప్ర‌చారంలో నిజం ఎంత‌న్న‌ది మ‌రికాస్త వెయిట్ చేస్తే క్లారిటీ వ‌చ్చేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.