Begin typing your search above and press return to search.

రావు గారూ... స్త్రీలకెన్ని సీట్లు...!?

By:  Tupaki Desk   |   29 Aug 2018 1:30 AM GMT
రావు గారూ... స్త్రీలకెన్ని సీట్లు...!?
X
ముందుస్తు ఖాయమైంది...తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. అధికార, ప్రతిపక్షపార్టీలు ఎన్నికలకు సిద్ధ‌మవుతున్నాయి. ఎవరికి వారే అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ ముందుగా యాభైమంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించాలనుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా సెప్టెంబర్ 2న జరిగే ప్రగతి నివేదన సభలో 15 మంది అభ్యర్థులను ప్రకటించాలనుకుంటోంది. మహిళల ఓట్లే కీలకమైన తెలంగాణలో ఈ సారి తెలంగాణ రాష్ట్ర సమితి ఎంత మంది మహిళలకు సీట్లు ఇస్తుంద‌నేది ఆసక్తికర చర్చగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు మహిళల పట్ల చులకన భావం ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే ప్రస్తుత మంత్రి వర్గంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. ఆరుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిస్తే వారిలో ఒక్కరికే డిప్యూటీ స్పీకర్‌ పదివిచ్చారు. మంత్రి పదవి కోసం ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కిం అనలేదు.

దీంతో ఆయన మహిళా వ్యతిరేకి అనే ప్రచారం ఊపందుకుంది. తెలంగాణలో మహిళా మంత్రి లేకుండానే నాలుగేళ్ల పాటు తెరాస అధికారంలో కొనసాగింది. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. చర్చంతా మహిళా అభ్యర్థుల పైకి మళ్లింది. తెలంగాణ రాష్ట్ర సమితిలో పురుషులకు దీటుగా ప్రసంగించే మహిళా నేతలున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహిళలు ఉన్నారు. వీరంతా శాసనసభలో కాని లోక్‌సభలో కాని కూర్చునేందుకు అర్హత ఉన్నవారే. ఈ విషయం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు తెలియంది కాదు. అయితే మహిళలకు టికెట్లు కేటయించడం పట్ల ఎందుకో ముఖ్యమంత్రి విముఖత చూపుతారనే ప్రచారం ఉంది. దీనికి బలమైన కారణాలు లేకపోవచ్చు కాని ఒక వర్గం మాత్రం ఈ ప్రచారాన్ని ఎక్కువగా చేపట్టింది. ఆ ప్రచారం కారణంగానైన రానున్న ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయించడం అనివార్యం అవుతోంది. తనకు మహిళల పట్ల ఎంతో గౌరవం ఉందని వారి కష్టాలను చూసి చలించిన తాను మహిళలకు ఎన్నోపథ‌కాలు తీసుకుని వచ్చానని కేసీఆర్ చెబుతున్నారు. ఇందులో భాగంగానే కళ్యాణ లక్ష్మీ - ఈద్ ముబారక్ - కేసీఆర్ కిట్ - వంటి కీలక పథకాలు ప్రవేశ పెట్టారని తెరాస నాయకులు వాదన. అయితే ఇన్నీ చేసిన మహిళలు మాత్రం రాజకీయంగా ఎదగరాదన్నది కేసీఆర్ లోలోపల ఆలోచనగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకైన మహిళలకు గణనీయంగా సీట్లు పెంచుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.