Begin typing your search above and press return to search.

ఉత్స‌వాల్లో మునిగి తేలుతున్న తెలుగు రాష్ట్రాలు

By:  Tupaki Desk   |   20 Dec 2017 5:41 AM GMT
ఉత్స‌వాల్లో మునిగి తేలుతున్న తెలుగు రాష్ట్రాలు
X
క‌ష్టాలు ఎన్ని ఉన్నా పండుగ వ‌స్తే మూడ్ మారుతుంది. క‌ష్టాలు ఎప్పుడూ ఉండేవే.. పండ‌గ వ‌చ్చే రోజు ఎందుకు పాడు చేసుకోవ‌టం అంటూ కాస్త స‌ర‌దాగా గ‌డిపే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. పండ‌క్కి ఉండే ప‌వ‌ర్ అలాంటిది. ఆ సూక్ష్మాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు బాగానే ప‌ట్టుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది.

గ‌డిచిన ఏడాదిలో చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర స‌ర్కార్లు నిర్వ‌హించిన ఉత్స‌వాలు.. స‌ద‌స్సులు.. కార్య‌క్ర‌మాల సంఖ్య భారీగానే క‌నిపిస్తాయి. ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌టానికి.. కొన్ని సామాజిక అంశాలపై చైత‌న్యం పెంచే స‌దుద్దేశంతో భారీ ఎత్తున ఉత్స‌వాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంటుంది. కానీ.. దాని వెనుక భారీ రాజ‌కీయ వ్యూహం ఉంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం నిర్వ‌హించిన ఐదు రోజులు ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల ముచ్చ‌టే చూద్దాం ఈ ఉత్స‌వాల పుణ్య‌మా అని గ‌డిచిన వారం రోజులుగా ప్ర‌జా స‌మ‌స్య‌ల ఊసే లేదు. నిజానికి ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు ప్రారంభం కావ‌టానికి వారం ముందు నుంచే ఈ హ‌డావుడి మొద‌లైంది. ప్ర‌భుత్వంతో పాటు మీడియా దృష్టి మొత్తం ఈ భారీ ఈవెంట్ మీద‌నే ఉంద‌న్న విష‌యం వారం రోజులుగా పేప‌ర్ల‌ను ఫాలో అవుతున్న అంద‌రికి అర్థ‌మ‌వుతుంది.

ఈ ఉత్స‌వాల హ‌డావుడి తెలంగాణ‌కు మాత్ర‌మే ప‌రిమితం కాదు.. ఏపీలోనూ ఉంది. కాకుంటే.. భారీత‌నం విష‌యంలో కాస్త తేడా మాత్ర‌మే. హైద‌రాబాద్ లో ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు జ‌రుగుతున్న వేళ‌లో ఏపీలో రెండు పెద్ద కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. కాకుంటే.. ఇవేమీ ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల మాదిరి భావోద్వేగంతో కూడుకున్న‌వి కాదు. అయితే.. ఎంతో కొంత ప్ర‌జ‌ల దృష్టిని డైవ‌ర్ట్ చేసేవేని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఎందుకిలా? అంటే.. విష‌యం చాలా సింఫుల్‌. పాల‌న మీద దృష్టి పెడితే చెప్పాల్సిన స‌మాధానాలెన్నో క‌నిపిస్తాయి. కానీ.. ఉత్స‌వాల మీద ఉత్స‌వాలు చేస్తున్న వేళ‌.. ప్ర‌జ‌ల దృష్టి మొత్తం వాటి మీదే ఉంటుందే త‌ప్పించి స‌మ‌స్య‌ల మీద ఉండ‌దు. మీడియా సైతం.. ప్ర‌భుత్వం ఇంత భారీగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ప్పుడు స‌మ‌స్య‌ల్ని ఎత్తి చూపించ‌టం బాగోద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటుంది. అందులోకి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్ర‌ధాన మీడియా సంస్థ‌ల‌న్నీ ప్ర‌భుత్వానికి బాకా ఊదేస్తున్నాయ‌న్న విమ‌ర్శ‌ను మూట‌క‌ట్టుకోవ‌టం తెలిసిందే. ఇలాంటి వేళ‌.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెర మీద‌కు వ‌చ్చేదెలా? అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

హైద‌రాబాద్‌ లో ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు నిర్వ‌హిస్తున్న వేళ‌.. ఏపీలోనూ రెండు పెద్ద కార్య‌క్ర‌మాల్నే నిర్వ‌హించారు. అయితే.. ఇవేవీ ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల స్థాయిలోకి రావు. అంద‌రిని అల‌రించిన ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల కోసం తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు రూ.60 కోట్లు ఖ‌ర్చు చేసింద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. మ‌రి అన్ని నిధులు ఖ‌ర్చు చేసిన‌ప్పుడు భారీత‌నం ఉట్టిప‌డ‌కుండా ఉంటుందా? ఇదిలా ఉంటే.. ఏపీలోని విశాఖ‌లో టెక్ స‌ద‌స్సు నిర్వ‌హిస్తే.. కాకినాడ‌లో సాగ‌ర సంబ‌రాలు (ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివ‌ల్స్‌) నిర్వ‌హిస్తారు. ఈ కార్య‌క్ర‌మాలు ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ట్టుకునేలా చేయ‌టం కోసం ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం బృందం చేత సంగీత విభావ‌రిని ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఈ వీకెండ్ ఏఆర్ రెహమాన్ షోను ఏర్పాటు చేస్తున్నారు.

ఉత్స‌వాలు జ‌రుగుతున్న వేళ‌.. మీడియానే కాదు విప‌క్షాలు సైతం కాస్త విశ్రాంతి తీసుకుంటాయి. పండుగ వాతావ‌ర‌ణంలో రాజ‌కీయాలు మాట్లాడితే బాగోదు కాబ‌ట్టి.. వారు సైతం ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఇలా అన్ని విధాలుగా సానుకూల‌త‌లు ఉండ‌టంతో.. ఈవెంట్ల మీద ఈవెంట్ల‌ను రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ ప‌డి మ‌రీ నిర్వ‌హిస్తున్నాయా? అన్న భావ‌న క‌ల‌గ‌టం కాయం. ఏమైనా.. రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాల తీరు చూస్తే.. మూడు స‌ద‌స్సులు.. ఆరు ఉత్స‌వాలు అన్న రీతిలో ఇద్ద‌రు చంద్రుళ్లు తెలుగు ప్ర‌జ‌ల్ని ఆనందోత్సాహాల్లో మునిగితేలేలా ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తూ ఉండ‌టం గ‌మనార్హం.