Begin typing your search above and press return to search.

రెండు రోజులు.. ఇద్ద‌రు చంద్రుళ్ల భారీ త‌ప్పులు

By:  Tupaki Desk   |   23 Oct 2018 6:25 AM GMT
రెండు రోజులు.. ఇద్ద‌రు చంద్రుళ్ల భారీ త‌ప్పులు
X
కొన్ని పోలిక‌లు భ‌లేగా అనిపిస్తాయి. త‌ర‌చి చూస్తే క‌నిపించే ఈ అంశాలు ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. ఎవ‌రు అవున‌న్నా.. కాద‌న్నా.. కొన్నింటిని మిన‌హాయిస్తే ఇద్ద‌రు చంద్రుళ్ల‌లో పోలిక‌లు చాలానే క‌నిపిస్తుంటాయి. యాదృశ్చికంగానే ఇద్ద‌రూ ఒకేసారి ఒప్పులు.. లేదంటే త‌ప్పులు చేయ‌టం క‌నిపిస్తూ ఉంటుంది. ఇదే విష‌యంలో గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల‌లో ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులుగా ఉన్న‌ప్పుడు ప‌లుమార్లు వ్య‌క్త‌మైంది.

తాజాగా అలాంటి అంశ‌మే ఇద్ద‌రు చంద్రుళ్ల‌లో క‌నిపించింది. వ‌రుస‌గా రెండు రోజుల వ్య‌వ‌ధిలో ఇద్ద‌రు చంద్రుళ్లు ఒకేలాంటి త‌ప్పును చేయ‌టం విశేషం. మాట్లాడే క్ర‌మంలో నోరు జారిన వారు.. త‌మ మాట‌ల కార‌ణంగా ఎన్నిక‌ల్లో అంతో ఇంతో ప్ర‌భావం చూపిన‌ట్లుగా చెప్పాలి.

అందులో మొద‌టిది.. తెలంగాణ అప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న కేసీఆర్‌.. ఆదివారం పార్టీ అభ్య‌ర్థుల‌తో భేటీ కావ‌టం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. పార్టీ ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ ను ఉద్దేశించి ఆయ‌న మాట్లాడుతూ.. గ‌త ఎన్నిక‌ల్లో తాను గ‌జ్వేల్ నుంచి పోటీ చేసిన‌ప్పుడు త‌న గెలుపు కోసం బాగా క‌ష్ట‌ప‌డ్డార‌ని.. అయినా త‌క్కువ మెజార్టీ వ‌చ్చింద‌ని.. కానీ ఈసారి అందుకుభిన్నంగా బాగా మెజార్టీ రావాల‌న్న రిక్వెస్ట్‌ ను చేశారు.

నాలుగున్న‌రేళ్ల త‌న పాల‌న‌తో తెలంగాణ ప్ర‌జ‌ల మీద తిరుగులేని ముద్ర వేశాన‌ని.. త‌న బొమ్మ క‌నిపిస్తే చాలు.. ఓట్లు గుద్దేస్తారంటూ గొప్ప‌లు చెప్పుకున్న పెద్ద మ‌నిషి.. చివ‌ర‌కు త‌న గెలుపుకోసం క‌ష్ట‌ప‌డి ప‌ని చేయాల‌ని రిక్వెస్ట్ చేయ‌టం ఏమిటి? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

కేసీఆర్ లాంటి తిరుగులేని నేత‌.. చివ‌ర‌కు ఒక ఎంపీని త‌న గెలుపు కోసం రిక్వెస్ట్ చేయ‌టం ఏమిటి? అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కీల‌క నేత‌లు.. సెల‌బ్రిటీ స్టేట‌స్ ఉన్న వారంతా తాము ప్రాతినిధ్యం వ‌హించే నియోజ‌క‌వ‌ర్గాన్ని పెద్ద‌గా పట్టించుకోరు. త‌న ప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గ ఓట‌ర్ల‌లో అంతులేని అభిమానం ఉన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తారు. దీనికి త‌గ్గ‌ట్లే..అధినేత‌లు రెగ్యుల‌ర్ గా బ‌రిలోకి దిగే నియోజ‌క‌వర్గ ఓట‌ర్లు అధినేత‌ల్ని అభిమానంగా గెలిపించ‌టం మామూలే. అలాంటివేళ‌లోనూ.. కొత్త ప్ర‌భాక‌ర్ లాంటి నేత‌ను రిక్వెస్ట్ చేయ‌టం ద్వారా త‌న ఇమేజ్ ను తాను భారీగా త‌గ్గించుకున్నార‌ని చెబుతున్నారు. కేసీఆర్ లాంటి అధినేత నోటి నుంచి ఈ త‌ర‌హా మాట రాకుండా ఉంటే బాగుండేద‌న్న వాద‌న వినిపిస్తోంది.

త‌న త‌ర‌ఫున బాగా ప‌ని చేయాలంటూ కేసీఆర్ నోరు జారితే.. ఏపీ ముఖ్య‌మంత్రి.. టీడీపీ జాతీయ అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న చంద్ర‌బాబు తాజా హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఒక షాకింగ్ వ్యాఖ్య చేశారు. రానున్న ఎన్నిక‌ల్లో తాను కూడా ప్ర‌చారం చేయ‌నున్నట్లుగా వెల్ల‌డించారు. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు మారుతున్న తెలంగాణ‌లో బాబు కానీ ప్ర‌చారానికి వ‌స్తే.. క‌త మొద‌టికి రావ‌ట‌మేకాదు.. గెలిచే తెలుగు త‌మ్ముళ్లు కూడా ఓడిపోవ‌టం ఖాయ‌మంటున్నారు.

ఎవ‌రు అవున‌న్నా.. కాద‌న్నా.. తెలంగాణ ప్ర‌జ‌ల వ‌ర‌కూ చంద్ర‌బాబు ఒక గుర్తు మాత్ర‌మే. ఆయ‌న తెలంగాణ‌కు వ‌చ్చి.. గ‌తంలో అంత పొడిచా.. ఇంత పొడిచా అంటే న‌మ్మే ప‌రిస్థితుల్లో లేరు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే ఆంధ్రా పాల‌కుల కార‌ణంగా న‌ష్ట‌పోయామ‌న్న విష‌యానికి రాజ‌ముద్ర ప‌డిన‌ట్లే. అలాంటి వేళ‌.. పార్టీని స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తి క‌లిగిన‌ట్లుగా త‌యారు చేసి.. తానుఒక చ‌క్క‌టి స‌ల‌హాదారుగా.. మంచి మెంటార్ గా ఉండాలే త‌ప్పించి.. తెలంగాణ రాజ‌కీయాల్లోకి వేలు పెడ‌తాను.. ప్ర‌చారంలోకి వ‌స్తాన‌న్న మాట ఏ మాత్రం స‌రికాదంటున్నారు. బాబు చేసిన వ్యాఖ్య‌తో టీఆర్ఎస్ నేత‌లు చెల‌రేగిపోవ‌టం ఖాయ‌మ‌ని.. తెలంగాణ సెంటిమెంట్ ను మ‌రింత ట‌చ్చింగ్ గా తెర మీద‌కు తీసుకొస్తార‌ని చెబుతున్నారు. ఇలా.. ఇద్ద‌రు చంద్రుళ్లు వ‌రుస రెండురోజుల్లో నోరు జారి త‌ప్పు చేశార‌న్న మాట వినిపిస్తోంది.