Begin typing your search above and press return to search.

వరంగల్ ప్రచారం వారివల్లే చప్పనైందా?

By:  Tupaki Desk   |   19 Nov 2015 7:26 AM GMT
వరంగల్ ప్రచారం వారివల్లే చప్పనైందా?
X
వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆరెస్ అధినేత చంద్రశేఖరరావు, టీడీపీ అధినేత చంద్రబాబులు అనుసరించిన తీరు రెండు పార్టీల నేతలను ఆశ్చర్యంలో పడేసింది. నోరెత్తితే చాలు చంద్రబాబుపై విరుచుకుపడే కేసీఆర్ తెలంగాణకు గుండెకాయ లాంటి వరంగల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్నా కూడా తెలుగుదేశం అధినేతను ఒక్క మాట కూడా అనకుండా ప్రచారాన్ని ముగించడంపై అంతా ఆశ్చరపోతున్నారు. గురువారంతో ప్రచారానికి గడువు ముగుస్తుంది.. ఇప్పటికే కేసీఆర్ వరంగల్ లో ప్రచార సభలో పాల్గొన్నారు. అయినా, ఆయన ఎక్కడా చంద్రబాబు ప్రస్తావనే తేలేదు. కాంగ్రెస్ నేతలపైనా - బీజేపీపైనా - చివరికి వైసీపీపైనా విమర్శలు చేశారు కానీ చంద్రబాబు ఊసెత్తలేదాయన. దీంతో కేసీఆర్ - చంద్రబాబుల దోస్తీ బలపడిందని.. కేసీఆర్ తీరే అందుకు ఉదాహరణ అని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు చంద్రబాబు కూడా అసలు వరంగల్ వైపు కన్నెత్తి చూడలేదు. ఈ ఇద్దరి మాటల తూటాలు లేకపోవడం ఎన్నికల ప్రచారం చప్పగా మారిందని కొందరు అంటున్నారు.

ఉప ఎన్నిక ప్రచారంలో కేసీఆర్ ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకులు జైపాల్ రెడ్డి - జానారెడ్డి - బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డిలను చెండాడేశారు. అయితే చంద్రబాబును మాత్రం ఆయన ఒక్క మాట కూడా అనలేదు. దీంతో కేసీఆర్ తీరుపై టీఆరెస్ సహా రాజకీయవర్గాలన్నీ ఆశ్చర్యపోతున్నాయి. అందరిలోనూ ఇదే చర్చ. అయితే.. కేసీఆర్ వ్యూహాత్మకంగానే అలా వ్యవహరించారని..ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన నుంచి చంద్రబాబుతో కేసీఆర్ కు మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. అమరావతిలో తనకు దక్కిన గౌరవమర్యాదలకు, చంద్రబాబు తనకు ఎంతో ప్రత్యేకంగా, ప్రధాని తో సమాన స్థాయిలో ట్రీట్ చేసిన విధానానికి కేసీఆర్ ఫ్లాటయిపోయారట. పైగా చంద్రబాబు కూడా వరంగల్ ఉప ఎన్నిక జోలికే రాలేదు. కేవలం తెలంగాణ నేతలకే ఆ విషయం విడిచిపెట్టారు. ప్రచారానికి చంద్రబాబు పూర్తిగా దూరంగాఉన్నారు. ఆ కర్టెసీతోనే కేసీఆర్ కూడా చంద్రబాబును ఒక్క మాట కూడా అనలేదని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు - కేసీఆర్ ల తీరు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఇద్దరూ చెట్టపట్టాలేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదేమో అనిపిస్తోంది.