Begin typing your search above and press return to search.
బాబు ఏం సినిమా చూడాలో చెప్తున్న ఎర్రన్న
By: Tupaki Desk | 24 April 2018 10:16 AM GMTతెలుగు రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల గురించి పలు సందర్భాల్లో ఆయా పార్టీల నేతలు, రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో అభిప్రాయాలు...విశ్లేషణలు...విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి నిశిత పరిశీలన కావచ్చు లేదా రాజకీయ కోణంలో కావచ్చు కానీ...తాజాగా సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూటు బూటుతో ఉన్నవారినే కలుస్తారని, ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే...టీఆర్ ఎస్ వాళ్లకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వరని వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాలన చేస్తున్నారా లేక రాచరికం చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారో సినిమా చూడాలని అన్నారు.
హైదరాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ భరత్ అను నేను సినిమాను ఈ ఇద్దరు సీఎంలు చూడాలన్నారు. అది కూడా తమకు నచ్చినట్లుగా థియేటర్ లో చూడటం కాకుండా...ప్రజల మధ్యలో ఉండి చూడాలని తద్వారా ప్రజల కోణంలో పరిపాలన అంటే ఏంటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన కుంభకోణాల్లో కమ్యూనిస్టులకు సంబంధం ఉంది అని బీజేపీ మాట్లాడుతుండటం సరికాదని అన్నారు. ఆ కుంభకోణంలో ఉన్నవారు దర్జాగా తిరుగుతున్నారని రామకృష్ణ మండిపడ్డారు. తాము యూపీఏ1కు మాత్రమే మద్దతు తెలిపామని, యూపీఏ 2 ప్రభుత్వానికి కాదని గుర్తుచేశారు. యూపీఏ 2 హయాంలో జరిగిన కుంభకోణాలపై బీజేపీతో పాటు తాము కూడా పోరాటం చేశామని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే మొత్తం అవినీతిని బయట పెడతామని, విదేశాల నుంచి డబ్బు తెస్తామని ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ హామీయిచ్చారని కానీ అధికారంలోకి వచ్చి చేసిందేంటని రామకృష్ణ ప్రశ్నించారు. 2జీ స్పెక్ట్రం కేసులో జైలుకు వెళ్లిన కనిమొళి, రాజా.. మోదీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నిస్తూ...వారికి ఈ స్వేచ్ఛను ప్రసాదించింది బీజేపీయేనని ఆరోపించారు.
అవినీతిపరులను ప్రోత్సహిస్తున్న బీజేపీ తమను విమర్శించడం సరికాదని రామకృష్ణ మండిపడ్డారు. మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్ధన్ రెడ్డిని తమ వేదికలపైకి ఎందుకు ఎక్కించుకుంటున్నారని ప్రశ్నించారు. సిగ్గు లేకుండా అవినీతి పరులకు టికెట్ ఇస్తూనే కమ్యూనిస్టులపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. గాలి జనార్ధన్ రెడ్డి తమ్ముడికి బీజేపీ లో పదవులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారని మండిపడ్డారు. అవినీతిపరులకు టికెట్లు ఇచ్చారని, జైళ్లో ఉండాల్సిన యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ అవినీతి గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కాగా, ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ పోరాటం కొనసాగుతుందని రామకృష్ణ ప్రకటించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు నెరవేర్చాలని ఈ రోజు అరగంట లైట్లు బంద్ చేసి నిరసన తెలుపుతామని పేర్కొన్నారు. అందరూ బ్లాక్ డేకు సహకరించి స్వచ్చందంగా నిరసన తెలపాలని కోరారు.