Begin typing your search above and press return to search.

బాబుది లేఖ మాట.. కేసీఆర్ ది సలహా మూట

By:  Tupaki Desk   |   14 Nov 2016 6:53 AM GMT
బాబుది లేఖ మాట.. కేసీఆర్ ది సలహా మూట
X
పెద్దనోట్ల రద్దుపై మోడీ తీసుకున్న నిర్ణయంపై మిగిలిన ముఖ్యమంత్రుల సంగతిని కాస్త పక్కన పెడితే.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్పందన ఏమిటి? వారెలా ఫీల్ అవుతున్నారన్న విషయాన్ని చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. పెద్దనోట్లను రద్దు చేసిన వెంటనే హర్షం ప్రకటించి..మోడీ చర్యను స్వాగతించిన బీజేపీయేతర ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే. పెద్దనోట్లను రద్దు చేయటం ద్వారా బ్లాక్ మనీకి చెక్ చెప్పొచ్చంటూ ఆయన వ్యాఖ్యానించారు.

అదే సమయంలో తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తన స్పందనను ఓపెన్ గా చెప్పనప్పటికీ.. మోడీ తీసుకున్న నిర్ణయంతో తీవ్ర ఇబ్బందులు తప్పవన్న భావనను గవర్నర్ నరసింహన్ తో వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వచ్చాయి. రోజులు గడుస్తున్న కొద్దీ.. నోట్ల రద్దుపై పాజిటివ్ గా స్పందించిన చంద్రబాబు సైతం.. జనాలు పడుతున్న కష్టాలపై కేంద్రానికి లేఖ రాస్తానని చెబుతున్నారు.

ఇక.. మొదటి నుంచి ప్రధాని నిర్ణయంపై అసంతృప్తితో ఉన్న కేసీఆర్ మాత్రం గుంభనంగా ఉంటూనే.. ఈ నిర్ణయంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మోడీ నిర్ణయం మంచిదే అయినా.. రాష్ట్ర ప్రయోజనాల కోణంలో చూస్తే నష్టమన్న భావన కేసీఆర్ లో ఉందని చెబుతున్నారు. అందుకే.. పెద్దనోట్ల రద్దుపై ప్రధాని మోడీకి సలహాలు.. సూచనలు ఇచ్చేందుకు ఒక నోట్ తయారు చేసినట్లుగా చెబుతున్నారు. ప్రధాని అపాయింట్ మెంట్ తీసుకొని.. తన ఆలోచనల్ని ఆయనతో పంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

పెద్దనోట్ల రద్దుపై మోడీకి సలహాలు ఇచ్చేందుకు కేసీఆర్ రెఢీ అవుతుంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం.. పెద్దనోట్లరద్దు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. వాటిని అధిగమించేందుకు కేంద్రం చేపట్టాల్సిన చర్యల్ని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి ఒక లేఖ రాయాలని భావిస్తున్నారు. రద్దును స్వాగతించిన చంద్రబాబు.. రద్దును లోలోన వ్యతిరేకించే కేసీఆర్.. ఇద్దరూ కేంద్రానికి తమదైన స్టైల్లో సలహాలు ఇవ్వాలని డిసైడ్ చేయటం విశేషంగా చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/