Begin typing your search above and press return to search.

రివర్పు సోదాలు మొదలు.. కేసీఆర్ సర్కారు మార్కు ఫైట్ షురూ

By:  Tupaki Desk   |   15 Nov 2022 4:07 AM GMT
రివర్పు సోదాలు మొదలు.. కేసీఆర్ సర్కారు మార్కు ఫైట్ షురూ
X
ఈడీ.. ఐటీలు మీకు ఉండొచ్చు. వాటితో తనిఖీలు చేపట్టి షాకులు ఇవ్వొచ్చు. కానీ.. మాకు ఉంది ఒక జీఎస్టీ. దానితో షాకులు ఇవ్వటం మాకు వచ్చు అన్నట్లుగా ఉంది తాజా సీన్ చూస్తుంటే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి.. కేంద్రంలోని మోడీ సర్కారుకు మధ్య నడుస్తున్న లడాయి అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన ఏడున్నరేళ్లలో ఎప్పుడూ లేనిది.. చూడనిది.. గడిచిన మూడు నాలుగు నెలలుగా వరుస పెట్టి ఐటీ.. ఈడీ సోదాలు.. తనిఖీలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.

ఇటీవల కాలంలో జరిగిన అన్ని ఈడీ.. ఐటీ సోదాల వెనుక టీఆర్ఎస్ బలాన్ని బలహీనపర్చటం.. ఆర్థిక మూలాలపై ప్రత్యేక కన్ను సారించటంతో పాటు.. తమతో పెట్టుకుంటే చెల్లించాల్సిన మూల్యం లెక్కలు చెప్పేందుకే అన్న మాట వినిపిస్తోంది. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి తమ రాజకీయ ప్రత్యర్థుల్ని దారికి తెచ్చుకునేందుకు సంధించే అస్త్రంగా ఈడీ.. ఐటీ శాఖలను చెబుతున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. వరుస పెట్టి సాగుతున్న ఈడీ..ఐటీ సోదాలకు సరైన సమాధానాన్ని ఇచ్చేందుకు... గట్టి సందేశాన్ని పంపేందుకు గులాబీ నాయకత్వం రంగంలోకి దిగినట్లుగా చెప్పాలి. ఇందులో భాగంగా తొలి అడుగు పడింది. తాజాగా బీజేపీ నేత.. ఈ మధ్యన జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి చెందిన సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన జీఎస్టీ అధికారులు తనిఖీలు నిర్వహించిన వైనం ఆసక్తికరంగానే కాదు.. రాజకీయంగా కొత్త వేడికి కారణమైందన్న మాట వినిపిస్తోంది.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడు సంకీర్త్ రెడ్డి ఎండీగా ఉన్న సుశీ ఇన్ ఫ్రా సంస్థలో తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ అధికారులు తనిఖీలు చేయటం కొత్త కలకలానికి తెర తీసింది. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నడుస్తున్న ఫైటింగ్ లో సరికొత్త అంకం షురూ అయినట్లుగా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన జీఎస్టీ కమిషనరేట్ కు చెందిన 150 మంది అధికారులు 25 టీంలుగా ఏర్పడి సోదాల్ని నిర్వహిస్తున్నారు.

సుశీ గ్రూపునకు చెందిన 16 కంపెనీల మీద సోమవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఏకకాలంలో దాడులు జరగటం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా జీఎస్టీ రిటర్నులు.. పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉన్నాయన్న వాటికి సంబంధించిన సమాచారంతో సోదాల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కంప్యూటర్లు.. హార్డు డిస్కులు.. ఇతర పత్రాల్ని భారీగా స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం వందల కోట్లు పన్నులు ఎగవేసిన దానికి సంబంధించిన ఆధారాలు లభించినట్లుగా చెబుతున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక వేళ బీజేపీ నేతలు సుశీ ఇన్ ఫ్రా సంస్థ నుంచే లావాదేవీలు జరిపినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. మరో వైపు రాష్ట్ర సర్కారు సైతం ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకొని విచారణ జరుపుతోంది. తాజా ఎపిసోడ్ తో రానున్న రోజుల్లో మరిన్ని సోదాలకు తెర తీయటమే కాదు.. రాజకీయ అలజడి మరింత పెరిగే వీలుందన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.