Begin typing your search above and press return to search.

మీరు క‌రెక్టా? మీ లెక్క‌ల మంత్రి క‌రెక్టా కేసీఆర్ ?

By:  Tupaki Desk   |   5 July 2017 5:55 AM GMT
మీరు క‌రెక్టా? మీ లెక్క‌ల మంత్రి క‌రెక్టా కేసీఆర్ ?
X
కీల‌క విష‌యాల‌పై మాట్లాడేట‌ప్పుడు ఆచితూచి మాట్లాడాలి. అధికార పార్టీకి చెందిన ముఖ్య‌నేత‌ల మ‌ధ్య మాట‌ల్లో అస్స‌లు తేడా రాకూడ‌దు. కానీ.. తాజా ఎపిసోడ్ లో తెలంగాణ అధికార‌పక్షం ముచ్చ‌ట చూస్తే.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట‌ల‌కు.. రాష్ట్ర ఆర్థిక‌మంత్రి ఈటెల రాజేంద‌ర్ మాట‌ల‌కు సంబంధం లేని వైనం క‌నిపిస్తోంది.

త‌న‌కు న‌చ్చింది ఏదైనా స‌రే.. నెత్తిన ఎత్తుకోవ‌ట‌మే కాదు.. ఆకాశానికి ఎత్తేస్తూ పొగిడేయ‌టం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు అల‌వాటు. ప‌లు విష‌యాల్లో ఆయ‌న తీరులో ఈ విష‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంటుంది. మోడీ స‌ర్కారు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న జీఎస్టీ విష‌యంలోనూ ఇది క‌నిపిస్తుంది. జీఎస్టీ బిల్లును కేంద్రం ఆమోదించిన వెంట‌నే.. బీజేపీయేత‌ర‌.. ఆ మాట‌కు వ‌స్తే ఎన్డీయే భాగ‌స్వామ్య ప‌క్షాల‌కంటే ముందుగా రియాక్ట్ అయి.. ప్ర‌త్యేక అసెంబ్లీ స‌మావేశాన్ని ఏర్పాటు చేసి మ‌రీ జీఎస్టీని ఆమోదించటం తెలిసిందే.

జీఎస్టీ బిల్లును ఆమోదించేట‌ప్ప‌డు లేని అభ్యంత‌రాలు.. స‌రిగ్గా అది అమ‌ల‌య్యే వేళ‌లో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి కొత్త వాద‌న‌ను తెర మీద‌కు తీసుకొచ్చారు. జీఎస్టీ కార‌ణంగా తెలంగాణ‌కు న‌ష్ట‌మ‌ని... త‌మ‌కు న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌ని వ్యాఖ్యానించారు. నిజానికి ఇలాంటి అభ్యంత‌రాలు ఏమైనా ఉంటే.. వాటిని బిల్లు ఆమోదించే స‌మ‌యంలోనే తెర మీద‌కు తీసుకురావాలి. కానీ.. చ‌ట్టం అమ‌ల్లోకి వ‌చ్చే వారం.. ప‌ది రోజుల ముందు ఇలాంటి వాద‌న‌ను తెర మీద‌కు తీసుకురావ‌టం ద్వారా ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు.

ఇదో అంశం అయితే.. జీఎస్టీ కార‌ణంగా తెలంగాణ రాష్ట్రానికి రూ.3వేల కోట్ల న‌ష్టం వాటిల్లుతుంద‌ని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద‌ర్ చెబుతుంటే.. మ‌రోవైపు అదే జీఎస్టీ కార‌ణంగా తెలంగాణ‌కు రూ.3వేల కోట్ల మేర లాభం చేకూరుతుందంటూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఒకే బిల్లు విష‌యంలో అధికార ప‌క్షానికి చెందిన ముఖ్య‌మంత్రి నోటి నుంచి ఒక మాట‌.. విత్త మంత్రి నోటి నుంచి అందుకు పూర్తి భిన్న‌మైన మాట రావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇందులో ఎవ‌రి మాట నిజ‌మ‌ని న‌మ్మాల‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. కీల‌క‌మైన విష‌యాల గురించి మాట్లాడేట‌ప్పుడు ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌రైన ఎక్స్ ర్ సైజ్ లేకుండా మాట్లాడేస్తున్నారా? అన్న‌ది క్వ‌శ్చ‌న్.

ఒక‌వేళ కాద‌న్న మాటే చెబితే.. మ‌రీ.. విష‌యం మీద ఈటెల ఎందుకంటే వ‌ర్రీ అవుతున్నార‌న్న‌ది ప్ర‌శ్న‌. ఏమైనా జీఎస్టీ విష‌యంలో రూ.3వేల కోట్లు తెలంగాణ‌కు లాభం అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌.. ఆయ‌న ప్ర‌భుత్వానికి ఇబ్బందిక‌ర‌మ‌న్న మాట వినిపిస్తోంది. ఇంత‌కీ.. జీఎస్టీ విష‌యంలో కేసీఆర్‌.. ఈటెల మ‌ధ్య లెక్క‌లో ఎందుకు తేడా వ‌చ్చిన‌ట్లు? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. దీనికి అయితే కేసీఆర్ అయినా స‌మాధానం చెప్పాలి.. లేదంటే ఈటెల చెప్పినా బాగానే ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.