Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఆకాశంలో.. గవర్నర్ భూమార్గంలో..ఇద్దరూ ఒకే చోటకు..

By:  Tupaki Desk   |   16 July 2022 2:30 PM GMT
కేసీఆర్ ఆకాశంలో.. గవర్నర్ భూమార్గంలో..ఇద్దరూ ఒకే చోటకు..
X
తెలంగాణలో వరద బాధితుల పరామర్శలోనూ కేసీఆర్, గవర్నర్ పోటీ పడుతున్నారు. నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్నారు. మొన్ననే రాజ్ భవన్ లో కలిసి ముచ్చట్లు పెట్టుకున్న వీరిద్దరూ తాజాగా తమ తమ భావజాలం ప్రకారం వెళుతున్నారు. తెలంగాణ సీఎంగా కేసీఆర్ వరద బాధితుల బాధితుల పరామర్శ కోసం వెళుతుండగా.. ఇక బీజేపీ నియమించిన గవర్నర్ తమిళిసై కూడా ఇబ్బంది పెట్టడానికి రెడీ అయ్యారు.

సాధారణంగా గవర్నర్లు అంటే ఉత్సవ విగ్రహాలుగా ఉంటారు. కానీ బీజేపీ నియమించిన గవర్నర్లు మాత్రం అక్కడి ప్రతిపక్ష, ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేసి చేస్తున్న రాజకీయం అంతా ఇంతాకాదు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణలో వరద బాధితుల రాజకీయం షురూ అయ్యింది. కేసీఆర్, గవర్నర్ ఇద్దరూ ఒకే రోజున వరద బాధితులకు సంబంధించి కార్యక్రమాన్ని చేపట్టడం విశేషం.

తెలంగాణలో వరద బీభత్సం సృష్టించింది. ఉత్తర తెలంగాణలో గ్రామాలు, పట్టణాలు మునిగాయి. వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇక గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టులన్నీ నిండాయి. కాళేశ్వరం సహా ఎత్తిపోతల పంప్ హౌస్ లన్నీ వరదలో కూరుపోయి కోట్ల నష్టం వాటిల్లింది.

ఈ క్రమంలోనే వరద బీభత్సంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే చేపట్టేందుకు నిర్ణయించారు. ఇద్దరూ ఒకే రోజు వరద బాధితులకు సంబంధించి కార్యక్రమం చేపట్టారు. సీఎం కేసీఆర్ ఆకాశంలో విహరిస్తుండగా.. గవర్నర్ మాత్రం భూమార్గంలో వెళ్లడానికి నిర్ణయించారు. కొద్దిరోజులుగా గవర్నర్ కు కనీస సదుపాయాలు కల్పించకుండా.. ప్రోటోకాల్ గౌరవం ఇవ్వకుండా విసిగిస్తున్న కేసీఆర్ సర్కార్ తాజాగా గవర్నర్ కు హెలిక్యాప్టర్ సమకూర్చలేనట్టుంది. అందుకే నేరుగా ప్రజల వద్దకు వెళ్లాలని.. వాహనంలోనే ప్రయాణించాలని గవర్నర్ నిర్ణయించారు.

వరద బాధితులను పరామర్శించేందుకు గవర్నర్ తమిళిసై ఆదివారం భద్రాచలం వెళ్లనున్నారు. అక్కడి ముంపు ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఇప్పటికే తమను ప్రభుత్వం పట్టించుకోలేదని భద్రాచలంలో కొన్ని కాలనీవాసులు రోడ్డెక్కారు. దీంతో గవర్నర్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

శనివారం రాత్రి సికింద్రాబాద్ నుంచి రైలులో బయలుదేరి ఆదివారం ఉదయానికి గవర్నర్ భద్రాచలం చేరుకుంటారు. ముంపు బాధితుల గోడు వింటారు. కేసీఆర్ ను ఇరుకునపెట్టడానికే రైలులో తమిళిసై సాధారణంగా వెళుతున్నారని.. ఇది కేసీఆర్ కు షాకిచ్చినట్టేనని పలువురు చెబుతున్నారు.