Begin typing your search above and press return to search.

గ‌మ‌నించారా? తెలుగు రాష్ట్రాల ఇద్ద‌రు సీఎంలు మౌనం!

By:  Tupaki Desk   |   6 July 2019 6:13 AM GMT
గ‌మ‌నించారా?  తెలుగు రాష్ట్రాల ఇద్ద‌రు సీఎంలు మౌనం!
X
కేంద్ర ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ చూసినంత‌నే క‌డుపు మండిపోయే ప‌రిస్థితి. సామాన్యుడు.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి ఊర‌ట క‌లిగించే అంశాలేవీ అందులో లేద‌న్న ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదిలా ఉంటే.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కేంద్ర బ‌డ్జెట్ పైన గ‌రంగ‌రంగా ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. మాట వ‌ర‌స‌కు.. మొహ‌మాటం కోస‌మైనా కానీ తెలుగు రాష్ట్రాల‌కు కేటాయింపులు జ‌ర‌ప‌లేదంటున్నారు.

బ‌డ్జెట్ ను చూసినంత‌నే పార్ల‌మెంటు బ‌య‌ట‌కు వ‌చ్చినంత‌నే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ సభ్యులు విజ‌య‌సాయి రెడ్డి త‌న అసంతృప్తిని క‌డుపులో దాచుకోలేక‌పోయారు. కేంద్ర బ‌డ్జెట్ త‌న‌ను తీవ్ర నిరాశ‌కు గురి చేసింద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఆర్థిక నిపుణుడిగా ఆయ‌న అంచ‌నాను కొట్టిపారేయ‌లేం. ఆచితూచి అన్న‌ట్లుగా మాట్లాడే ప్ర‌య‌త్నం చేసిన ఆయ‌న‌.. ఏపీకి ఎలాంటి ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌టాన్ని ఆయ‌న జీర్ణించుకోలేక‌పోతున్న విష‌యం ఆయ‌న మాట‌ల్లో క‌నిపించింది.

రెండు తెలుగు రాష్ట్రాలు త‌న ప్రాధాన్య‌త క్ర‌మంలో లేద‌న్న భావ‌న‌ను మోడీ స‌ర్క‌రు తాజాగా బ‌డ్జెట్ తో స్ప‌ష్టం చేసింద‌న్న‌మాట వినిపిస్తోంది. వాస్త‌వానికి బ‌డ్జెట్ కేటాయింపులు చూసినంత‌నే అసంతృప్తితో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు స్పందించాల్సి ఉంది. కానీ.. అలాంటిదేమీ చోటు చేసుకోలేదు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు బ‌డ్జెట్ మీద స్పంద‌న వ్య‌క్తం చేయ‌లేదు.

మోడీపై నిప్పులు చిమ్మ‌టం ద్వారా న‌ష్ట‌మే త‌ప్పించి లాభం ఉండ‌ద‌న్న విష‌యాన్ని రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు గుర్తించిన కార‌ణంగానే బ‌డ్జెట్ మీద రియాక్ట్ కాలేద‌న్న మాట వినిపిస్తోంది. బ‌డ్జెట్ లో రెండు రాష్ట్రాల‌కు ప్రాధాన్య‌త ద‌క్క‌క‌పోవ‌టం త‌ర్వాత‌.. క‌నీస కేటాయింపులు కూడా లేవ‌న్నట్లుగా ఉండ‌టంపై వారి రియాక్ష‌న్ లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ‌ని.. ఇప్ప‌టి ప‌రిస్థితుల్లో మోడీ మాష్టారికి వ్య‌తిరేకంగా మాట్లాడ‌టం కంటే కూడా మౌనంగా ఉండ‌ట‌మే మంచిద‌న్న అభిప్రాయంతో వారు నోరు విప్ప‌లేదంటున్నారు. రాష్ట్రానికి న‌ష్టం వాటిల్లినా దాని మీద నోరు విప్ప‌లేని విచిత్ర‌మైన ప‌రిస్థితులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.