Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో జానా.. కేసీఆర్ మధ్య భోజనం మాట

By:  Tupaki Desk   |   1 Oct 2015 4:30 AM GMT
అసెంబ్లీలో జానా.. కేసీఆర్ మధ్య భోజనం మాట
X
అధికారపక్షం.. విపక్షం మధ్య సంబంధాలు ఎలా ఉండాలి. ఒక రాష్ట్ర అభివృద్ధిలో అధికార.. విపక్షాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణితో పాటు.. నిర్మాణాత్మకంగా సలహాలు.. సూచనలు ఇచ్చుకుంటే ఎంత బాగుంటుంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఇలాంటి కల మాదిరే కనిపిస్తాయి.. ఆచరణ సాధ్యం కాదని పలువురు చెప్పొచ్చు. అసెంబ్లీ సమావేశాలు అనగానే మాటలు తూటాల్లా పేలుతూ.. కొట్టుకున్నట్లుగా ఉండటమే కాదు.. అప్యాయంగా మాట్లాడుకోవటం కూడా తమకు వచ్చన్న విషయం తాజాగా నిరూపితమైంది.

బుధవారం తెలంగాణ అసెంబ్లీలో చోటు చేసుకున్న దృశ్యం చూస్తే.. అధికార.. విపక్షాలు కాస్తంత సంయమనం పాటిస్తే.. కలిసికట్టుగా ఉండటం పెద్ద కష్టమేమీ కాదన్న విషయం బోధ పడుతుంది.

రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ సమాధానం ఇచ్చిన నేపథ్యంలో.. దానిపై తనకున్న సందేహాల్ని తీర్చుకోవాల్సి ఉందని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు ఆత్మహత్యలపై విషయంపై నేను కొన్ని సలహాలు.. సూచనలు చేయాలని అనుకుంటున్నా.. దీనికి కొంచెం ఎక్కువ సమయమే పడుతుంది. సభ్యులకు అభ్యంతరం లేకుంటే ఇప్పుడు సగం.. బోజన విరామం తర్వాత మిగిలిన సగం మాట్లాడతా అని అన్నారు.

దీనికి స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించుకొని.. ‘భోజనం చేస్తేనే బాగా మాట్లాడుకుంటాం. బాగా చర్చించుకుంటాం. భోజనం తర్వాత మీ సలహాలు ఇవ్వండి’ అని బదులిచ్చారు. దీనికి వెంటనే స్పందించిన జానారెడ్డి.. భోజనం తర్వాత మీరు సభలో ఉంటారా? అని ప్రశ్నిస్తే.. తప్పకుండా వస్తా.. భోజనం చేసి వద్దామని ఆయన చెప్పటంతో సభలో నవ్వులు విరబూశాయి.

అధికార.. విపక్ష సభ్యుల మధ్య ఉండాల్సిన మర్యాద.. అప్యాయత ఇదే తీరులో ఉంటే రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు సమాధానం దొరకటమే కాదు.. ఎన్నికల సమయంలో రాజకీయం మిగిలిన సమయాల్లో ప్రజా సంక్షేమం అన్న మాట కూడా నిజం కావటం పెద్ద కష్టం కాదు. భోజనం విషయంలో కనిపించిన కలుపుగోలుతనం మిగిలిన విషయాల్లోనూ ఉంటే ఎంత బాగుండో..?