Begin typing your search above and press return to search.

విద్యార్థుల డేటాను ప్రైవేటు సంస్థ‌కు ఇవ్వ‌ట‌మా కేసీఆర్‌?

By:  Tupaki Desk   |   1 May 2019 3:30 AM GMT
విద్యార్థుల డేటాను ప్రైవేటు సంస్థ‌కు ఇవ్వ‌ట‌మా కేసీఆర్‌?
X
ల‌క్ష‌లాది మంది విద్యార్థుల స‌మాచారాన్ని ప్రైవేటు సంస్థ‌కు ధారాద‌త్తం చేస్తారా? అంటే.. నో చెబుతారు ఎవ‌రైనా. కానీ.. ఘ‌న‌త వ‌హించిన తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించిన వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ల‌క్ష‌లాది మంది విద్యార్థుల డేటాను వెనుకా ముందు చూసుకోకుండా ఒక ప్రైవేటు సంస్థ‌కు క‌ట్ట‌బెట్టినట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది.

ఈ సంద‌ర్భంగా డేటా వ్య‌వ‌హారం మీద కేసీఆర్ స‌ర్కారు చేసిన హ‌డావుడిని ప‌లువురు గుర్తు చేసుకుంటున్నారు. ప్ర‌జ‌ల‌కు సంబంధించిన డేటా ఒక ప్రైవేటు కంపెనీ చేతుల్లో ఉండ‌ట‌మా? అంటూ క‌ళ్ల‌ను ప‌త్తికాయ‌ల మాదిరి పెద్ద‌విగా చేసిన తెలంగాణ ప్ర‌భుత్వం త‌న వ‌ర‌కూ వ‌చ్చేస‌రికి.. అదే విధానాన్ని అమ‌లు చేయ‌టం.. అది కాకుండా గ‌తంలోనే ఈ త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రించ‌టం దేనికి నిద‌ర్శ‌న‌మ‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

ఇంట‌ర్ విద్యార్థుల ఫ‌లితాల్లో చోటు చేసుకున్న అవ‌క‌త‌వ‌క‌లు ఎపిసోడ్ లో గ్లోబ‌రీనా సంస్థ‌దే పాప‌మ‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంస్థ గురించి త‌న‌కు అస్స‌లు తెలీద‌న్న కేటీఆర్ మాట‌ల్లో నిజం లేద‌న్న విష‌యం తాజాగా బ‌య‌ట‌కు వ‌స్తున్న వాద‌న‌ల‌తో బ‌ల‌ప‌డే ప‌రిస్థితి.

తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ.. గ్లోబ‌రీనా కేటీఆర్ కు తెలిసే అవ‌కాశం ఎంత ఎక్కువ‌గా ఉంద‌న్న విష‌యాన్ని చెప్పిన వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. గ‌తంలో త‌ప్పులు చేసినందుకు మ్యాగ్న‌టిక్ ను ఎస్సెస్సీ.. ఇంట‌ర్ బోర్డులు నిషేధించ‌గా.. దాని కంటే త‌క్కువ‌కు కోట్ చేశార‌ని గ్లోబ‌రీనాకు టెండ‌ర్ క‌ట్ట‌బెట్ట‌టం ఏమిట‌న్న ప్ర‌శ్న‌లోను లాజిక్ క‌నిపించ‌క మాన‌దు. మ‌రో విష‌యం ఏమంటే.. మ్యాగ్న‌టిక్ సంస్థ వారిదే గ్లోబ‌రీనా కావ‌టం చూస్తే.. అంతా కూడ‌బ‌లుక్కొని మ‌రీ త‌ప్పులు చేశారా? అన్న సందేహం రాక మాన‌దు.

కీల‌క‌మైన విద్యార్థుల డేటాను ప్రైవేటు కంపెనీల‌కు ఇవ్వ‌కూడ‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఏ నిబంధ‌న కింద 10 ల‌క్షల మంది విద్యార్థుల డేటాను ప్రైవేటు సంస్థ‌ల‌కు ఇచ్చార‌న్న ప్ర‌శ్నకు ప్ర‌భుత్వం స‌మాధానం చెప్పాల్సిందేన‌న్న డిమాండ్ అంత‌కంత‌కూ పెరుగుతోంది. మొత్తంగా చూస్తే.. గ్లోబ‌రీనా నిర్ల‌క్ష్యం ఇప్పుడు కొత్త అంశాల్ని తెర మీద‌కు తెచ్చేలా చేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.