Begin typing your search above and press return to search.

సీనియర్లు తక్కువ..యువత ఎక్కువ

By:  Tupaki Desk   |   29 Dec 2018 4:50 AM GMT
సీనియర్లు తక్కువ..యువత ఎక్కువ
X
తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు తన మంత్రివర్గాన్ని విస్తరించే పనిలో పడ్డారు. ఈనెల 30 అంటే ఈ చివరి ఆదివారం కాని - జనవరి మొదటి వారంలో కాని మంత్రివర్గాన్ని విస్తరించే ప‌ని చేపడతారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్యాబినెట్ కెపాసిటీ 18 మంది. అయితే తొలి విస్తరణలో ఆరు లేదా ఎనిమిది మందికి మాత్రమే అవకాశం ఉంటుందని వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జాతీయ రాజకీయాల వైపు శ్రద్ధ పెట్టేందుకు పార్టీ పగ్గాలను తన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావుకు అప్పగించారు. ఆయన కూడా పార్టీని పటిష్టం చేసే పనిని ప్రారంభించారు. ఇదిలా ఉండగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన మంత్రివర్గ కూర్పును ఏ విధంగా చేపట్టబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. గత క్యాబినెట్ లో మహిళలకు ఒక్క మంత్రి పదవి కూడా దక్కలేదు. కేవలం డిప్యూటీ స్పీకర్ పదవిని మాత్రమే ఇచ్చారు. దీంతో ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో ఈసారి మంత్రి వర్గంలో మహిళలకు కచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయంటున్నారు.

తన కుమారుడిని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు చేసిన కేసీఆర్ భవిష్యత్ లో ముఖ్యమంత్రి పీఠం ఆయనకే అప్పగించవచ్చుననే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి వర్గంలోని సీనియర్లను తీసుకోకుండా యువతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. ఈసారి మంత్రివర్గంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు ముద్ర ఎక్కువగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి - హోమంత్రి కలిపి ఇద్దరు మంత్రులున్నారు. ఇక మిగిలిన 16 మంత్రిపదవులు ఎవరిని వరిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. కార్యనిర్వాహక అధ్యక్షుడు అయిన తర్వాత కేటీఆర్ ప్రతి రోజు తెలంగాణ భవన్ కు వస్తున్నారు. సీనియర్లతో పాటు కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు తెలంగాణ భవన్ కు వచ్చి కేటీఆర్ ను కలుస్తున్నారు. అంతే కాదు.... "అన్నా మమ్మల్నీ చూడండి" అంటూ వినతి పత్రాలు ఇస్తున్నారు. దీనర్ధం కల్వకుంట్ల తారక రామారావు అనధికారికంగా ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న వారు మంత్రివర్గంలో సీనియర్ల కంటే యువతకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేలా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.