Begin typing your search above and press return to search.

కేటీఆర్ ‘ఐఏఎస్’ మాటకు మామూలు పంచ్ పడలేదుగా?

By:  Tupaki Desk   |   19 Aug 2021 4:59 AM GMT
కేటీఆర్ ‘ఐఏఎస్’ మాటకు మామూలు పంచ్ పడలేదుగా?
X
కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అక్కర్లేదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. సినిమాల్లో వినిపించే ఈ డైలాగ్.. రాజకీయాలకు వర్తిస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి కేటీఆర్ లాంటి నేతల నోటి నుంచి వచ్చే మాటల పవర్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి మాటల్ని నమ్మిన వారి నమ్మకాన్ని సైతం పటాపంచలు చేసేలా.. తన పదునైన వాదనతో ఎప్పటికప్పుడు కళ్లు తెరిపించేలా వ్యవహరించే నేతల్లో రేవంత్ ఒకరు. తాజాగా ఆయన ఇచ్చిన కౌంటర్లు తెలంగాణ తండ్రి కొడుకులుగా పిలిచే.. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమారుడు కేటీఆర్ లకు షాకింగ్ గా మారాయని చెప్పాలి.

తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. తనకు దళితుల మీద ఉన్న ప్రేమను చాటి చెప్పటమేకాదు.. అధికారంలోకి వచ్చిన ఏడేళ్లకు తనకు హక్కుల నేత.. పేదల తరఫున వాదించే న్యాయవాది బొజ్జా తారకం గుర్తుకు వచ్చిన విషయాన్ని గొప్పగా చెప్పుకోవటం.. ఆయన కుమారుడు రాహుల్ బొజ్జాను సీఎంవోలకి తీసుకోవటాన్ని ప్రస్తావించారు. నిజానికి గొప్పలు విన్నప్పుడు బాగుంటాయి. కానీ.. వాటిని చీల్చి చెండాడే నేతల మాటలతోనే కొత్త కష్టం ఎదురవుతుంది. తాజాగా కేసీఆర్ పరిస్థితి ఇంచుమించు ఇలానే ఉందని చెప్పాలి.

బొజ్జా తారకం గురించి.. ఆయన కుమారుడికి పదవిని ఇచ్చిన విషయంపై కేసీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ ఘాటైన విమర్శలు చేశారు. ఈ సందర్భంగా గతాన్ని తవ్వి తీసి.. కేసీఆర్ నిర్ణయాల్ని తూర్పార పట్టారు. ఆయన మాటలకు చేతలకు మధ్యనున్న వ్యత్యాసాన్ని ఎత్తి చూపారు. దళిత అధికారుల్ని ఎలా అవమానించారో రాష్ట్ర ప్రజలకు తెలుసన్న రేవంత్.. ‘‘బొజ్జా తారకం కుమారుడు రాహుల్ బొజ్జాను ప్రత్యేక అధికారికంగా సీఎం పేషీలో తీసుకున్నామని గొప్పలు చెబుతున్నారు. గతంలో నిజాయితీపరులైన దళిత అధికారులకు మీరు ఎలాంటి ద్రోహం చేశారో తెలియదా? మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి రాష్ట్రానికి వచ్చినప్పుడు నాటి రాష్ట్ర గవర్నర్ నర్సింహన్ కు సాష్టాంగ నమస్కారం చేసిన కేసీఆర్.. దళితుడైన ప్రస్తుత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ వస్తే ఎలాంటి మర్యాద చేస్తున్నారో తెలీదా? గతంలో చీఫ్ సెక్రటరీలుగా చేసిన రాజీవ్ శర్మ.. ఎస్ కే జోషి.. అనురాగ్ శర్మ రిటైర్మెంట్ అయినప్పటికి.. వారి పదవీ కాలాన్ని మూడేళ్లు పొడిగించారు. దళిత బిడ్డ.. నిజాయితీకి మారుపేరైన ప్రదీప్ చంద్రకు ఆ అవకాశం ఎందుకు ఇవ్వలేదు?’’ అని ప్రశ్నించి ఉక్కిరిబిక్కిరి చేశారు.

భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా ఉన్న మురళిని అవమానించి సాగనంపిన విషయం నిజం కాదా? అని ప్రశ్నించిన రేవంత్.. మా పాలమూరు బిడ్డ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ డీజీపీ అయ్యే అవకాశం ఉన్నా.. మీరు పెట్టే బాధలు భరించలేక పదవిని వదిలేసింది నిజం కాదా? అని ఘాటు ఆరోపణలు చేశారు. రెండు రోజుల క్రితం గీతం కాలేజీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. తాను రాజకీయాల్లోకి తన తండ్రికి తెలీకుండా వచ్చానని చెప్పటం తెలిసిందే. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు షాకింగ్ కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి.

‘ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ ఐఏఎస్ అవుదామనుకుంటే ఆయనకు తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చాడంట. ఒరే సన్నాసి కేటీఆర్.. ఏం మాట్లాడుతున్నావ్. సిరిపిల్లలో మహేందర్ రెడ్డికి మీ అయ్య ద్రోహం చేసి నీకు టికెట్ ఇచ్చింది వాస్తవం కాదా? చంద్రబాబు కాళ్లుపట్టుకుంటే నిన్న టీడీపీ గెలిపించింది నిజం కాదా? ఆయన అయ్యకు తెలియకుండా ఎమ్మెల్యే.. మంత్రి అయ్యాడంట’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్.. కేటీఆర్ నోటి నుంచి వచ్చిన కీలక వ్యాఖ్యలకు రేవంత్ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి.. దీనిపై వారెలా రియాక్టు అవుతారో చూడాలి.