Begin typing your search above and press return to search.

మాకు 16 వ‌స్త‌య్.. మాకు 30 వ‌స్త‌య్!

By:  Tupaki Desk   |   14 May 2019 8:00 AM GMT
మాకు 16 వ‌స్త‌య్.. మాకు 30 వ‌స్త‌య్!
X
అవ‌స‌రానికి మించిన బ‌ల‌హీన‌త మ‌రొక‌టి ఉండ‌దు. రాజును సైతం బంటుగా మార్చేస్తుంది అవ‌స‌రం. అందుకే ఎలాంటోడైనా స‌రే.. వారి అవ‌స‌రాన్ని గుర్తిస్తే చాలు.. ఎలాంటి ప‌నైనా ఇట్టే జ‌రిగిపోతుంది. ఎంత‌టి బ‌ల‌వంతుడైనా.. మేధావి అయినా.. మ‌రింకేమైనా అవ‌స‌రం అస్త్రాన్ని వాడేస్తే.. బుద్ధిగా త‌ల ఊపాల్సిందే. తాజాగా అలాంటి ఆస‌క్తిక‌ర స‌న్నివేశానికి వేదికైంది త‌మిళ‌నాడు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాల‌న్న కేసీఆర్ క‌ల సాకార‌మై.. బంగారు తెలంగాణ‌లో భాగంగా త‌న వ్యూహం ఫ‌లించిన వేళ‌.. స‌హ‌జంగానే ఆశ ఢిల్లీ పీఠం మీద ప‌డుతుంది. పీఠం ఎక్కాల‌ని లేకున్నా.. పీఠం మీద కూర్చున్నోడు చెప్పిన‌ట్లు వింటుంటే వ‌చ్చే మ‌జా అంతా ఇంతా కాదు. అందులోకి తెలుగు రాజ‌కీయాల్లో త‌న‌కు మించిన తోపు లేద‌న్న భావ‌న ఒక‌టికి నాలుగుసార్లు ఫ్రూవ్ అవుతున్న‌ప్పుడు కేసీఆర్ మాత్ర‌మే కాదు.. ఎలాంటివాడికైనా వారి మీద వారికి కాన్ఫిడెన్స్ విప‌రీతంగా పెరిగిపోతుంది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప‌రిస్థితి ఇందుకు భిన్నం కాదు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో ప్ర‌యాణాలు చేస్తున్న కేసీఆర్ కు.. ఇప్ప‌టివ‌ర‌కూ మ‌రే రాష్ట్రంలో ఎదురుకాని సిత్ర‌మైన ప‌రిస్థితులు త‌మిళ‌నాడులో చోటు చేసుకున్నాయి. మాట అంటే మాట మీద నిల‌వ‌ట‌మే త‌ప్పించి.. వెన‌క్కి త‌గ్గ‌టం.. ప్ర‌యోజ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగా నిర్ణ‌యాలు మార్చేసుకోవ‌టం లాంటి స‌మకాలీన రాజ‌కీయాలు త‌మ‌కింకా అబ్బ‌లేద‌న్న విష‌యాన్ని స్టాలిన్ చెప్పేయ‌ట‌మే కాదు.. సారు లాంటి పెద్ద మ‌నిషి మాట‌ల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా.. త‌న వాద‌న‌ను బ‌లంగా వినిపించినట్లుగా చెబుతున్నారు. .

ఎప్పుడైనా.. ఎక్క‌డైనా.. సారు చెప్ప‌టం.. మిగిలిన వారు విన‌టం. ప్ర‌ధాని మోడీ మాష్టారు లాంటోళ్ల‌ను క‌లిసిన సంద‌ర్భంలోనూ.. ఆయ‌నేం చేస్తే బాగుంటుంద‌న్న విష‌యాన్ని చెప్పే కేసీఆర్ కు.. ఈసారి సీన్ రివ‌ర్స్ అయ్యింది. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కంటే కూడా.. కాంగ్రెస్ కూట‌మితో క‌లిసి వెళితే మంచిద‌న్న మాట‌ను చెప్ప‌ట‌మే కాదు.. కేసీఆర్ చేత ఓకే అనిపించ‌టంలో స్టాలిన్ స‌ఫ‌ల‌మైన‌ట్లుగా విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లో డీఎంకే లాంటి బ‌ల‌మైన రాజ‌కీయ ప‌క్షం అవ‌స‌రం కేసీఆర్ కు ఉండ‌టంతో ఆయ‌న చాలా సంద‌ర్భాల్లో త‌గ్గాల్సి వ‌చ్చింది. కేసీఆర్ ముఖ్య‌మంత్రే అయినా.. ఆయ‌నో చిన్న రాష్ట్రానికి అధినేత అన్న విష‌యం స్టాలిన్ భేటీలో అర్థ‌మై ఉంటుంది. ఎందుకంటే.. తాజాగా జ‌రిగిన ఎంపీ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో ఉన్న 17 స్థానాల్లో 16 చోట్ల తాము గెల‌వ‌టం ఖాయ‌మ‌ని చెప్పుకుంటే.. త‌మిళ‌నాడులో ఉన్న 39 స్థానాల్లో డీఎంకే 30 ప్ల‌స్ స్థానాల్ని సొంతం చేసుకోవ‌టం ప‌క్కా అంటూ స్టాలిన్ చెప్పిన వేళ‌.. ఎవ‌రు ఎక్కువ‌.. మ‌రెవ‌రు త‌క్కువ‌న్న విష‌యం ఇట్టే తెలిసిపోయే ప‌రిస్థితి.

ఇలా ప్ర‌తి విష‌యంలో తాను స్టాలిన్ కంటే బ‌ల‌హీనుడ్ని అన్న విష‌యం కేసీఆర్ సారుకు అర్థం కావ‌టం ఆయ‌న జీర్ణించుకోలేని ప‌రిస్థితి. ఈ కార‌ణంతోనే తాను ఫిక్స్ చేసుకొచ్చిన ఎజెండాకు భిన్నమైన ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టంతో ఏమీ మాట్లాడ‌లేని ప‌రిస్థితి. డీఎంకేతో త‌న‌కున్న భ‌విష్య‌త్ అవ‌స‌రాల దృష్ట్యా.. త‌గ్గాల్సిన ప‌రిస్థితి కేసీఆర్ కు వ‌చ్చింది. ముందుకెళ్లి మ‌రీ.. వెన‌క్కి త‌గ్గాల్సి రావ‌టానికి మించిన ఇబ్బంది మ‌రేం ఉంటుంది. అందులోకి త‌న‌కు మించిన ఆత్మాభిమానం మ‌రెవ‌రికీ ఉండ‌ద‌ని భావించే కేసీఆర్‌కు స్టాలిన్ సార్ భ‌లే పాఠాన్ని నేర్పి పంపార‌నే చెప్పాలి. త‌న‌కు సాటి రాగ‌ల వాళ్లు ఎవ‌రూ ఉండ‌ర‌న్న‌ట్లుగా ఫీల‌య్యే సారుకు స్టాలిన్ పుణ్య‌మా అని చిన్న‌బోయే ప‌రిస్థితి ఎదురైందంటున్నారు. మ‌న‌కు అవ‌స‌రమైన దాని కోసం.. ఇలాంటివెన్నో భ‌రించాలి మ‌రి.