Begin typing your search above and press return to search.

రూ.500 కోట్ల కోసం ఢిల్లీకి వెళ్లాలా?

By:  Tupaki Desk   |   10 Jan 2019 5:31 AM GMT
రూ.500 కోట్ల కోసం ఢిల్లీకి వెళ్లాలా?
X
అస‌లు విష‌యాన్ని చెప్పే ముందు కొస‌రు సంగ‌తి ఒక‌టి చెప్పాలి. అప్పుడు మ‌రింత స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. మీరు చాలా సౌండ్ పార్టీ. మీకు డ‌బ్బుల అవ‌స‌ర‌మే ఉండ‌దు. ఎవ‌రికైనా ఇవ్వ‌ట‌మే కానీ అప్పు అడిగే ప‌రిస్థితి మీకు ఉండ‌దు. అలాంటి మీరు అప్పు అడిగితే.. వెంట‌నే ఇచ్చేందుకు క్యూ క‌డ‌తారు. అలా మొద‌ల‌య్యే ప‌ర్వం.. ఒక ద‌శ దాటిన త‌ర్వాత అప్పు తీసుకోవ‌టం ఆప‌కుండా.. అదే ప‌నిగా అప్పు మీద అప్పు అడిగే ప‌రిస్థితి ఉండే సీన్ మొత్తం మారుతుంది.

ఒక‌ప్పుడు మీరు అప్పు అడ‌గ‌ట‌మే గొప్ప‌గా ఫీలై.. అడిగినంత‌నే ఇంటికి తెచ్చి ఇచ్చే ప‌రిస్థితి పోయి.. వారింటి చుట్టూ తిరిగే ప‌రిస్థితికి చేరుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర తాజా ఆర్థిక ప‌రిస్థితి ఇంచుమించు అదే రీతిలో ఉంద‌ని చెప్పాలి. ధ‌నిక రాష్ట్రంగా ఉన్న పేరు త‌ర్వాత‌.. ఇప్పుడు రూ.500 కోట్ల అప్పు కోసం ఢిల్లీకి ఫైళ్లు ప‌ట్టుకొని బ్యాచుల వారీగా వెళ్లాల్సి వ‌స్తోంది.

రూ.500 కోట్లు ఏమ‌న్నా చిన్న మొత్త‌మా? అంత పెద్ద మొత్తం అప్పు కోసం ఢిల్లీకి వెళ్లాల్సిన అవ‌స‌రం ఉండ‌దా? అని ప్ర‌శ్నించొచ్చు. ఇక్క‌డ మ‌ర్చిపోకూడ‌ని పాయింట్ ఏమంటే.. రూ.500 కోట్ల అప్పు మ‌నం అడ‌గ‌టం లేదు.. ధ‌నిక రాష్ట్రమైన తెలంగాణ ప్ర‌భుత్వం అడుగుతోంది. దాదాపు ల‌క్ష‌న్న‌ర కోట్ల బ‌డ్జెట్ ఉన్న రాష్ట్రం రూ.500 కోట్ల అప్పు కోసం.. అందునా ఈ ఏడాది రెండో విడ‌త చెల్లించాల్సిన రైతుబంధు ప‌థ‌కం అమ‌లు కోసం కావ‌టం మ‌ర్చిపోకూడ‌దు.

ప‌థ‌కం మీద ప‌థకం.. ఆఫ‌ర్ మీద ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన కేసీఆర్ తాను అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించారు. ఇప్పుడు ఉన్న స‌వాల్.. తాను ఇచ్చిన హామీల్ని నెర‌వేర్చ‌టం. ఇది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారుల‌కు మ‌హా క‌ష్టంగా మారింది. ఎన్నిక‌ల వేళ‌లో చాలామంది బ్యాంకు అకౌంట్ల‌లో రైతుబంధు మొత్తాల్ని ప‌డ్డాయి. కానీ.. కొంద‌రికి మాత్రం చేర‌లేదు. దీనికి కార‌ణం.. ప‌థ‌కం అమ‌లుకు అవ‌స‌ర‌మైన నిధులు చేతిలో లేక‌పోవ‌ట‌మే.

తాజాగా ఈ ప‌థ‌కంలో పెండింగ్ ఉన్న రూ.500 కోట్ల కోసం ఒక సంస్థ ద‌గ్గ‌ర అప్పు చేయాల్సిన ప‌రిస్థితి. ఇందు కోసం రాష్ట్రం గురించి గొప్ప‌లు చెప్పి.. అప్పుకు తాము ఎంత అర్హుల‌మ‌న్న విష‌యాన్ని చెప్పి.. అప్పు తెచ్చుకోవ‌టానికి తెలంగాణ అధికారుల బృందం ఒకటి ఢిల్లీకి వెళ్లాల్సి వ‌స్తుందంటే.. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఎంత ఇబ్బందిగాఉందో ఇట్టే చెప్పేయొచ్చు. ఇలాంటి ప‌రిస్థితికి కార‌ణం ఎవ‌రంటారు కేసీఆర్‌?