Begin typing your search above and press return to search.

ఏపీకి కేసీఆర్..ఇద్ద‌రిని క‌ల‌వ‌నున్నారు

By:  Tupaki Desk   |   17 Jun 2019 4:56 AM GMT
ఏపీకి కేసీఆర్..ఇద్ద‌రిని క‌ల‌వ‌నున్నారు
X
జ‌స్ట్.. రెండు వారాలు గ‌డిచాయేమో. ఇంత స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో వేరే రాష్ట్రానికి రెండుసార్లు వెళ్లాల్సి రావ‌టం కేసీఆర్ కు ఇదే తొలిసారి అవుతుందేమో. తెలంగాణ‌ను విడిచి పెట్టి బ‌య‌ట‌కు వెళ్లే సంద‌ర్భాలు తెలంగాణ సీఎంకు కాస్త త‌క్కువ‌నే చెప్పాలి. అయితే ఢిల్లీకి లేదంటే.. ఫామ్ హౌస్ కి ప‌రిమితి కావ‌టం ఆయ‌న‌కు అల‌వాటు.

అందుకు భిన్నంగా ఏపీకి కేవ‌లం రెండు వారాల వ్య‌వ‌ధిలో ఆయ‌న ప‌ర్య‌ట‌న ఖ‌రారు కావ‌టం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల పుణ్య‌క్షేత్రాల్లో ప‌ర్య‌టించే ప్రోగ్రాం పెట్టుకొన్న‌ త‌మిళ‌నాడు టూర్ ఇందుకు మిన‌హాయింపుగా చెప్పాలి. కొద్ది రోజుల్లో తానెంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఫీల్ అవుతున్న కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి ఆహ్వానించేందుకు ఈ రోజు ఏపీకి వెళుతున్నారు కేసీఆర్.

తాజాగా ఆయ‌న ఏపీ టూర్ షెడ్యూల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీని ప్ర‌కారం ఈ మ‌ధ్యాహ్నం (సోమ‌వారం) 12.50 గంట‌ల‌కు ప్ర‌త్యేక విమానంలో గ‌న్న‌వ‌రం చేరుకుంటారు. అక్క‌డ నుంచి విజ‌య‌వాడ‌కు బ‌య‌లుదేర‌నున్న‌కేసీఆర్.. గేట్ వే హోట‌ల్లో రిఫ్రెష్ అవుతారు. మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు తాడేప‌ల్లిలోని సీఎం జ‌గ‌న్ నివాసానికి వెళ్ల‌నున్నారు. అక్క‌డ ఆయ‌న‌తో భేటీ అవుతారు. కాళేశ్వ‌రం ప్రారంభోత్స‌వానికి రావాలంటూ ఆహ్వానం ప‌లుకుతారు.

జ‌గ‌న్ ఇంట్లోనే లంచ్ చేయ‌నున్న కేసీఆర్‌.. త‌ర్వాత మ‌రో ప్రోగ్రాం కూడా పెట్టుకున్నారు. ఇటీవ‌ల కాలంలో త‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన శార‌దాపీఠం గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంద ఆశ్ర‌మానికి వెళ్ల‌నున్నారు. అక్క‌డ నుంచి శార‌దాపీఠం ఉత్త‌రాధికారి దీక్షా స్వీక‌ర‌ణ ఉత్స‌వానికి హాజ‌ర‌వుతారు. రాత్రి 7.30 గంట‌ల‌కు కేసీఆర్ గ‌న్న‌వ‌రం నుంచి తిరిగి హైద‌రాబాద్‌ కు ప‌య‌న‌మవుతారు. 8.30 గంట‌ల‌కు బేగం పేట‌కు చేరుకొని.. తొమ్మిది గంట‌ల‌య్యేస‌రికి ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు వెళ్ల‌నున్నారు. మొత్తానికి కేసీఆర్ తాజా ఏపీ టూర్ కాంబో అనుకోవాలి. ఒక టూరు.. ఇద్ద‌రితో క‌లుసుకొని.. మూడు ప్రోగ్రాంలలో పాల్గొంటార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.