Begin typing your search above and press return to search.

హాస్పిటళ్ల దందాపై కేసీఆర్ గరంగరం

By:  Tupaki Desk   |   2 March 2017 11:45 AM GMT
హాస్పిటళ్ల దందాపై కేసీఆర్ గరంగరం
X
ఇటీవల కాలంలో ఆసుపత్రులు - విద్యాసంస్థలు తమ వ్యాపారం కోసం ఏం చేసినా ప్రభుత్వాలు కానీ ప్రసారమాధ్యమాలు కానీ వాటి జోలికి పోవడం లేదు. కోట్ల రూపాయల ప్రకటనలతో మీడియాను కొడుతుండగా.. అంతకుమించి విరాళాలతో పార్టీలనూ కామ్ చేస్తున్నాయి పలు ఆసుపత్రులు, విద్యాసంస్థలు. కానీ.. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా ప్రజా కోణంలో ఆలోచించి తప్పు చేస్తున్న ఆసుపత్రుల పని పడుతున్నారు. అడ్డగోలుగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్న ఆసుపత్రులను సీజ్ చేయించారు.

ఆసుపత్రుల్లో వైద్యులు అడ్డగోలుగా ఆపరేషన్లు చేసేస్తున్నారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆరోపణలు వచ్చిన ఆసుపత్రులపై విచారణ తరువాత అవి నిజమేనని తేలగా, ఆరు ఆసుపత్రులను సీజ్ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇకపై ఆసుపత్రుల్లో నియంత్రణను మరింత కఠినతరం చేయనున్నామని, తప్పుగా ప్రవర్తించిన వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

అవసరమున్నా, లేకున్నా ఆపరేషన్స్ చేస్తున్నారన్న ఫిర్యాదులు తనకు అందాయని, ఇలా పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళలు ప్రసవానికి ప్రభుత్వ ఆసుపత్రులకే రావాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలను మరింతగా మెరుగు పరుస్తామని కేసీఆర్ తెలిపారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ఇండియాలో సిజేరియన్లు ఎక్కువగా తెలంగాణలోనే జరుగుతున్నాయి. ఇవి కాకుండా గర్భసంచి తొలగించడం వంటి ఇతర ఆపరేషన్లూ అవసరమున్నా లేకున్నా చేస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కొరఢా ఝుళిపించారు.