Begin typing your search above and press return to search.

బాబుతో క‌లిసి ఫ్రంట్‌..ఆయ‌న నా ఫ్రెండే

By:  Tupaki Desk   |   29 April 2018 11:30 PM GMT
బాబుతో క‌లిసి ఫ్రంట్‌..ఆయ‌న నా ఫ్రెండే
X
గులాబీ ద‌ళ‌ప‌తి, తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట‌కారి త‌నానికి ఫిదా కావాల్సిందే. ఎప్ప‌టిక‌ప్పుడు ఏ విష‌యాన్ని అయినా త‌న‌కు అనుకూలంగా చెప్పగ‌ల‌రు. ఒక్కోసారి ప్ర‌త్య‌ర్థులు కూడా ఆలోచ‌నలో ప‌డేలా వ్యాఖ్యానించ‌డం కేసీఆర్ సొంతం. తెలంగాణ ఉద్య‌మం మొద‌లుపెట్టిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్ ఏక‌దాటిగా విమ‌ర్శించిన వ్య‌క్తుల లిస్ట్ తీస్తే...అలా ఉండే కొద్దిమందిలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఒక‌రు. ఎన్నో వేదిక‌ల‌పై టీఆర్ఎస్ అధినేత‌గా, ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ విమ‌ర్శించారు. అయితే అలాంటి చంద్ర‌బాబును తాజాగా కేసీఆర్ త‌న ఫ్రెండ్ అని ప్ర‌క‌టించారు. అంతేకాకుండా ఆయ‌న‌తో క‌లిసి కాంగ్రెస్‌, బీజేపీల‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తాన‌నే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న కూడా చేశారు కేసీఆర్‌.

ఔను!ఈ ఆశ్చ‌ర్యానికి వేదిక‌గా నిలిచింది చెన్నై. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఇవాళ చెన్నై పర్యటనలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా డీఎంకే ప్రెసిడెంట్ కరుణానిధి, వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్.... భారతదేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలన్నారు. కేంద్రం రాష్ర్టాలకు మరిన్ని అధికారాలు ఇవ్వాలన్నారు. స్టాలిన్‌తో చాలా అంశాలపై చర్చించానని తెలిపారు. ఇది ప్రారంభం కాదు.. ముగింపు కాదు.. మరిన్ని చర్చలు జరుపుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో మార్పు ఆవశ్యకతపై మమతా బెనర్జీతో చర్చించామన్నారు. కేంద్రంతో సంబంధం లేని అంశాలను రాష్ర్టాలకు బదలాయించాలన్నారు. ప్ర‌స్తుతం పరిస్థితులు దేశాభివృద్ధికి సహకరించేలా లేవని ఇందుకోసం దక్షిణాది రాష్ర్టాలు కలిసి రావాలని కేసీఆర్ ప్ర‌తిపాదించారు.

దీంతో స‌హ‌జంగానే మీడియా నుంచి మీ పొరుగు రాష్ట్రమైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రితో మీ స‌ఖ్య‌త ఎలా ఉంద‌నే ప్ర‌శ్న వ‌చ్చింది. దీనికి కేసీఆర్ స్పందిస్తూ...`మేం ఎవరితో కలిసి పనిచేస్తాం.. చేస్తున్నాం అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. చంద్రబాబు నాయుడు నాకు మంచి మిత్రుడు. కూటమి ఏర్పాటుపై చంద్రబాబుతోనూ చర్చలు జరుపుతాం` అని కేసీఆర్ ప్ర‌క‌టించారు. తామెప్పుడు ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని చెప్పలేదని, మీడియానే ప్రసారం చేసిందని కూడా కేసీఆర్ త‌న‌దైన శైలిలో ముక్తాయించారు. అమెరికా మాజీ అధ్య‌క్షుడు బిల్‌గేట్స్ పొగిడిన దానికంటే కూడా కేసీఆర్ ప్ర‌శంసే ఎక్కువ కిక్ ఇస్తుంద‌ని ఆయ‌న అభిమానులు వ్యాఖ్యానిస్తుండ‌టం కొస‌మెరుపు.