Begin typing your search above and press return to search.

వారిపై కేసీఆర్ ప్రేమకు కారణం ఇదేనా?

By:  Tupaki Desk   |   5 July 2015 4:08 AM GMT
వారిపై కేసీఆర్ ప్రేమకు కారణం ఇదేనా?
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసినా అదో సంచలనమే. తనదైన శైలిలో ముందుకు వెళ్తూ రాజకీయాల్లో ప్రత్యేకతను సాధించుకున్న వ్యక్తిగా, ఆక్రమంలో ఉద్దండులు అయిన రాజకీయ వేత్తలనైనా డీకొట్టిన చాణక్యుడిగా గుర్తింపు పొందారు. తాజాగా ఆయన మరోమారు తన మార్కు రాజకీయాన్ని ప్రదర్శించారని విశ్లేషకులు భావిస్తున్నారు. తనకు దూరవమవుతున్న వర్గాన్ని ఢీకొట్టేందుకు మరో బలమైన వర్గాన్ని చాలా వేగంగా దగ్గర చేసుకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ముఖ్యమంత్రిగా కేసీఆర్ పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మీ పథకం అనేకమంది పేదల జీవితాల్లో వెలుగులు నింపింది. ఆ తర్వాత ఈ పథకాన్ని ఎస్టీలకు కొనసాగించారు. ఆ తర్వాత దానికి కొన్ని మార్పులు చేస్తూ షాదీ ముభారక్ పేరుతో ముస్లింలకు కొత్త పథకం ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో బీసీలకు సైతం కళ్యాణలక్ష్మీ పథకం వర్తింపచేయాలని ఎందరో డిమాండ్ చేశారు. కానీ కేసీఆర్ స్పందిచలేదు. తాజాగా హరితహారం కార్యక్రమం సందర్బంగా జరిగిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ...బీసీలకు సైతం కళ్యాణలక్ష్మీ పథకం వర్తింపచేస్తానని చెప్పారు. వివాహ ముహుర్తాలు లేని సమయంలో, పైగా అందరూ డిమాండ్ చేసి ఊరుకున్న నేపథ్యంలో కేసీఆర్ ఈ ప్రకటన ఎందుకు చేశారనే చర్చ సాగుతోంది.

మరోవైపు బీసీల్లో బలమైన సామాజికవర్గమైన మున్నూరుకాపు కులానికి చెందిన పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ పార్టీలోకి రావడానికి కేసీఆర్ లైన్ క్లియర్ చేశారు. ఈ విషయంలో ముందస్తుగా రాజకీయవర్గాల్లో ఎలాంటి కదలికలు తెలియకపోవడం గమనార్హం. అయితే కేసీఆర్ సరైన ఎత్తువల్లే ఇది సాధ్యమైందని తెలుస్తోంది. పదవి దక్కలేదని, పార్టీ గుర్తింపు ఇవ్వట్లేదనే భావనలో డీఎస్ ఉన్న విషయాన్ని కేసీఆర్ గమనించి ఈ మేరకు ఆయన్ను పార్టీలోకి వచ్చేలా చేశారని సమాచారం.

మొత్తంగా డీఎస్ రాక వెనుక, బీసీలకు కళ్యాణలక్ష్మీ వర్తింపచేస్తానని ప్రకటించడం వెనక...ఇటీవలి పరిణామాలు కారణమని భావిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టు ద్వారా తెలంగాణలోని రెడ్డి సామాజికవర్గం టీఆర్ఎస్ పై ఒకింత నిరుత్సాహం వ్యక్తం చేసింది. దీంతో వారు దూరమయినా తనకు మరింత పెద్ద అండ ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణలో ప్రధాన సామాజికవర్గమైన బీసీలను దగ్గర చేసుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రకంగా వ్యవహరించినట్లున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.