Begin typing your search above and press return to search.

రామోజీ ఫిలిం సిటీకి దగ్గర్లో రిజర్వాయర్

By:  Tupaki Desk   |   10 Nov 2015 4:32 AM GMT
రామోజీ ఫిలిం సిటీకి దగ్గర్లో రిజర్వాయర్
X
కొద్దికాలంగా బహిరంగ సభల్లో పెద్దగా పాల్గొనని తెలంగాణ ముఖ్యమంత్రి సోమవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. చెత్త తరలించే ఆటో ట్రాలీలకు జెండా ఊపి ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా హైదరాబాద్.. పరిసర ప్రాంతాలకు సంబంధించి వరాల్ని ఫెద్ద ఎత్తున ప్రకటించారు. మరికొద్ది రోజుల్లో గ్రేటర్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేసీఆర్ చేసిన ప్రకటన చూస్తే.. ఎన్నికలపై ఆయన నజర్ పడినట్లు స్పష్టంగా తెలుస్తుందని చెప్పక తప్పదు. తాజాగా ఆయన ప్రస్తావించిన పలు అంశాలే దీనికి నిదర్శనం.

నగర దాహార్తి తీర్చేందుకు భారీ ప్రతిపాదనను చేశారు. అప్పుడెప్పుడో నిజాం కాలం నాటి గండిపేట.. ఉస్మాన్ సాగర్.. హిమాయత్ నగర్ తప్పిస్తే.. ప్రజల తాగునీటి అవసరాల కోసం ప్రత్యేక జలాశయాలు లేకపోవటంపై ఆవేదన వ్యక్తం చేసిన కేసీఆర్ సరికొత్త ప్రతిపాదన ఒకటి తెరపైకి తీసుకొచ్చారు. నాగార్జునసాగర్.. ఎల్లంపల్లి నుంచి వందల కిలోమీటర్లు నీళ్లు తెచ్చుకునే దాని కన్నా.. 15 టీఎంసీల చొప్పున నగరానికి రెండు దిక్కులా రెండు రిజర్వాయర్లు నిర్మించాలన్న ఆలోచన చేశారు.

ఇందులో భాగంగా ఒక రామోజీ ఫిలింసిటీ కి దగ్గర్లో ఏర్పాటు చేయాలని.. మరొకటి శామీర్ పేట వద్ద నిర్మించాలన్న ఆలోచనను వెల్లడించారు. తాజా ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే.. నగరానికి ఈ రెండు రిజర్వాయర్ల ద్వారా 30 టీఎంసీల నీరు లభించే వీలు ఉంటుంది. నిజానిక ఇలాంటివి మరెన్నో ప్రతిపాదనల్ని కేసీఆర్ తన ప్రసంగంలో చేశారు. నగరంలో రోడ్ల మీద కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అద్దంలా మెరిసేలా రోడ్లను తయారు చేయాల్సిన అవసరం ఉందన్న ఆయన.. ఇందుకోసం ప్రణాళికను వెల్లడించారు.

అడ్డదిడ్డంగా రోడ్లను తయారు చేసేందుకు వీలుగా రూ.337 కోట్లతో పనులు చేపడతామని.. అవి పూర్తి అయిన నెలరోజుల్లో నగరంలోని రోడ్లను అద్దంలా మెరిసేలా తయారు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఎల్ ఈడీ దీపాల ఏర్పాటుకు ముమ్మరఏర్పాట్లు చేశారు. వర్షం కురిసినప్పుడు రోడ్ల మీద నీళ్లు నిలబడకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.

చెత్త తరలింపులో ప్రస్తుతం ఉన్న పద్ధతిని పూర్తిగా మార్చి వేసి.. నగర పారిశుద్ధ్య నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తెస్తామని.. అందులో భాగంగా తొలి అడుగు పడిందని చెప్పుకొచ్చారు. నగరం అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందాలంటే సరిపడా ఫ్లైఓవర్లు రావాలని.. అందుకోసం భారీ ఫ్లై ఓవర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎలుక తోకల్లాంటి ఫ్లై ఓవర్లతో అంతర్జాతీయ స్థాయి రాదని.. తాను చైనా వెళ్లినప్పుడు అక్కడి ఫ్లై ఓవర్లు చూశానని.. అలాంటివి నగరంలో ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తామన్నారు.