Begin typing your search above and press return to search.

తెలంగాణ తాయిలాలు

By:  Tupaki Desk   |   25 Aug 2018 1:30 AM GMT
తెలంగాణ తాయిలాలు
X
తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు అన్ని సిద్ధం అయ్యాయి. ఇక ప్రకటన మాత్రమే తరువాయి. తెలంగాణ ముఖ్యమంత్రి - తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వచ్చే నెల మొదటి వారంలో తెలంగాణలో శాసనసభను రద్దు చేస్తూ ప్రకటన చేయడం ఒక్కటే మిగిలింది. ఇది కూడా అతి త్వరలో చేసేలాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈలోగా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు తాయిలాలు ప్రకటించే పనిలో పడ్డారు. శుక్రవారం నాడు ముఖ్యమంత్రి తెలంగాణలోని సబ్బండ వర్గాలను ప్రసన్నం చేసుకుందుకు వరాలు మూట విప్పారు. తెలంగాణలోని అన్ని కులాల వారికి హైదరబాద్‌ లో ఆత్మ గౌరవ భనవాలు నిర్మించుకుందుకు స్ధలాలు - భవనాలు నిర్మించుకుందుకు నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. ఇది రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచి వేసుకున్న రాజకీయ నిచ్చెనే. ఈ కులాల ఆత్మగౌరవ భవనాలకు హైదరాబాద్ శివారులోని కోకాపేట - ఘట్ కేసర్ - మేడిపల్లి - మేడ్చల్ - అబ్దుల్లాపూర్ మెట్ - ఇంజాపూర్ ప్రాంతాల్లో స్ధలాలను గుర్తించారు. వీటిలో ఏ కులానికి ఏ ప్రాంతంలో భవన నిర్మాణాలు చేపట్టాలో ముందుగానే నిర్ణయించాలని, ఇదంతా నెల రోజుల లోపు జరిగిపోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

ఎస్సీ - ఎస్టీలకు చెందిన విద్యుత్ వినియోగదారులు కరెంట్ బిల్లు పరిధిని కూడా మరింత పెంచారు. వారి విద్యుత్ వినియోగం పరిధి నెలకు 101 యూనిట్లకు పెంచారు. ఈ యూనిట్ల లోపు విద్యుత్ వినియోగం చేసుకున్న వారు బిల్లు చెల్లించే పని లేదు. ఇంతవరకూ వ్యవసాయానికి మాత్రమే విద్యుత్‌ పై రాజకీయ పార్టీలు ద్రష్టి పెడితే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మాత్రం గ్రహ అవసరాలకు కూడా విద్యుత్ రాయితీలు ఇచ్చి తనదైన శైలీలో వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు ఇమామ్‌ లు - మౌజమ్‌ లకు కూడా ఇక గౌరవ వేతనాన్ని 5 వేల రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయా వర్గాలకు చెందిన వారంతా తెలంగాణ రాష్ట్ర సమితికి రుణ పడి ఉన్నట్లుగానే భావిస్తారు. అలాగే తెలంగాణలోని వివిధ జిల్లాల్లో దేవాలయాల్లో పని చేస్తున్న పూజారులు - అర్చకులకు వారి వేతనాలను ఇక నుంచి ట్రెజరీల నుంచే ఇస్తామని ప్రకటించారు. అంటే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినట్లే అయ్యింది. ఇక అర్చకుల ఉద్యోగ విరమణ వయసును కూడా 58 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచుతున్నట్లు కూడా ప్రకటించారు. గురుకుల సిబ్బంది - మెప్మా రిసోర్స్ పర్సన్‌ ల వేతనాలు కూడా భారీగానే పెంచుతున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి - తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన పావులు కదుపుతున్నారు.