Begin typing your search above and press return to search.

ఐదు గులాబీ గుర్రాల్ని ప్ర‌క‌టించిన కేసీఆర్!

By:  Tupaki Desk   |   17 March 2019 5:37 AM GMT
ఐదు గులాబీ గుర్రాల్ని ప్ర‌క‌టించిన కేసీఆర్!
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎన్నిక‌ల వ్యూహం చాలా ప‌క్కాగా ఉంటుంది. ఎన్నిక‌ల‌కు ముందు నుంచి ఆచితూచి అడుగులు వేయ‌ట‌మే కాదు.. ఎన్నిక‌లకు సంబంధించి కేసీఆర్ వ్యూహం స్ప‌ష్టంగా ఉంటుంది. ఎలాంటి ఒత్తిళ్ల‌కు త‌లొగ్గ‌టం అన్న‌ది కేసీఆర్‌లో క‌నిపించ‌దు. చివ‌ర‌కు కుటుంబ స‌భ్యుల్ని సైతం అభ్య‌ర్థుల ఎంపిక‌లో త‌ల‌దూర్చొద్ద‌న్నట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు. అందుకే.. అభ్య‌ర్థుల ఎంపిక విష‌యాన్ని ఆయ‌న త‌న వ్య‌క్తిగ‌త స్థాయిలో చేస్తుంటార‌ని చెబుతారు.

త‌న‌కు అత్యంత స‌న్నిహితులుగా ఉన్న ఒక‌రిద్ద‌రిని అప్ప‌టిక‌ప్పుడు పిలిపించి.. తాను డిసైడ్ చేసిన అభ్య‌ర్థుల పేర్ల‌ను లిస్ట్ రూపంలో తయారు చేయించ‌ట‌మే కాదు.. ఆ విష‌యాన్ని తాను అధికారికంగా ప్ర‌క‌టించే వ‌ర‌కూ స‌ద‌రు స‌న్నిహితుడ్ని బ‌య‌ట‌కు వెళ్ల‌నీయ‌ర‌ని చెబుతారు. ఈ సంద‌ర్భంగా స‌ద‌రు స‌న్నిహితుడి ద‌గ్గరి సెల్ ఫోన్ సైతం ఉంచ‌ర‌న్న మాట‌ను చెబుతుంటారు.

కొద్ది నెల‌ల క్రితం ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించేందుకు జ‌రిగిన క‌స‌ర‌త్తును ఈ సంద‌ర్భంగా ప‌లువురు గుర్తుచేస్తుంటారు. సొంత కొడుక్కి కూడా తెలీకుండా అభ్య‌ర్థుల క‌స‌ర‌త్తును పూర్తి చేయ‌టం కేసీఆర్ కు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంద‌ని చెబుతారు. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌లైన ఏడు రోజుల త‌ర్వాత త‌మ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసే ఐదుగురు ఎంపీ అభ్య‌ర్తుల్ని ప్ర‌క‌టించారు కేసీఆర్‌.

ఈ ఐదు స్థానాల్లో క‌రీంన‌గ‌ర్ ఎంపీ అభ్య‌ర్థిగా బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్.. నిజామాబాద్ ఎంపీగా క‌ల్వ‌కుంట్ల క‌విత‌.. అదిలాబాద్‌.. భువ‌న‌గిరి.. మెద‌క్ సిట్టింగ్ ఎంపీలు న‌గేశ్‌.. బూర న‌ర్స‌య్య గౌడ్‌.. కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డిల పేర్ల‌ను ఆయ‌న ఖ‌రారు చేశారు. అభ్య‌ర్థులుగా ఎంపిక చేసిన నేత‌ల‌కు తానే స్వ‌యంగా ఫోన్ చేసిన కేసీఆర్‌.. ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని షురూ చేసుకోవాల‌ని చెప్పారు. ఒక‌ట్రెండు రోజుల్లో అధికారికంగా తాను ప్ర‌క‌ట‌న జారీ చేస్తాన‌ని.. ఈ లోపు ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని షురూ చేయాల‌ని ఆయ‌న చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. అభ్య‌ర్థుల ఎంపిక‌లో ఎప్పుడూ త‌న మార్క్ చూపించే కేసీఆర్‌.. తాజాగా ఫైన‌లైజ్ లోనూ అదే తీరును పాటించిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.