Begin typing your search above and press return to search.

ఇలాంటి పెళ్లి చేసుకుంటే...కేసీఆర్ 3 ల‌క్ష‌లిస్తారు

By:  Tupaki Desk   |   18 Oct 2017 5:04 AM GMT
ఇలాంటి పెళ్లి చేసుకుంటే...కేసీఆర్ 3 ల‌క్ష‌లిస్తారు
X
ఇటీవ‌లి కాలంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సార‌థ్యంలోని స‌ర్కారు మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌క‌ట‌న చేసింది. వేదపండితులు - అర్చకులు - పురోహితులను పెళ్లి చేసుకొనే అమ్మాయిలకు మూడు లక్షల రూపాయల పారితోషికాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విష‌యాన్ని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ప్రకటించింది. సచివాలయంలో పరిషత్‌ అధ్యక్షులు డాక్టర్‌ కెవి రమణాచారి అధ్యక్షతన కార్యనిర్వాహక సమావేశం జరిగింది. సభ్యులు డాక్టర్‌ ఎస్‌ వేణుగోపాలాచారి - సిహెచ్‌ అనిల్‌ కుమార్‌ - పరిశ్రమలశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ ఆర్‌బి దేవానంద్‌ - కె కిషన్‌ రావు - కన్వీనర్‌ ఎ చంద్రమోహన్‌ - పురాణం సతీష్‌ - సువర్ణా సులోచన తదితరులు పాల్గొన్నారు. అనంత‌రం వారీ విష‌యాన్ని వెల్ల‌డించారు.

పురోహితం చేస్తున్న బ్రాహ్మణ యువకులకు సకాలంలో వివాహాలు కావట్లేదని, మారుతున్న సమాజ స్థితి గతుల్లో వారిని వివాహం చేసుకొనేందుకు యువతులు ముందుకు రావట్లేదని బ్రాహ్మ‌ణ‌ పరిషత్‌ అధ్యక్షులు డాక్టర్ కేవీ రమణాచారి చెప్పారు. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబాల్లో ఇదో పెద్ద సమస్యగా ఉంద‌ని అభిప్రాయపడ్డారు. దీనిపై కార్యవర్గ సమావేశంలో సుదీర్ఘ చర్చ అనంతరం వేదపండితులు - అర్చకులు - పురోహితుల్ని వివాహం చేసుకొనే యువతులకు రూ.3 లక్షలు పారితోషికంగా ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. వివాహానంతరం మూడేళ్ల‌ కాల పరిమితితో ఈ మొత్తాన్ని నూతన దంపతుల పేర ఫిక్సెడ్‌ డిపాజిట్‌ చేస్తామని వివరించారు. ఆ తర్వాతే ఆ సొమ్మును దంపతులు తీసుకొనేలా విధాన నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు బ్రాహ్మణ పరిషత్‌ కు రూ.వంద కోట్లు కేటాయించారని - ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు లోపు సంక్షేమ పథకాల్ని మరింత విస్త్రుతం చేస్తామన్నారు. వేదపాఠశాలల్లో వేద విద్యను అభ్యసించి, బయటకు వచ్చే విద్యార్థులకు రూ.3 లక్షలకు తక్కువ కాకుండా పారితోషికాన్ని ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, దీనిపై చర్చలు జరుగుతున్నాయని వివరించారు.

బ్రాహ్మణ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ - స్వయం ఉపాధి పొందే వారికి బ్రాహ్మణ పారిశ్రామిక అభివృద్ధి పథకం (బెస్ట్‌) సమర్ధవంతంగా అమలవుతోందని ర‌మ‌ణాచారి తెలిపారు. 56 మంది దరఖాస్తుదారులకు ఈ పథకం క్రింద రూ.3.29 కోట్లను ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని ఇచ్చేలా సమావేశంలో నిర్ణయించినట్టు తెలిపారు. సరస్వతి విద్యా ప్రశస్తి పథకం క్రింద పదవ తరగతి - ఇంటర్‌ - డిగ్రీ - పీజీ చదివే 252 మంది విద్యార్ధులకు ఆర్థిక సహాయాన్ని ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఉన్నత విద్యకై విదేశాలకు వెళ్ళే 56 మంది బ్రాహ్మణ విద్యార్ధులకు వివేకానంద ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ స్కీం ద్వారా రూ.1.16 కోట్లను మంజూరు చేశామన్నారు. పీజు రీయింబర్స్‌ మెంట్‌ స్కీం - పెన్షన్‌ స్కీం - హెల్త్‌ స్కీంల ద్వారా పేద బ్రాహ్మణులకు ఆర్ధిక తోడ్పాటును అందిస్తున్నామని వివరించారు. పేద బ్రాహ్మణులు ప్రభుత్వ పథకాల్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.