Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఫోక‌స్ మారిపోతోంది

By:  Tupaki Desk   |   29 Oct 2016 6:51 AM GMT
కేసీఆర్ ఫోక‌స్ మారిపోతోంది
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న కార్యాచ‌ర‌ణ తీరును మార్చుకున్నారు? టీఆర్‌ ఎస్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడిచిపోయిన నేప‌థ్యంలో ప‌రిపాల‌న కంటే త‌న వెంట న‌డిచిన వారికి ప్రాధాన్యం ఇచ్చేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఐదేళ్ల అధికారంలో సగం కాలం ముగిసినందున కొత్త ఇంటిని సర్దుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఇంటిని చక్కదిద్దుకోవడానికి ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇచ్చారని, ఇప్పుడు పార్టీపై దృష్టిసారించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

తెలంగాణ ఆవిర్భవించిన తరువాత తెలంగాణ భవన్‌ కు తొలిసారిగా వచ్చిన సమయంలోనే కేసీఆర్ పార్టీ శ్రేణులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు ప్రకటించారు. రెండేళ్ల క్రితం అప్పటి పార్టీ ప్లీనరీ కన్నా ముందే శిక్షణ కార్యక్రమాల ప్రారంభం అవుతాయని ప్రకటించారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. పాలనపై దృష్టిసారించడం ముఖ్యంగా భావించిన కేసీఆర్ పార్టీ కార్యక్రమాలను పూర్తిగా పక్కన పెట్టారు. పాలనను గాడిలో పెట్టడం - మిషన్ భగీరథ - మిషన్ కాకతీయ - ప్రాజెక్టులు - సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రధానంగా దృష్టిసారించారు. ఈ పథకాలు సమర్థవంతంగా అమలు జరిగితే పార్టీకి ప్రయోజనం కలుగుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ప్రధానంగా వీటిపైనే దృష్టిసారించినట్టు పార్టీ నాయకులు తెలిపారు. ఉప ఎన్నికల్లో టీఆర్‌ ఎస్ అభ్యర్థుల ఘన విజయానికి ఆసరా పథకం ఉపయోగపడిందని - అదే విధంగా టీఆర్‌ ఎస్ పథకాల అమలే 2019 ఎన్నికల్లో పార్టీ విజయానికి దోహదం చేస్తాయని నాయకులు చెబుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే వ్యూహాత్మకంగానే పార్టీ కార్యక్రమాలను చాలా తక్కువగా నిర్వహించారని చెబుతున్నారు.

ఉద్యమ కాలంలో సైతం తెలంగాణ భవన్‌ లో శిక్షణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు పార్టీ శ్రేణులకు ఒక్కసారి కూడా శిక్షణ నిర్వహించలేదు. పార్టీ నుంచి ఎన్నికైన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లకు హైదరాబాద్‌ ను తీర్చిదిద్దడం కోసం శిక్షణ నిర్వహించారు. చివరి సంవత్సరం ఎన్నికల హడావుడి ఉంటుందని, వాస్తవానికి ఇక మిగిలింది ఏడాదిన్నరే కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకుని క్రమంగా పార్టీ కార్యక్రమాలను దృష్టిసారించినట్టు పార్టీ నాయకులు తెలిపారు. పథకాల అమలు - జిల్లాల విభజన వీటన్నిటిలోనూ విజన్ 2019 కూడా అంతర్లీనంగా ఉంటుందని పార్టీ నాయకులు తెలిపారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే జిల్లాల కమిటీలను వేయడానికి కసరత్తు సాగిస్తున్నారు. జిల్లాల కమిటీలు - నామినేటెడ్ పదవుల పంపకంపై కేసీఆర్ కొంత మంది మంత్రులు - ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. మంత్రులు హరీశ్‌ రావు - కేటీఆర్ - ఎంపీ కవిత విడిగా కేసీఆర్‌ తో సమావేశం అయి నామినెటెడ్ పదవులు - పార్టీ పదవులపై తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. దీపావళి సందర్భంగా జిల్లాల కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా నామినేటెడ్ పదవుల పంపకం కొనసాగించనున్నారు. జిల్లాల వారీగా నామినేటెడ్ పదవుల కోసం అభ్యర్థుల పేర్లను కేసీఆర్ సన్నిహితులతో కలిసి చర్చిస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా జిల్లా కమిటీలతో పాటు, నామినేటెడ్ పదవుల పంపకం జరగనుందని స‌మాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/