Begin typing your search above and press return to search.

అమరావతి శంకుస్థాపనను కేసీఆర్ కాపీ?

By:  Tupaki Desk   |   7 Aug 2016 5:18 AM GMT
అమరావతి శంకుస్థాపనను కేసీఆర్ కాపీ?
X
రెండేళ్ల విరామం తర్వాత తొలిసారి తెలంగాణకు రానున్న ప్రధాని మోడీ పర్యటన కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన భారీ ఏర్పాట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రధాని మోడీకి ఒక తీపిగురుతుగా నిలిచిపోయేలా ఆయన భారీ ఏర్పాట్లు చేశారు. మిత్రుడిగా తానెంత మంచి స్నేహితుడినన్న విషయాన్ని మోడీకి చాటిచెప్పేలా ఆయన ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. కేంద్రంలో భాగస్వామి కావాలన్న ఆలోచన కేసీఆర్ లో ఉందన్న మాట ఎప్పటి నుంచో వినిపిస్తున్నదే. ఈ విషయంలో బీజేపీ అధినాయకత్వానికి కూడా పెద్దగా అభ్యంతరాలు లేవన్న మాట వినిపిస్తుంటుంది. అయితే.. తన డిమాండ్ల సాధన కోసం వెనుకా ముందు చూడకుండా దూకుడుగా వ్యవహరించే కేసీఆర్ తో దోస్తీ అంటే అంత చిన్న విషయం కాదు. అందుకే.. కేంద్రంలో భాగస్వామ్యం అయ్యే విషయంలో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. అదే సమయంలో టీఆర్ ఎస్ అధినాయకత్వం కూడా కేంద్రంలో భాగస్వామి అయ్యే విషయంలో భారీ ఆలోచనలో ఉంది. తెలంగాణకు పెద్ద ఎత్తున లబ్థి చేకూరితే తప్ప అడుగు ముందుకు వేయని పరిస్థితి.

ఈ లెక్కల మాట ఎలా ఉన్నా.. ఎట్టకేలకు తెలంగాణకు మోడీ మరికొద్ది గంటల్లో రానున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు గ్రాండ్ గా ఏర్పాట్లు చేసిన కేసీఆర్.. ఆయన ప్రసంగించే సభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. రెండు లక్షల జనసమీకరణకు తగ్గకుండా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం భారీ వేదికను సిద్ధం చేశారు. అయితే.. ఈ వేదిక ఏర్పాటుకు స్ఫూర్తిగా అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. జరిగిన ఏర్పాట్లు చూస్తే ఇదే విషయం స్పష్టమవుతుందని చెప్పొచ్చు.

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోడీ.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా ముఖ్యనేతలంతా ఒక వేదిక మీద ఉంటే.. ఆ వేదికకు రెండు వైపులా రెండు వేదికల్ని ఏర్పాటు చేయటం.. ఒకదాన్లో రాజకీయ నేతలు.. మరో వేదిక మీద ప్రముఖుల్ని కూర్చోబెట్టిన వైనం తెలిసిందే.

తాజాగా మోడీ హాజరుకానున్న వేదికను కూడా ఇంచుమించే ఇదే రీతిలో ఏర్పాటు చేయటం గమనార్హం. భారీ బహిరంగ సభను సిద్ధంగా చేసిన కేసీఆర్.. ఏర్పాట్లు ఎంత ఘనంగా చేశారంటే.. ఈ సభకు 2 లక్షల మంది హాజరుకానుండగా.. వర్షంలాంటివి ఏవైనా వచ్చినా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వుగా 1.5లక్షల మందికి సరిపోయే రెయిన్ ఫ్రూప్ టెంట్లను.. మరో 50 వేలమందికి సరిపోయే సాధారణ టెంట్లు వేయించటం గమనార్హం. ప్రధాని సభకు జనాల్నితరలించేందుకు 4500 బస్సుల్ని సిద్ధం చేశారు.

ప్రధాని మోడీ ప్రసంగించే వేదిక మీద కేవలం 20 మంది ప్రముఖులకు మాత్రమే చోటు దక్కనుంది. ఇక.. ఈ వేదికకు కుడివైపున మరో వేదికను ఏర్పాటు చేశారు. దీనిపై ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. జెడ్పీ ఛైర్మన్లు ఉంటారు. ఇక.. ఎడమ వైపున కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు.. వివిధ శాఖల అధిపతులు కూర్చుంటారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమ డిజైన్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాపీ కొట్టినట్లుగా అనిపించట్లేదు..?