Begin typing your search above and press return to search.

కేసీఆర్ అడిగిన పుస్త‌కాన్ని ఇవ్వ‌లేక‌పోయారు

By:  Tupaki Desk   |   18 Jun 2019 5:46 AM GMT
కేసీఆర్ అడిగిన పుస్త‌కాన్ని ఇవ్వ‌లేక‌పోయారు
X
ఒక పుణ్య‌క్షేత్రానికి ఎవ‌రైనా ప్ర‌ముఖులు అతిధులుగా వ‌స్తుంటే.. వారికి ఆ క్షేత్రం ప్రాశ‌స్త్రాన్ని తెలిపేలా పుస్త‌కాన్ని ఇవ్వ‌టం మామూలే. ఈ విష‌యం కూడా బెజ‌వాడ క‌న‌క‌దుర్గ ఆల‌య‌న అధికారులకు తెలీదా? అన్న సందేహం క‌లిగేలా వ్య‌వ‌హ‌రించి ఆశ్చ‌ర్యాన్ని మిగిల్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్.. బెజ‌వాడ దుర్గమ్మ క్షేత్రానికి రావ‌టం తెలిసిందే.

కేసీఆర్ కు ఆల‌య మ‌ర్యాద‌ల‌తో స్వాగ‌తం ప‌లికిన పండితులు ప్ర‌త్యేక‌పూజ‌లు నిర్వ‌హించారు. అంత‌వ‌ర‌కూ ఓకే. అమ్మ‌వారిని ద‌ర్శ‌నం చేసుకున్న త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చిన కేసీఆర్‌.. త‌న‌ను క‌లిసి ఆల‌య అధికారుల‌తో క్షేత్రం స్థ‌ల పురాణంకు సంబంధించిన పుస్త‌కం ఉందా? అని అడిగారు.అయితే.. ఆ పుస్త‌కం అందుబాటులో లేద‌ని చెప్పారు. ఒక ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రానికి సంబంధించిన పుస్త‌కం అందుబాటులో లేదంటే.. దేవాల‌య అధికారుల ప‌ని తీరు ఏ తీరులో ఉందో చెప్పే ప‌రిస్థితి.

పుస్త‌కాలు బాగా చ‌దువుతార‌న్న పేరున్న కేసీఆర్ లాంటి ప్ర‌ముఖులు ఆల‌యానికి వ‌స్తున్న‌ప్పుడు.. పుస్త‌కాల్ని సిద్ధం చేయ‌టం లాంటివి సాధార‌ణంగా చేయాల్సిన ప‌నులు. వాటి విష‌యంలోనూ అధికారులు దృష్టి సారించ‌టం లేదంటే ఏమ‌నాలి? ఇదిలా ఉంటే.. అమ్మ‌వారి ద‌ర్శ‌నం త‌ర్వాత శివాల‌యంలో మ‌ల్లేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకోవాల‌ని కేసీఆర్ భావించారు.

అయితే.. ఆ గుడికి వెళ్లే మార్గంలో భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేయ‌క‌పోవ‌టంతో మ‌హా మండ‌పం ఏడో అంత‌స్తు నుంచి మ‌ల్లేశ్వ‌ర‌స్వామికి దండ పెట్టేశారు కేసీఆర్‌. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి బెజ‌వాడ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా వాతావ‌ర‌ణం ప్ర‌శాతంగా మార‌టం ప‌లువురు ఆస‌క్తిక‌రంగా మాట్లాడుకోవ‌టం క‌నిపించింది. సోమ‌వారానికి మూడు.. నాలుగు రోజుల ముందు నుంచి ఎండ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండి తీవ్ర ఇబ్బందికి గురి అయిన ప‌రిస్థితి. అలాంటిది కేసీఆర్ వ‌చ్చిన సోమ‌వారం మాత్రం ఎండ తీవ్ర‌త త‌క్కువ‌గా ఉండ‌ట‌మే కాదు.. చిరు జ‌ల్లులు ప‌డ‌టాన్ని ప‌లువురు త‌మ మాట‌ల్లో ప్ర‌స్తావించ‌టం క‌నిపించింది.