Begin typing your search above and press return to search.

డీఎస్‌.. ఎలాంటోళ్లు ఎలా అయిపోయారో

By:  Tupaki Desk   |   13 Sep 2017 4:55 AM GMT
డీఎస్‌.. ఎలాంటోళ్లు ఎలా అయిపోయారో
X
సింహం మాదిరి బ‌తికిన వ్య‌క్తి ఇప్పుడు అందుకు భిన్నంగా ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టం డీఎస్ అభిమానుల్ని.. ఆయ‌న్ను ఆరాధించే వారిని తెగ ఇబ్బందిపెడుతోంది. విభ‌జ‌న‌కు ముందు.. కాంగ్రెస్ పార్టీలో ఒక చ‌క్రం తిప్పిన డీఎస్‌ కు ఫాలోయ‌ర్లు భారీగానే ఉండేవారు. మిగిలిన వారి విష‌యాల్ని ప‌క్క‌న పెడితే.. తెలుగోళ్ల వ‌ర‌కూ కాంగ్రెస్‌ కు సంబంధించిన కీల‌క నేత‌ల్లో డీఎస్ ఒక‌రిగా ఉండేవారు.

ఎవ‌రైనా.. ఏదైనా చేసినా.. పార్టీకి న‌ష్టం వాటిల్లేలా చేశార‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తిన‌ప్పుడు.. వారిని త‌న ద‌గ్గ‌ర‌కు పిలిపించుకోవ‌టం.. ఏం జ‌రిగింద‌న్న వివ‌ర‌ణ అడిగి తెలుసుకోవ‌టం డీఎస్‌కు అల‌వాటే. కానీ.. కాలంతో పాటు వ‌చ్చిన మార్పుల పుణ్య‌మా అని డీఎస్ ప‌రిస్థితి ఇప్పుడు ఇబ్బందిక‌రంగా మారింద‌ని చెబుతున్నారు.

కాంగ్రెస్ పార్టీలో ఉన్న‌ప్పుడు రాజా మాదిరి బ‌తికేసిన డీఎస్‌..ఇప్పుడు ప్ర‌తి చిన్న విష‌యానికి టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ కు వివ‌ర‌ణ ఇవ్వాల్సి వ‌స్తోంద‌ని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ మ‌ధ్య‌న టీఆర్ ఎస్ లోకి చేరిన ఆయ‌న‌కు.. కేసీఆర్ చెప్పిన‌ట్లే ప‌ద‌వి ఇచ్చారు. డీఎస్ స్థాయికి త‌గ్గ‌ట్లు గౌర‌వ మ‌ర్యాద‌ల‌కు లోటు లేకుండా చేస్తాన‌న్న మాట‌ ఇచ్చార‌ని చెబుతారు. అయితే.. కేసీఆర్ మాట‌ల్లో క‌నిపించే క‌మిట్ మెంట్ చేత‌ల్లోకి వ‌చ్చేస‌రికి ఎంత త‌గ్గుతుంద‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. డీఎస్ అందుకు మిన‌హాయింపు కాదు.

తాజాగా డీఎస్ కుమారుడు అర‌వింద్ బీజేపీలోకి వెళ‌తార‌న్న వాద‌న కొన్నిరోజులుగా వినిపిస్తున్న‌దే. తాజాగా అర‌వింద్ బీజేపీలోకి వెళ్లే ముహుర్తం కూడా దాదాపుగా ఫిక్స్ అయ్యింద‌న్న మాట వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ఒక క‌బురు వ‌చ్చింద‌ని.. సార్ ను క‌ల‌వాల‌న్న స‌మాచారాన్ని డీఎస్‌ కు అందించిన‌ట్లుగా స‌మాచారం.

త‌న కుమారుడు బీజేపీలో చేర‌టానికి కార‌ణం ఏమిట‌న్న విష‌యాన్ని కేసీఆర్ ప్ర‌శ్నిస్తే డీఎస్ స‌మాధానం ఇవ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఒక‌ప్పుడు ఎవ‌రైనా నేత‌ల మీద ఆరోప‌ణ‌లు.. విమ‌ర్శ‌లు వ‌స్తే పిలిపించుకొని మ‌రీ మాట్లాడే స్థాయి నుంచి త‌న కొడుకు తీరుకు కేసీఆర్‌ కు వివ‌ర‌ణ ఇవ్వాల్సిన ప‌రిస్థితుల్లోకి డీఎస్ వెళ్లార‌న్న అభిప్రాయం ఇప్పుడు వ్య‌క్త‌మ‌వుతోంది. డీఎస్ ను అభిమానించే వారు ప్ర‌స్తుతం ఆయ‌నున్న ప‌రిస్థితిపై అయ్యో అనే ప‌రిస్థితి. అలా అని కొడుకును నియంత్రించే ప‌రిస్థితుల్లో డీఎస్ ఉండ‌టం క‌నిపిస్తుంది. తాజా ప‌రిణామాలు చూస్తున్న ప‌లువురు.. ఎలాంటి డీఎస్ ఎలా త‌యార‌య్యారో.. అన్న మాట‌ను ప‌దే ప‌దే అనుకోవ‌టం గ‌మ‌నార్హం.