Begin typing your search above and press return to search.

సచివాలయానికి వెళ్లని సీఎం కేసీఆరే బాస్..

By:  Tupaki Desk   |   3 Oct 2016 10:03 AM GMT
సచివాలయానికి వెళ్లని సీఎం కేసీఆరే బాస్..
X
నమ్మకానికి మించింది లేదు. అదేమీ తప్పు కాదు. కానీ.. నమ్మకాలకు అవసరానికి మించి నమ్మకంతోనే అసలు ఇబ్బంది అంతా. అధినాయకుడే నమ్మకాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఇంతకీ ఆ అధినాయకుడు ఎవరంటారా? ఇంకెవరు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే. రకరకాల నమ్మకాల్ని విపరీతంగా నమ్మేసే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు వాస్తు మీద ఎంత గురి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. అటు సచివాలయానికి.. ఇటు సీఎం క్యాంప్ ఆఫీసుకు మార్పులు చేయించినప్పటికీ ఏ మాత్రం సంతృప్తి చెందని ఆయనిప్పుడు రూ.40 కోట్లతో కొత్త క్యాంప్ కార్యాలయాన్ని నిర్మిస్తుండటం తెలిసిందే. బేగంపేటలో సిద్ధమవుతున్న ఈ భారీ భవనం దసరా నాటికి పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు.

వీలైనంతవరకూ దసరా నుంచి ఈ క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించాలని భావిస్తున్న కేసీఆర్.. ఇది కానీ పూర్తి అయితే.. సచివాలయం ముఖమే చూడరని చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వేళ్ల మీద లెక్క పెట్టే రోజుల్లో మాత్రమే సచివాలయానికి వెళ్లిన ఆయన.. అక్కడ వాస్తు సరిగా లేదని బలంగా నమ్ముతారు. దీంతో.. సచివాలయానికి వెళ్లకుండా పాలిస్తున్న కేసీఆర్.. అమావాస్యకు.. పున్న‌మికి మాత్రమే సచివాలయానికి వెళతారు. ఈ మధ్యన అది కూడా ఆపేసిన ఆయన.. వీలైనంత వరకూ ఇంటి వద్దో.. ఫాంహౌస్ నుంచో ఫైల్స్ చూస్తారని చెబుతుంటారు.

బేగంపేటలో కొత్తగా సిద్ధం చేస్తున్న క్యాంప్ కార్యాలయం పూర్తి అయిన తర్వాత.. కేసీఆర్ సచివాలయం ముఖం చూసే ఛాన్స్ లేదని చెబుతున్నారు. సచివాలయంలోని సీఎం కార్యాలయం సెటప్ ను కొత్త భవనంలోకి తీసుకొచ్చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. తన సీఎంవో మొత్తాన్ని కొత్త భవనంలోకి మార్చేయాలా? పరిమితంగా మాత్రమే మార్చాలా? అన్నది కేసీఆర్ ఇంకా డిసైడ్ కాలేదని చెబుతున్నారు. ఏది ఏమైనా.. వాస్తు నమ్మకంతో సచివాలయానికి వెళ్లకుండా నెలల తరబడి పని చేస్తున్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ గుర్తుండిపోతారనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/