Begin typing your search above and press return to search.

బాబు-ప‌వ‌న్ చేసింది కేసీఆర్ చేయ‌డ‌ట‌

By:  Tupaki Desk   |   29 March 2018 4:53 AM GMT
బాబు-ప‌వ‌న్ చేసింది కేసీఆర్ చేయ‌డ‌ట‌
X
జ‌న‌సేన అధినేత‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొద్దికాలంచేసిన కామెంట్లు గుర్తుండే ఉంటాయి. టీటీడీ ఈఓ సింఘాల్ నియామ‌కం సంద‌ర్భంగా ప‌వ‌న్ ఉత్త‌రాది - ద‌క్షిణాది వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై ప‌లువురు భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేశారు. అదే రీతిలో ఎంఎన్‌ ఎం పార్టీ అధినేత కమల్‌ హాసన్ - దక్షిణ భారతంపై ఉత్తరాది చిన్న చూపు అనే అంశాన్ని ప్రస్తావించారు. ఇటీవల డీఎంకె నేత స్టాలిన్ ద్రవిడనాడు నినాదాన్ని ముందుకు తీసుకురావడం - కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దక్షిణ రాష్ట్రాలకు నిధులు తక్కువ వస్తున్నాయనడం - అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు - కేరళ సిఎం పినరయ్ విజయన్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ వర్గాల దృష్టి దీనిపై పడింది. అయితే జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టిన కేసీఆర్ ఈ వివాదానికి దూరంగా ఉండాల‌ని చూస్తున్నార‌ట‌

ఇటీవల తెరపైకి వచ్చిన దక్షిణ భారతం - ఉత్తర భారతం పంచాయితీకి దూరంగా ఉండాలని టీఆర్‌ ఎస్ భావిస్తోంది. దక్షిణ - ఉత్తర భారత నినాదాన్ని తెరపైకి తేవడం వెనుక రెండు అంశాలు దాగి ఉన్నాయని టీఆర్‌ ఎస్ విశ్లేషిస్తోంది. గతంలో 1960లో హిందీ వ్యతిరేక ఉద్యమం జరిగిన సమయంలో ఉత్తర - దక్షిణ భారతం అనే విభజన ప్రజల్లో విస్తృతంగా ఉండేదని అయితే...కాలం మారిందని పేర్కొంటూ నాటితో పోల్చితే ప్రస్తుతం దేశ ప్రజల మధ్య సమగ్రత చాలా పెరిగిందని టీఆర్‌ ఎస్ వ‌ర్గాలు అంటున్నాయి. అందుకే ఉత్త‌రాది-ద‌క్షిణాది వివ‌క్ష‌కు దూరంగా ఉండాల‌ని గులాబీ ద‌ళ‌ప‌తి చూస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తులకు కేంద్ర - రాష్ట్ర సంబంధాలు పునర్ నిర్వచించాల్సిన అవసరముందని, ముఖ్యంగా ఫెడరల్ స్ఫూర్తిని మరింత పెంపొందించాలని - రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని భావిస్తోంది. అందులో భాగంగానే తాము ఫెడరల్ ఫ్రంట్‌ ను ముందుకు తీసుకువస్తున్నట్లు వివరించారు.

దక్షిణ - ఉత్తర భారత వివాదంలో పడితే తాము ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్‌ కు ఇబ్బంది కలిగిస్తుందని టిఆర్‌ ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. అందరు అనుకుంటున్నట్లు తాము ప్రతిపాదిస్తున్నది ప్రత్యామ్నాయ ఫ్రంట్ కాదని, ప్రత్యామ్నాయ విధానమని ఆ పార్టీ చెబుతోంది. ఇందుకు కేవలం రాజకీయ పార్టీలనే కాకుండా - దేశంలోని వివిధ వర్గాల వారిని కూడా కలిసి - ఈ భావనలో భాగస్వామ్యం చేస్తామని టిఆర్‌ ఎస్ నేత ఒకరు తెలిపారు. అలాంటి వారిలో ఎవరితో మాట్లాడొచ్చనే విషయంపై జాబితాను రూపొందిస్తున్నారు. అందులో మరాఠీ - హిందీ - కన్నడ - తమిళ - ఉర్దూ - తదితర భాషల కవులు - రచయితలను గుర్తిస్తున్నారు. టీఆర్‌ ఎస్ అధినేత - సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్‌పై పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తరువాత మరింత వేగంగా అడుగులు వేయాలని టీఆర్‌ ఎస్ భావిస్తోంది.