Begin typing your search above and press return to search.

మూడోరోజు యాగం మహాద్భుతం

By:  Tupaki Desk   |   26 Dec 2015 5:17 AM GMT
మూడోరోజు యాగం మహాద్భుతం
X
వ్యక్తిగత హోదాలో కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయాగానికి జనం పోటెత్తుతున్నారు. ఓపక్క సామాన్యులు.. మరోపక్క వీవీఐపీలు ప్రవాహంలా వస్తున్న పరిస్థితి. యాగం తొలి రోజున 50వేల మంది వస్తే.. రెండో రోజు లక్షకు పైగా వచ్చారు. మూడో రోజు అనుకున్న దానికి మించి భారీగా భక్తజనం తరలి రావటంతో ఈ అంకె 2.5 లక్షలకు చేరుకుంది. దీంతో.. యాగస్థలి మొత్తం జనసంద్రంగా మారింది. దీనికి తోడు.. వీఐపీలు కూడా భారీగా రావటం గమనార్హం. తొలి రెండురోజుల్లో వచ్చిన వీఐపీలకు చెందిన కుటుంబ సభ్యులు పలువురు మూడో రోజు రావటం కనిపించింది.

ఒక్కరోజులో రెండు లక్షల మంది యాగానికి పోటెత్తటంతో మొదటి రోజు అన్నీ అందరికి అందిన చాలా సౌకర్యాలు మూడో రోజు అందని పరిస్థితి. ఈ విషయంలో నిర్వాహకుల్ని నిందిలేని పరిస్థితి. అంచనాలకు మించి భారీగా భక్తజనం తరలిరావటం ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. ముఖ్యమంత్రే స్వయంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించటం వల్ల ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఆయన చేతుల్లో ఉండటంతో ఇంతమందిని కంట్రోల్ చేయటం సాద్యమైంది కానీ.. వేరే వారి వల్ల అయితే.. సాధ్యమయ్యేది కాదు కూడా.

ఒకవేళ.. కేసీఆర్ కాకుండా ఇంకెవరు ఇలాంటి యాగం చేసినా.. వీవీఐపీలు.. సామాన్యులు ఈ స్థాయిలో వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఇక.. మూడో రోజు యాగం వద్ద చోటు చేసుకున్న విశేషాలు చూస్తే..

= శుక్రవారం.. అందులోకి సెలవు దినం కావటంతో భక్త జనం భారీగా వచ్చారు. వచ్చిన భక్తుల్లో తెలంగాణలోని పలు జిల్లాల నుంచే కాదు.. ఏపీ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు రావటం కనిపించింది.

= హైదరాబాద్ లో స్థిరపడిన పలు జిల్లాలకు చెందిన ఆంధ్రుల రాక యాగం దగ్గర కనిపించింది.

= పెద్ద ఎత్తున ప్రజలు యాగానికి తరలిరావటంతో భారీగా ట్రాఫిక్ జాం చోటు చేసుకుంది. దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

= దీంతో వాహన రాకపోకల మీద ఆంక్షలు విధించటంతో పెద్ద ఎత్తున భక్తులు తమ వాహనాల్ని పార్కింగ్ చేసిన ప్రదేశం నుంచి నాలుగైదు కిలోమీటర్ల వరకూ నడవాల్సి వచ్చింది.

= భక్తులు వచ్చిన వాహనాలే దాదాపుగా 30వేల మంది వరకు ఉంటాయన్నది ఒక అంచనా.

= ట్రాఫిక్ జాంలో ఇరుక్కపోయిన ప్రముఖుల్లో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ తో పాటు పలువురు ప్రముఖులున్నారు. వీరేకాదు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ట్రాఫిక్ జాం బాధితులే కావటం గమనార్హం.

= ముగ్గురు యతీశ్వరులు శుక్రవారం యాగానికి రావటం ఒక విశేషం. చినజీయర్ స్వామి.. మాధవానంద స్వామి.. పరిపూర్ణానంద స్వామి వచ్చారు.

= వచ్చే వారి సంఖ్య భారీగా పెరగటంతో అందరికి భోజనాలు.. మంచినీళ్లు ఏర్పాటు చేయటంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి.

= మరుగుదొడ్లు.. మూత్రశాలల వద్ద కూడా సమస్యలు ఎదురయ్యాయి.

= తప్పిపోవటాలు.. ప్రమాదాలు.. తొక్కిసలాటలు లాంటివి చోటు చేసుకోకపోవటం కొంతలో కొంత ఉపశమనం కలిగిస్తుంది.

= శుక్రవారం ఒక్కరోజులో కుంకుమార్చన చేసిన మహిళలు దాదాపు 25వేల మంది వరకు ఉండొచ్చని అంచనా.

= ఇంత భారీగా మహిళలు కుంకుమార్చన చేసినప్పటికీ.. వారందరికి ప్రసాదాలు ఇవ్వటం కనిపించింది.

= యాగస్థలి వద్ద ప్రదక్షిణ చేసేందుకు ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకూ భక్త జన సందోహం కొనసాగుతూనే ఉంది.

= ‘‘రాజ పోషకులు’’ అనే మాట ముఖ్యమంత్రి కేసీఆర్ కు సరిగ్ సరిపోతుందని అంటూ స్వాములు పేర్కొనటం గమనార్హం.

= యాగస్థలి లోపలకు వెళ్లేందుకు దీక్షా వస్త్రాల ధరించటం తప్పనిసరి. అయితే.. దీక్షా వస్త్రాలు తగినన్ని లేకపోవటంతో వీఐపీలు పలువురు లోపలకు వెళ్లలేకపోయారు.

= పోలీసు దస్తుల్లో ఉన్న వారి కంటే దీక్షా వస్త్రాలు ఉన్న వారు భక్తుల్ని నియంత్రించటంలో ప్రభావవంతంగా వ్యవహరించటం గమనార్హం.

= యాగస్థలి వద్ద కీలక పాత్ర పోషిస్తున్న పలువురు టీఆర్ఎస్ గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. దీక్షా వస్త్రధారణతో రోజూవారీగా కనిపించే దానికి భిన్నంగా కనిపించారు.