Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఆరోగ్య ర‌హ‌స్యం ఇద‌న్న‌మాట‌

By:  Tupaki Desk   |   21 July 2016 10:00 AM GMT
కేసీఆర్ ఆరోగ్య ర‌హ‌స్యం ఇద‌న్న‌మాట‌
X
తెలంగాణ సీఎం కేసీఆర్.. అన్ని విష‌యాల్లోనూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేకత పాటించే వ్య‌క్తి. తాను నిర్ణ‌యించుకున్న దారిలో ఎన్ని అవాంత‌రాలు వ‌చ్చినా.. ఎంద‌రు ఏమ‌నుకున్నా ఆయ‌న ప‌య‌నం మాత్రం ఆప‌రు. ఇప్పుడు ఈ విష‌యాల‌న్నీ ఎందుకు అనుకుంటున్నారా? ఇటీవ‌ల ఆయ‌న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆహ్వానం మేర‌కు సీఎంల మీటింగ్ నిమిత్తం ఢిల్లీ వెళ్లారు. అయితే, మారిన వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా కేసీఆర్ తీవ్ర జ్వ‌రానికి గుర‌య్యారు.

దీంతో సీఎంల సమావేశం నుంచి మ‌ధ్య‌లోనే బ‌య‌ట‌కి వ‌చ్చి త‌న బ‌స‌కు చేరుకున్నారు. తాను ఆ స‌మావేశంలో చెప్ప‌దలుచుకున్న విష‌యాన్ని లిఖిత పూర్వ‌కంగా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాజీవ్ శ‌ర్మ‌కు ఇచ్చి వ‌చ్చారు. అయితే, కేసీఆర్ జ్వ‌రం విష‌యం తెలుసుకున్న ప్ర‌ధాని మోడీ ఆయ‌న‌ను ఎలా ఉంది అని ప్ర‌శ్నించ‌డ‌మే కాకుండా ఇంకొంత చొర‌వ తీసుకుని ఎయిమ్స్ వైద్యుల‌ను ఇంటికి పంప‌నా అని అడిగార‌ట‌. అయితే, కేసీఆర్ ప్ర‌ధాని మోడీ ఆఫ‌ర్‌ ను సున్నితంగా తిర‌స్క‌రించారు.

తాను అల్లోప‌తి వైద్యం క‌న్నా దేశీయ వైద్య‌మైన ఆయుర్వేదాన్ని న‌మ్ముతాన‌ని, ఆ మందుల‌నే వినియోగిస్తాన‌ని చెప్పార‌ట‌. అదేస‌మ‌యంలో త‌న ఫ్యామిలీ ఆయుర్వేద వైద్యుడిని ఢిల్లీకి పిలిపించుకున్న‌ట్టు కూడా ఆయ‌న చెప్పారు. దీంతో మోడీ ఒక్క‌సారిగా ఆశ్య‌ర్యానికి గుర‌య్యార‌ట‌. ఎంద‌కంటే మోడీకి దేశీయ వైద్య విధానాలంటే అమిత‌మైన మ‌క్కువ‌. అంతేకాదు, యోగాకు ప్ర‌పంచస్థాయి గుర్తింపు తెచ్చేందుకు ఎంతో కృషి చేశారు.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న కేసీఆర్ ఆయుర్వేద వైద్యం చేయించుకున్నార‌ని తెలిసి దాని గురించి ఆస‌క్తిగా అడిగి తెలుసుకున్నార‌ట‌. ఈ సంద‌ర్భంగా ఆయుర్వేద వైద్యాన్ని తాను ఎన్నాళ్ల నుంచి తీసుకుంటున్న‌దీ కేసీఆర్ వివ‌రించిన‌ట్టు స‌మాచారం. ఇక‌, ఆయుర్వేద వైద్యంతో కేసీఆర్ త్వ‌ర‌గా కోలుకోవ‌డంపైనా మోడీ ఆనందం వ్య‌క్తం చేశార‌ట‌. దీంతో ఇరువురూ త‌మ‌త‌మ అభిరుచులు క‌లిశాయ‌ని కూడా అనుకున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఇదీ కేసీఆర్ ఆరోగ్య ర‌హ‌స్యం!