Begin typing your search above and press return to search.

ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు కేసీఆర్ భూమి పూజ

By:  Tupaki Desk   |   2 Sep 2021 9:30 AM GMT
ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు కేసీఆర్ భూమి పూజ
X
తెలంగాణ ప్ర‌గ‌తిలో మ‌రో అరుదైన అద్భుతమైన ఘట్టం చోటు చేసుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌రో ప్ర‌స్థానానికి నాంది ప‌లికారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ కార్యాల‌యానికి నేడు శంకుస్థాప‌న జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన భూమి పూజ‌లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సీఎంతో పాటుగా తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇత‌ర ప్ర‌తినిధులు ఆ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. వేద మంత్రోచ్ఛ‌ర‌ణ మ‌ధ్య భూమి పూజ నిర్వ‌హించారు. తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణం కోసం శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాన్ని వ‌సంత్ విహార్‌లో చేప‌ట్టారు. ఢిల్లీలోని వ‌సంత్ విహార్ వేద‌ఘోష‌తో మారుమోగింది. ఆ ప్రాంతంలో ఉన్న సుమారు 1100 చ‌ద‌ర‌పు మీట‌ర్ల ప్రాంగ‌ణంలో తెలంగాణ భ‌వ‌న్‌ ను నిర్మించ‌నున్నారు. త్రీ ప్ల‌స్ త్రీ రీతిలో భ‌వ‌నాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.

నేడు భూమి పూజ స‌మ‌యంలో ముందుగా సీఎం కేసీఆర్ హోమంలో పాల్గొన్నారు. వేద వ‌చ‌నాల‌తో వసంత్ విహార్ వెల్లువిరిసింది. పండితులు మంత్రోచ్ఛ‌ర‌ణ‌తో శుభ‌సందేశాలిచ్చారు. మంగ‌ళ‌క‌ర‌మైన దీవెన‌ల‌తో ఆ ప్రాంగ‌ణం దివ్య‌వెలుగులు విరజిమ్మాయి. వచ్చే ఏడాది దసరాలోగా భవన నిర్మాణాన్ని పూర్తి చేసి పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల అధినేతలను ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలనే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభంలోనే శంకుస్థాపన కార్యక్రమం జరగాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్‌ వేవ్, లాక్‌డౌన్‌ వల్ల కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది.

టీఆర్‌ ఎస్‌ కార్యాలయ నిర్మాణం కోసం 1300 గజాల స్థలాన్ని కేటాయించింది కేంద్రం. ఇప్పటి వరకూ దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏ ప్రాంతీయ పార్టీకి ఢిల్లీలో ఆఫీసు లేదు. సంకీర్ణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన డీఎంకే, ఏఐడీఎంకే, టీడీపీ, జనతాదళ్ ఎస్ వంటి పార్టీలకు ఇక్కడ ఎలాంటి భవనం లేదు. ఒక్క సమాజ్ వాది పార్టీకి మాత్రమే సొంత భవనం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్ మూడు ప్రధాన ప్రాంతీయ పార్టీలుంటే.. ఇప్పటి వరకూ వీటిలో ఏ ఒక్క పార్టీకీ సొంత భవనం లేదు. ఇపుడీ గులాబీ భవన నిర్మాణంతో టీఆర్ ఎస్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయబోతుంది. 40 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జీ ప్లస్ 3 భవన సముదాయంతో టిఆర్ ఎస్ భవన్‌ ను నిర్మించనున్నారు. మీటింగ్‌ హాల్‌ తో పాటు రాష్ట్రం నుంచి వివిధ పనుల మీద వచ్చే వారు స్టే చేసేందుకు అన్ని వసతులుండేలా ఈ భవన నిర్మాణాన్ని డిజైన్ చేశారు. హస్తిన పర్యటనలో భాగంగా కేసీఆర్‌ మూడురోజులు పాటు ఢిల్లీలో ఉండనున్నారు.