Begin typing your search above and press return to search.

ప్రగతిభవన్ లో తెలంగాణ వ్యతిరేకులకు కేసీఆర్ దావత్ లా?

By:  Tupaki Desk   |   10 Jan 2022 3:32 AM GMT
ప్రగతిభవన్ లో తెలంగాణ వ్యతిరేకులకు కేసీఆర్ దావత్ లా?
X
తెలంగాణ వ్యతిరేకులకు కేసీఆర్ దావత్ లు! భలే పాయింట్ పట్టిన బీజేపీ సీఎం
తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదు. ఈ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేశారు అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ. సందర్భానికి అనుగుణంగా సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీసి.. ప్రత్యర్థుల మీద ప్రయోగించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. ఆయన మాదిరే వ్యవహరిస్తున్నారు బీజేపీ నేతలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వేళలోనే.. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడ్ని అరెస్టు చేసి.. జైలుకు తరలించిన వైనంపై కమలనాథులు సీరియస్ గా ఉన్నారు.

గడిచిన మూడు రోజులుగా వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ ముఖ్యనేతల్ని తెలంగాణకు తీసుకొస్తున్న వారు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపై విరుచుకుపడే వ్యాఖ్యలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను తీసుకొచ్చి.. కేసీఆర్.. నువ్వు రెండోసారి సీఎంవి. నేను నాలుగోసారి ముఖ్యమంత్రిని అంటూ.. తన అధిక్యతను చాటటం ద్వారా.. గులాబీ బాస్ ను సీనియార్టీని తక్కువ చేసే ప్రయత్నం చేశారు.తాజాగా అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి.. బీజేపీ ఫైర్ బ్రాండ్ గా చెప్పే హిమంత బిశ్వశర్మను తీసుకొచ్చి.. హన్ముకొండలో నిర్వహించిన సభలో మాట్లాడించారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ఆసక్తికరంగానే కాదు.. కేసీఆర్ అండ్ కోకు చుర్రుమనిపించేలా ఉండటం గమనార్హం.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన సీపీఎం అగ్రనేతలతో పాటు.. కేరళ ముఖ్యమంత్రితో భేటీ కావటాన్ని హిమంత తప్పు పట్టారు. ‘తెలంగాణ వద్దన్న వారికి సీఎం కేసీఆర్ దావత్ లు ఇస్తున్నారు’ అంటూ మండిపడ్డారు. ఇటీవల కాలంలో తెలంగాణ అస్త్రాన్ని ఇంత పర్ ఫెక్టుగా సంధించిన ఘనత హిమంతకు దక్కుతుంది. తన వ్యాఖ్యలతో టీఆర్ఎస్ నేతల్ని ఆత్మరక్షణలో పడేయటంలో అసోం సీఎం సక్సెస్ అయ్యారన్న మాట వినిపిస్తోంది. నిత్యం తెలంగాణ సెంటిమెంట్ తనకు మాత్రమే సొంతమన్నట్లుగా వ్యవహరిస్తూ.. తరచూ తట్టి లేపే ఆయన.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన సీపీఎం నేతలతో భేటీ కావడం తప్పే అన్న విషయాన్ని తన ప్రశ్నతో స్పష్టం చేశారని చెప్పాలి.

అంతేకాదు.. ఔరంగజేబ్.. నిజాం వారసత్వాన్ని కేసీఆర్ కొనసాగిస్తున్నారని.. పోలీసుల మద్దతుతో కేసీఆర్ ఎన్ని రోజులు పాలిస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ నియంతృత్వం ఇక చెల్లబోదన్న ఆయన.. తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు. 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో హన్మకొండలో ఏర్పాటు చేసిన నిరసన సభలో ఆయన మాట్లాడారు. ప్రజాబలం ముందు ధన బలం పనిచేయదని.. ఈటల రాజేందర్ ను ఓడించటానికి రూ.500 కోట్లు ఖర్చు పెట్టారన్నారు.

ఈటల గెలుపుతో కేసీఆర్ మైండ్ పనిచేయడం లేదన్నారు. కేసీఆర్ ను చూసి ఏదైనా నేర్చుకుందామని వచ్చానని.. కానీ నేర్చుకోవడనాకి ఇక్కడ ఏం లేదన్నారు. ‘‘యువకులు, ప్రజలు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నారు. పోలీసులు మాత్రమే సపోర్ట్‌గా ఉన్నారు. 317 జీవో ఎమోషన్ అర్థమైంది. కొడుకును సీఎం చేయడంపైనే కేసీఆర్ దృష్టి పెట్టారు. దేశం మారింది. కేసీఆర్ నాటకాలు సాగవు’’ అని వ్యాఖ్యానించారు. అసోంలో తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు ఇచ్చామని.. కానీ.. కేసీఆర్ మాత్రం తన మాటను నెరవేర్చుకోలేదన్నారు.

సంపన్న రాష్ట్రమైన తెలంగాణ ఆదాయం రూ.9 లక్షల కోట్లు అయితే.. వెనుకబడిన రాష్ట్రంగా పేరున్న అసోం ఆదాయం రూ.3లక్షల కోట్లుగా చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు. కేసీఆర్ తన అధికారంతో కుటుంబానికి దోచి పెడుతున్నారని.. కేసీఆర్ అరాచకాలు పెరిగాయన్నారు. పోలీసుల మద్దతుతో కేసీఆర్ ఎన్ని రోజులు పాలిస్తారు? అని ప్రశ్నించారు. మొత్తానికి తెలంగాణకు వచ్చి కేసీఆర్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వారిలో.. ఎక్కువగా డ్యామేజ్ చేసిన బీజేపీ నేతగా అసోం సీఎం నిలుస్తారని చెప్పకతప్పదు.