Begin typing your search above and press return to search.

కేసీఆర్ మురిసిపోయారు.. రూ.10లక్షలు ఇచ్చారు

By:  Tupaki Desk   |   11 April 2016 6:19 AM GMT
కేసీఆర్ మురిసిపోయారు.. రూ.10లక్షలు ఇచ్చారు
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి ఎంత ప్రాక్టికల్ గా ఉంటుందో.. అంతే నాటకీయంగా కూడా కొన్ని సందర్భాల్లో వ్యవహరిస్తుంటారు. నిజానికి ఈ రెండు భిన్న కోణాలు అయినప్పటికీ..ఈ రెండింటిని అవసరానికి తగినట్లుగా తెర మీదకు తీసుకురావటం కేసీఆర్ కు మాత్రమే చెల్లుతుంది. ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించటమే కాదు.. వారు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసేలా చేయటం కేసీఆర్ కు అలవాటు. మిగిలిన ముఖ్యమంత్రులకు భిన్నంగా ఆయన కొన్నిసార్లు నాటకీయ రీతిలో వ్యవహరిస్తుంటారు. తాజాగా ఆయన అలాంటి వైఖరినే ప్రదర్శించారు.

ఖమ్మం జిల్లాకు చెందిన కిరణ్ కుమార్.. సుధారాణి దంపతుల గారాల పట్టి లక్ష్మీ శ్రీజ. మూడో తరగతి చదువుతున్న శ్రీజను ప్రశ్నలు వేయాలే కానీ.. సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే వారు సైతం చెప్పలేని చాలా ప్రశ్నలకు.. మరి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన సంగతులు.. తెలంగాణ చరిత్ర.. అనంతర పరిణామాల మీద గుక్క తిప్పుకోకుండా సమాచారం చెప్పేస్తుంది.ఈ చిచ్చర పిడుగు మాటలు వింటే విస్మయం చెందాల్సిందే.

ఆమె గురించి తెలుసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తన ఇంటికి ఆ చిన్నారిని.. వారి తల్లిదండ్రుల్ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీజతో మాట్లాడిన కేసీఆర్.. ఆమె మేధస్సును చూసి మురిసిపోయారు. సంతోషం పట్టలేక.. అప్పటికప్పుడు 10లక్షల 16 రూపాయిల చెక్కును తన సొంత ఖాతా నుంచి తీసి ఇవ్వటమే కాదు.. కలిసి భోజనం చేశారు. బాగా చదువుకోవాలని ఆశీర్వదించారు. తాను వీలు చూసుకొని శ్రీజ ఇంటికి వస్తానని.. భోజనం చేస్తానని ఆయన చెప్పటం విని ఆ చిన్నారి.. వారి తల్లిదండ్రులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తమను పాలించే నేత నోటి నుంచి అలాంటి స్పందన వస్తే ఎవరు మాత్రం ఉక్కిరిబిక్కిరి కాకుండా ఉంటారు?