Begin typing your search above and press return to search.

తాజా వరం; కాంట్రాక్టర్లకు కేసీఆర్ మార్క్ బోనస్

By:  Tupaki Desk   |   21 Nov 2015 4:48 AM GMT
తాజా వరం; కాంట్రాక్టర్లకు కేసీఆర్ మార్క్ బోనస్
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పనిని ఎప్పుడు ఎలా చేయాలో ఆయనకు బాగా తెలుసు. ప్రతికూలతను సానుకూలతగా మార్చుకోవటంలో ఆయనకు మించిన మొనగాడు సమకాలీన తెలుగు రాజకీయాల్లో ఎవరూ కనిపించరు. వ్యూహాల్ని రచించటంలో ఆయనకు ఆయనే సాటి. తన మీద తీవ్రస్థాయిలో వ్యతిరేకత.. అసంతృప్తి వెల్లువెత్తే సందర్భాల్ని.. క్షణాల వ్యవధిలో తనకు అనుకూలంగా మార్చుకోవటం ఆయనకు మాత్రమే కుదురుతుందేమో.

ఇలాంటి ఎన్నో విలక్షణతలు ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. పాలన విషయంలో పెద్దగా ఫోకస్ పెట్టటం లేదన్న విమర్శ ఉంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని సరిగా నడిపించటంలో ఆయన తన మార్క్ ను ప్రదర్శించలేదన్న ఆరోపణ ఆయనపై ఉంది.

వరాలు ఇచ్చే విషయంలో ఉన్న హుషారు.. వాటిని పూర్తి చేసే విషయంలో పెద్దగా దృష్టి పెట్టటం లేదన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితి రానున్న రోజుల్లో మరింత ఇబ్బందికరంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేసీఆర్ తాజాగా ఓ నిర్ణయాన్ని తీసుకున్నారు.

తాను ఎన్ని మాటలు చెప్పినా.. చివరకు ఆ మాటలు చేతల్లోకి వస్తేనే ప్రయోజనం. అప్పుడు మాత్రమే ఆయన ఆశించిన ఫలితం వస్తుంది. అందుకే.. ప్రాజెక్టులకు సంబంధించిన కాంట్రాక్టర్లకు తాజాగా ఆయన మార్క్ వరాన్ని ఇచ్చారు. ప్రాజెక్టుల పూర్తి విషయంలో కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయిన ఆయన.. ప్రాజెక్టును పేర్కొన్న సమయంలో పూర్తి చేసిన వారికి నజరానా ఇస్తానని ప్రకటించారు.

ప్రాజెక్టులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయని కాంట్రాక్టర్ల మీద కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసిన ఆయన.. ఒప్పుకున్న పనుల్ని.. ఒప్పుకున్న సమయానికి కానీ పూర్తి చేస్తే.. వారికి మొత్తం కాంట్రాక్ట్ విలువలో 1 శాతాన్ని ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించారు. మరి.. కేసీఆర్ వరాన్ని ఎంతమంది కాంట్రాక్టర్లు అందిపుచ్చుకుంటారో చూడాలి.