Begin typing your search above and press return to search.
ఏపీలో మరోసారి కేసీయార్ మార్క్ పాలిటిక్స్...?
By: Tupaki Desk | 27 Sep 2022 2:30 PM GMTకేసీయార్ తెలంగాణాకు సీఎం అయినా ఏపీ వైపు కూడా ఆయన చూపు ఉంటుంది. ఆయన పూర్వీకులది ఏపీ అనే చెబుతారు. ఇక కేసీయార్ పట్ల ఆదరణ చూపించేవారు ఏపీలో చాలా మంది ఉన్నారు. కేసీయార్ తెలంగాణాలో చేస్తున్న రాజకీయం ఏపీ మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార సంబంధ విషయాలలో ఏపీ నుంచి తెలంగాణాకు చాలా వెళ్ళి మంది వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వారున్నారు. దాంతో ఉమ్మడి ఏపీగా ఉన్నా విడిగా ఉన్నా తెలంగాణా ప్రభావం పొలిటికల్ గా కచ్చితంగా ఉంటుంది.
ఇవన్నీ పక్కన పెడితే 2014 నుంచి ఏపీ రాజకీయాల మీద కేసీయార్ ఫోకస్ పెట్టి ఉంచారు. తనకు అనుకూలమైన వారు అక్కడ గెలవాలని ఆయన చూశారు. ఆనాడు జగన్ కి టీయారెస్ మద్దతు ఇచ్చింది. అయితే టీడీపీ గెలిచింది. 2019లో మాత్రం జగన్ గెలిచారు దాని వెనక టీయారెస్ అన్ని విధాలుగా చేసిన సాయం ఉంది అని అంటున్నారు. ఏపీలో జగన్ సీఎం కావాలని టీయారెస్ బలంగా కోరుకుంది.
దానికి కారణం చంద్రబాబు పట్ల వ్యతిరేకత. ఇక మూడేళ్ళ జగన్ ఏలుబడిలో తెలంగాణాతో ఏపీ సంబంధాలు ఎలా ఉన్నా జగన్ కేసీయార్ ల మధ్య పెద్దగా రాజకీయ ఇబ్బందులు అయితే రాలేదు అనే అంటారు. ఇద్దరూ బయటకు కనిపించని స్నేహాన్ని కొనసాగిస్తున్నారు అనే అంటారు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా జగన్ కే కేసీయార్ ఓటు వేస్తారు. ఆయనకు చంద్రబాబు పొడ గిట్టదు. అందుకే మరోసారి అంటే 2024లో జగన్ ఏపీలో అధికారంలోకి రావాలని కేసీయార్ కోరుకుంటున్నారా అన్న చర్చ సాగుతోంది.
ఇక కేసీయార్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ఆయన భారత రాష్ట్ర సమితిని ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రచారం నిజమైతే విజయదశమి రోజున కేసీయార్ బీయారెస్ పేరిట జాతీయ పార్టీని ప్రకటిస్తారని అంటున్నారు. బీయారెస్ కి గులాబీ జెండా కారు గుర్తుగా ఉంటాయని చెబుతున్నారు. మొత్తం 150 ఎంపీ సీట్లలో బీయారెస్ పోటీకి దిగుతుంది అని అంటున్నారు
బీయారెస్ తెలంగాణా, కర్నాటక, మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాలలో పోటీకి దిగుతుందని అంటున్నారు. అయితే పొరుగున ఉన్న ఏపీలో పోటీ చేయదనే చెబుతున్నారు. దానికి ముందే చెప్పుకున్నట్లుగా మిత్రుడు జగన్ ఉండడమే కారణమట. అక్కడ కనుక బీయారెస్ పోటీ చేస్తే చంద్రబాబు వ్యతిరేక ఓట్లు చీలిపోయి జగన్ కి రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని ఊహించే కేసీయార్ ఏపీలో పోటీ చేయరని అంటున్నారు. మరో వైపు జాతీయ పార్టీగా బీయారెస్ ని స్థాపిస్తున్నందువల్ల తెలంగాణా ఆంధ్రా ప్రాంతీయ రాజకీయాల వివాదాలు చుట్టుకోకుండా కూడా ఏపీని పక్కన పెడుతున్నారు అని అంటున్నారు.
ఈ పరిణామం బట్టి చూస్తే ఏపీలో జగన్ మళ్లీ అధికారంలోకి రావాలని కేసీయార్ చూస్తున్నట్లే అనుకోవాలి. మరి కేసీయార్ ఇలా ఉత్తరాది రాష్ట్రాలు, ఇతర దక్షిణాది రాష్ట్రాలలో పోటీకి దిగి ఏపీని పక్కన పెడితే బీజేపీ వంటి పార్టీలు దీన్ని ఎలా చూస్తాయో అన్న చర్చ కూడా ఉంది. ఇక బీయారెస్ పార్టీని ప్రకటించాక ఢిల్లీ లో కానీ పాట్నాలో కానీ లేక యూపీలో కానీ భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించాలని కేసీయార్ ఆలోచిస్తున్నారుట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.