Begin typing your search above and press return to search.

ఆంధ్రుల ఆశాకిర‌ణం కేసీఆర్‌.. ఈ హ‌డావుడి పెరిగిందిగా!

By:  Tupaki Desk   |   24 Dec 2022 11:30 PM GMT
ఆంధ్రుల ఆశాకిర‌ణం కేసీఆర్‌.. ఈ హ‌డావుడి పెరిగిందిగా!
X
ఏపీలో అడుగులు పెట్టేందుకు ఉద్యుక్తుల‌వుతున్న బీఆర్ ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ.. `ఆంధ్రుల ఆశాకిర‌ణం` అనే నినాదాలు వినిపిస్తున్నాయి. తాజాగా కొన్ని ప‌త్రిక‌లు కూడా ఈ విష‌యాన్ని హైలెట్ చేయ‌డం గ‌మ‌నార్హం. త్వ‌ర‌లోనే ఏపీలో బీఆర్ ఎస్ త‌ర‌ఫున మ‌హాస‌భ‌లు నిర్వ‌హిస్తున్నార‌ని.. కొంద‌రు చెబుతున్నారు. వాస్త‌వానికి జాతీయ పార్టీ గా టీఆర్ ఎస్ ను మార్చిన నాటి నుంచి కూడా కేసీఆర్ ఏపీలో అడుగులు పెడ‌తార‌ని అంద‌రూ ఊహిస్తున్న‌దే. అయితే.. ఇప్పుడు దీనికి సంబందించిన వార్తలు కూడా వ‌స్తున్నాయి.

జ‌న‌వ‌రిలో 20-25 వ‌రకు ఐదురోజుల పాటు కేసీఆర్‌.. ఏపీలో పర్య‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మస్య‌ల‌పై పోరాడేం దుకు కేసీఆర్ వ‌స్తున్నారంటూ.. ఓ ప‌త్రిక ప్ర‌ముఖంగా వార్త‌లు ప్ర‌చురించింది. అంతేకాదు.. ఆయ‌న రాక‌ను స్వాగతిస్తున్న‌ట్టు మ‌రికొంద‌రు ప్ర‌క‌ట‌న ఇవ్వ‌డం కూడా గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల మేర‌కు రెండు తెలుగు రాష్ట్రాల‌కు కేంద్రంలోని మోడీ అన్యాయం చేస్తున్నార‌నే వాద‌న ఉంది. ఇది ఏపీలోను, తెలంగాణ‌లోనూ ప్ర‌జ‌ల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌స్తోంది. తెలంగాణలో అధికార పార్టీ సార‌థి జాతీయ పార్టీ పెట్ట‌డానికి కూడా ఇదే ఆలంబ‌న‌గా మారింది.

కేంద్రం చేస్తున్న నిర్ణ‌యాల‌తో తెలంగాణ న‌ష్ట‌పోతోంద‌ని, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని, ముఖ్యంగా రైతుల‌కు మేలు జ‌ర‌గ‌డం లేద‌ని.. వాదిస్తున్న కేసీఆర్.. ఇదే ఉద్దేశంతో కేంద్రంపై యుద్ధానికి రెడీ అయ్యారు. ఇక‌, ఏపీని తీసుకుంటే.. ఏపీలోనూ కేంద్రం నుంచిచేయాల్సిన అనేక ప‌నులు పెండింగులో ఉన్నాయి. విభ‌జ‌న చ‌ట్టం మేరకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వ‌డం లేదు. అదేస‌మ‌యంలో ప్ర‌త్యేక హోదాను అట‌కెక్కించారు. అప్పులు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తూ.. రాష్ట్రాన్ని అధోగ‌తి పాల్జేస్తున్నార‌నే వాద‌న‌కూడా ఉంది.

అదేస‌మ‌యంలో కేంద్రంపై పోరాడ‌డంలో టీడీపీ, వైసీపీలువిఫ‌ల‌మ‌వుతున్నాయ‌నే వాద‌న కూడా ఉంది. ఇలాంటి స‌మ‌యంలో ఏపీ స‌మ‌స్య‌ల‌ను సాధించేందుకు.. కేంద్రంపై పోరాడేందుకు.. కేసీఆర్‌ను మించిన నాయ‌కుడు లేడ‌ని.. ఏపీ స‌మ‌స్య‌ల‌పై కూడా ఆయ‌న పోరాటం చేయ‌నున్నార‌ని.. తాజాగా వ‌స్తున్న వార్త‌ల‌ను బ‌ట్టి తెలుస్తోంది.

అందుకే ఆయ‌న‌ను ఏపీ ఆశాకిర‌ణంగా వ‌ర్ణిస్తూ.. పెద్ద ఎత్తున కీర్తిస్తున్నారు. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాకు స‌రిహ‌ద్దుల్లోని ఏపీ గ్రామాల్లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు సైతం ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. మ‌రిమున్ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.