Begin typing your search above and press return to search.

చైనా టూర్:3 గంటలు..30 మందితో మీటింగ్

By:  Tupaki Desk   |   9 Sep 2015 4:29 AM GMT
చైనా టూర్:3 గంటలు..30 మందితో మీటింగ్
X
పదిరోజుల చైనా పర్యటనకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిరోజును బిజీబిజీగా గడిపేశారు. మంగళవారం ఆయనేం చేశారు? అన్న ప్రశ్నకు సమాధానం భారీగానే చెప్పాల్సి ఉంటుంది.

చైనాకు వెళ్లిన కేసీఆర్.. వరుస మీటింగ్ లలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపార అవకాశాల గురించి వివరంగా చెప్పిన ఆయన.. పరిశ్రమల స్థాపనకు తాము చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికి ఎలాంటి వసతులు ఉంటాయన్న విషయంతో పాటు.. అనుమతుల విషయంలోనూ తాము చేపడుతున్న చర్యల గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు.

పరిశ్రమల స్థాపనకు తమ రాష్ట్రానికి వచ్చే వారికి తమ సర్కారు పెద్ద పీట వేస్తుందని.. అవినీతి దరిదాపుల్లోకి రాకుండానే.. అనుమతులు ఇచ్చేస్తామని వివరించారు. అనుమతుల కోసం దరఖాస్తు పెట్టుకున్న నాటి నుంచి మెగా పరిశ్రమలకు 15 రోజుల వ్యవధి.. భారీ పరిశ్రమలకు 30 రోజుల వ్యవధిలో అనుమతులు ఇస్తున్నట్లు చెప్పారు.

పరిశ్రమలు పెట్టేందుకు తెలంగాణకు వచ్చే పారిశ్రామికవేత్తల కోసం తమ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసిన విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. తనను కలిసేందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలకు తెలంగాణలో ఉన్న అవకాశాల్ని వివరించేందుకు ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. మూడు గంటల వ్యవధిలో 30 మంది పారిశ్రామికవేత్తల్ని కలిసిన కేసీఆర్.. వారికి తెలంగాణలోని అవకాశాల గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారని చెబుతున్నారు.

కేసీఆర్ చెప్పిన మాటల్ని విన్న పలువురు చైనా పారిశ్రామికవేత్తలు.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబర్చారని చెబుతున్నారు. లియో గ్రూపు కంపెనీ ఛైర్మన్ తో భేటీ అనంతరం.. తెలంగాణలో రూ.వెయ్యి కోట్లతో హెవీడ్యూటీ పైపుల పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మొత్తానికి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచేందుకు.. పెట్టుబడుల్ని రాష్ట్రానికి తీసుకురావటానికి కేసీఆర్ భారీగా కసరత్తు చేస్తున్నట్లు కనపించిందన్న భావన వ్యక్తమవుతోంది.