Begin typing your search above and press return to search.

కేసీఆర్ స‌భ‌లు స్టార్ట్ అయితే ఆగ‌వ‌ట‌..!

By:  Tupaki Desk   |   19 Sep 2018 9:00 AM GMT
కేసీఆర్ స‌భ‌లు స్టార్ట్ అయితే ఆగ‌వ‌ట‌..!
X
ఊహాగానాల‌కు త‌గ్గ‌ట్లే అసెంబ్లీని ర‌ద్దు చేసి.. ముంద‌స్తుకు వెళ్లిన కేసీఆర్‌.. ప్ర‌స్తుతం ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి పాత్ర‌ను పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. అసెంబ్లీని ర‌ద్దు అనంత‌రం మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హించిన ఆయ‌న‌.. ఆ త‌ర్వాత స‌భ‌ల్లో పాల్గొన్నారు. అంతే.. ఆ త‌ర్వాత కేసీఆర్ ఏం చేస్తున్నారో.. ఎక్క‌డ ఉన్నార‌న్న విష‌యంపై మీడియా పెద్ద‌గా వార్త‌లు ఇచ్చింది లేదు.

ప్ర‌చారాన్ని పెద్ద ఎత్తున చేప‌ట్టాల‌ని చెప్ప‌టంతో పాటు.. యాభై రోజుల్లో వంద స‌భ‌ల్ని నిర్వ‌హిస్తాన‌ని చెప్పిన కేసీఆర్‌.. ఎందుక‌ని కామ్ గా ఉండిపోయారు? ప్ర‌స్తుతం ఆయ‌న ఎక్క‌డ ఉన్నారు? అన్న ప్ర‌శ్న‌లు వేసుకుంటే ఆస‌క్తిక‌ర స‌మాధానాలు వ‌స్తాయి.

అసెంబ్లీ ర‌ద్దు అనంత‌రం ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ వీలైనంత ఎక్కువ‌గా ఫాంహౌస్ వ‌ద్ద‌నే ఉండిపోయారు. టికెట్ ఆశావాహులు ప‌లువురు ఫాంహౌస్ వ‌ద్ద‌కు చేరుకొని ఆందోళ‌న చేప‌ట్ట‌టం.. వారిని అక్క‌డి నుంచి బ‌లవంతంగా పంపేయ‌టం లాంటివి చోటు చేసుకున్నా.. ఎవ‌రూ ప‌ట్టించుకున్న‌ది లేదు. మీడియాలో వార్త‌లు వ‌చ్చింది లేదు.

ఫాంహౌస్ లో ఉన్న కేసీఆర్‌.. రానున్న రోజుల్లో ఫుల్ బిజీగా ఉన్నార‌ట‌. ప్ర‌స్తుతం ఆయ‌న వ్యూహ‌ర‌చ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా అంద‌రూ ఆ కార్య‌క్ర‌మాల్లో బిజీబిజీగా ఉంటార‌ని.. అందుకే త‌న రాజ‌కీయ స‌భ‌ల‌ను వాయిదా వేసుకున్న‌ట్లు తెలుస్తోంది. 23న నిమిజ్జ‌నం పూర్తి అయిన త‌ర్వాత నుంచి స‌భ‌లు నిర్వ‌హించాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు.

23 త‌ర్వాత వ‌రుస‌గా స‌భ‌లు నిర్వ‌హిస్తార‌ని.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల‌పై ఆయ‌న ప‌లు సూచ‌న‌లు ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌.. న‌ల్గొండ‌.. ఖ‌మ్మం త‌దిత‌ర ప్రాంతాల్లో స‌భ‌లు నిర్వ‌హించే వీలుంది. ప్ర‌స్తుతం కామ్ గా ఉన్న‌ట్లుగాఅనిపిస్తున్నా.. రానున్న రోజుల్లో వాతావ‌ర‌ణం వేడెక్కేందుకు అవ‌స‌ర‌మైన క‌స‌ర‌త్తు ఫాంహౌస్ లో జ‌రుగుతున్న‌ట్లుగా తెలుస్తోంది. ఓవైపు భ‌విష్య‌త్తులో నిర్వ‌హించే స‌భ‌ల మీద ప్లానింగ్ తో పాటు.. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా తాను ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల బ‌లాబ‌లాల మీదా.. తాజాగా మారిన స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో ప‌రిస్థితులు త‌మ‌కు ఎంత వ‌ర‌కూ అనుకూలంగా ఉన్నాయ‌న్న విష‌యం మీదా కేసీఆర్ అధ్య‌య‌నం చేస్తున్న‌ట్లు చెబుతున్నారు.